హెచ్‌సీఏలో అక్రమాలపై హైకోర్టుకు బీసీసీఐ నివేదిక


Wed,March 14, 2018 12:38 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అక్రమాలు జరిగినట్లుగా ఉమ్మడి హైకోర్టుకు బీసీసీఐ మంగళవారం నివేదిక అందచేసింది. అక్రమాలపై అవినీతి నిరోధక కమిటీ అందచేసిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ పాలన వ్యవహారాలను పర్యవేక్షించడానికి తాత్కాలిక ప్రతిపాదికన గత ఏడాది ఏర్పాటు చేసిన మాజీ న్యాయమూర్తులతో కూడిన అడ్మినిస్ట్రేటివ్ కమిటీని కొనసాగించాలంటూ న్యాయస్థానాన్ని బీసీసీఐ అభ్యర్థించింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను హెచ్‌సీఏలో అమలు చేయకపోవడంపై గత ఏడాది న్యాయవాది గోవిందరెడ్డి, తదితరులు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

ఆయా అంశాలను పరిశీలించిన ఉమ్మడి హైకోర్టు..హెచ్‌సీఏ పాలన వ్యవహారాల పరిశీలన, లోధా కమిటీ సిఫార్సుల అమలు కోసం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ దవే, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతిలతో అడ్మినిస్ట్రేటివ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ కాలపరిధి ముగియడం, హెచ్‌సీఏకు నూతన కార్యవర్గం ఎన్నిక జరుగడం పూర్తయ్యాయి. లోధా సిఫార్సుల అమలుకు కార్యాచరణ జరుగడం తమని కమిటీ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సభ్యులైన విశ్రాంత న్యాయమూర్తులు ఇటీవలే హైకోర్టుకు ప్రమాణపత్రం దాఖలు చేశారు. అయితే ఈ కమిటీని కొనసాగించాలంటూ బీసీసీఐ తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. హెచ్‌సీఏలో వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్ ఇటీవలే హెచ్‌సీఏ అధ్యక్షుడు, కార్యదర్శుల పదవులపై ఉత్తర్వులను హైకోర్టు ఎదుట బీసీసీఐ ప్రస్తావించింది. ఈ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం..నివేదికను అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి అందచేస్తామని, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

214

More News

VIRAL NEWS