నేను చీట్ చేయను : సెరెనా


Mon,September 10, 2018 01:11 AM

సెరెనాకు వివాదాలు కొత్త కాకపోయినా.. గొడవ పడ్డప్పుడల్లా ఓటమిపాలు కావడం గమనార్హం. 2009 యూఎస్ ఓపెన్ సెమీస్‌లోనూ కిమ్ క్లిస్టర్స్ చేతిలో ఓడినప్పుడు లైన్ జడ్జీని నానా మాటలు తిట్టింది. 2011 యూఎస్ ఓపెన్ ఫైనల్లోనూ స్టోసుర్‌నుకమాన్ అంటూ రెచ్చగొట్టడంతో చైర్ అంపైర్ ఇవా అస్‌డెరెకి హెచ్చరించాడు. దీనికి కూడా అమెరికన్ ఘాటుగా స్పందించడంతో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది.

ఈ మ్యాచ్‌లో నేను చీట్ చేయలేదని సెరెనా తెలిపింది. తన కోచ్ ప్యాట్రిక్ ఎలాంటి సాయం చేయలేదని చెప్పుకొచ్చింది. అయితే దీనిపై కోచ్ భిన్నంగా స్పందించాడు. తాను సెరెనాకు సాయం చేశానని, చేతుల ద్వారా కొన్ని సంజ్ఞలు చూపెట్టానని చెప్పారు. ఈ సమయంలో చైర్ అంపైర్ హెచ్చరించడంతో సెరెనా గొడవకు దిగింది. నేను తప్పు చేయను. తప్పు చేసి గెలువాల్సిన అవసరం నాకు లేదు. అలా గెలువాల్సి వస్తే ఓడిపోవడానికి కూడా వెనుకాడను. నీవు నా ప్రవర్తనను తప్పుబడుతున్నావు. నీవో దొంగవు. అబద్దాల కోరువి. ఇకపై నేను ఆడబోయే మ్యాచ్‌లో నీవు లేకుండా చూస్తా. క్రీడల్లో పురుషులతో పోలిస్తే మహిళలపై వివక్ష ఉందన్న నా నమ్మకాన్ని ఈ ఘటన మరింత బలోపేతం చేసింది.

పురుష ఆటగాళ్ల పట్ల చైర్ అంపైర్ ఎలా ప్రవర్తిస్తారో నేను చూశా. ఇక్కడ నేను మహిళల హక్కులు, సమానత్వం కోసం పోరాడుతున్నా. ఫ్రెంచ్ ప్లేయర్ కార్నెట్ ఎండ వేడిమి తాళలేక మైదానంలో షర్ట్ మార్చుకుంటే అంపైర్లు హెచ్చరిస్తారు. అదే పురుష ఆటగాళ్లు ఎన్నిసార్లు మార్చుకున్నా పట్టించుకోరు. వాళ్లకు లేని నిబంధనలు మాకే ఎందుకు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో ఒసాకా అద్భుతంగా ఆడింది. కొత్త చాంపియన్‌ను గౌరవించాల్సిన అవసరం ఉంది అని సెరెనా వ్యాఖ్యానించింది.

324

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles