లోకేశ్‌ది నైపుణ్యం ఉమేశ్‌ది దురదృష్టం..


Thu,October 11, 2018 01:13 AM

తుది జట్టులో చోటుపై బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వ్యాఖ్య
umesh-yadavహైదరాబాద్: అద్భుత ప్రతిభకు తార్కాణం వాళ్లిద్దరు. బరిలోకి దిగారంటే ఎవరికి తీసిపోని ఆటతీరుతో ఆకట్టుకునేవారు. కానీ ఇద్దరి మధ్య ఒక విషయంలో సారూప్యముంది. నిలకడగా రాణిస్తున్నా..సహచర పేసర్లతో ఎదురయ్యే పోటీతో తుది జట్టులో చోటు కోల్పోయేది ఉమేశ్ యాదవ్ అయితే..వరుసగా విఫలమవుతూ ఉన్నా అవకాశాలను అందిపుచ్చుకునే క్రికెటర్ లోకేశ్ రాహుల్ అని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వ్యాఖ్యానించాడు. శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా రెండో టెస్ట్ మొదలవుతున్న నేపథ్యంలో అరుణ్..మీడియాతో తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఉమేశ్, లోకేశ్‌తో పాటు హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్‌పై మాట్లాడాడు.

ఉమేశ్ దురదృష్టవంతుడు

ఉమేశ్ చాలా దురదృష్టవంతుడు..నిలకడగా రాణిస్తున్నా..సహచర పేసర్లు బుమ్రా, ఇషాంత్‌శర్మ కోసం స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌పై అతనికి ఎక్కువగా టెస్ట్ మ్యాచ్‌లాడే అవకాశం రాలేదు. బాగా రాణిస్తున్న బౌలర్లకు తుది జట్టులో చోటు కల్పించడం ఒక కారణమైతే..రొటేషన్‌లో భాగంగా బౌలర్లను మార్చడం మరో కారణం. అందువల్లే ఉమేశ్‌కు అవకాశాలు రాకుండాపోతున్నాయి. అయినా కూడా అవకాశమిచ్చిన ప్రతిసారి ఉమేశ్ నిరూపించుకున్నాడు. ప్రస్తుతమున్న అత్యుత్తమ పేస్‌బౌలర్లలో అతనొకడు అని అరుణ్ అన్నాడు.
lokesh

రాహుల్ తరగని ఆస్తి

గత 16 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 14సార్లు లోకేశ్ రాహుల్ విఫలమయ్యాడు. అయినా కూడా రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో అతనికి మరో అవకాశమివ్వవచ్చు. అద్భుత నైపుణ్యమున్న ఆటగాడతను. వరుస వైఫల్యాలు ఎదుర్కొంటూ వస్తున్నా..ఆత్మవిశ్వాసం నింపుతూ అవకాశాలు ఇస్తూపోతే భవిష్యత్తులో అతను తరగని ఆస్తిగా మారుతాడనడంలో సందేహం లేదు. అతని బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలున్నాయో తెలియనప్పటికీ అద్భుత నైపుణ్యముందని ఒక కోచ్‌గా చెప్పగలను అని అరుణ్ చెప్పుకొచ్చాడు.

సిరాజ్ అరంగేట్రం!

వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో హైదరాబాద్ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించిన సిరాజ్‌కు హైదరాబాద్ పిచ్‌పై మంచి అవగాహన ఉంది. ఇదే జరిగితే ఉమేశ్ యాదవ్‌ను తప్పించి సిరాజ్‌కు చోటిచ్చే అవకాశముంది. అయితే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాత్రం సిరాజ్ అరంగేట్రంపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఏ విషయానైన్నా సిరాజ్ చాలా తొందరగా నేర్చుకుంటాడు. హైదరాబాద్ రంజీ జట్టుకు కోచ్ ఉన్నప్పటి నుంచి అతన్ని దగ్గరగా చూస్తు న్నా. ఇటీవల భారత్ ఎ తరఫున రాణించడమే సిరాజ్ అద్భుత ప్రతిభకు నిదర్శనం అని అరుణ్ అన్నాడు.
bharath-arun

419

More News

VIRAL NEWS