బోణీ కొట్టిన దక్షిణాఫ్రికా


Sun,June 16, 2019 03:06 AM

కార్డిఫ్: ప్రపంచకప్‌లో పరాజయాల పరంపరకు దక్షిణాఫ్రికా ముగింపు పలికింది. నిలువాలంటే గెలువక తప్పనిసరి పరిస్థితుల్లో జూలు విదిల్చింది. శనివారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 9 వికెట్ల తేడా(డక్‌వర్త్ లూయిస్ పద్ధతి)తో ఘన విజయం సాధించి మెగాటోర్నీలో బోణీ కొట్టారు. ఆఫ్ఘన్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 28.4 ఓవర్లలో 131 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్(72 బంతుల్లో 68, 8ఫోర్లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. పసలేని ఆఫ్ఘన్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ ఆమ్లా(41 నాటౌట్)తో కలిసి జట్టు విజయంలో కీలకమయ్యాడు. ఆది నుంచే దూకుడు ప్రదర్శిస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే కెప్టెన్ నైబ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన డికాక్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ఫెల్కువాయోతో కలిసి ఆమ్లా జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. అంతకుముందు వర్షం అంతరాయం కల్గించడంతో 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ 34.1 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బౌలర్లు ఇమ్రాన్ తాహిర్(4/29), మోరిస్(3/13) విజృంభించి ఆఫ్ఘన్‌ను కుప్పకూల్చారు. తాహిర్‌కు మ్యాన్ ఆప్ ద మ్యాచ్ దక్కింది.

సంక్షిప్త స్కోర్లు: ఆఫ్ఘనిస్థాన్: 34.1 ఓవర్లలో 125 ఆలౌట్(నూర్ అలీ 32, రషీద్‌ఖాన్ 35, తాహిర్ 4/29, మోరిస్ 3/13, ఫెల్కువాయో 2/18), దక్షిణాఫ్రికా: 28.4 ఓవర్లలో 131/1(డికాక్ 68, ఆమ్లా 41 నాటౌట్, నైబ్ 1/29).

198

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles