ఒమన్ జట్టులో సందీప్ గౌడ్


Tue,February 19, 2019 01:44 AM

sandeep
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఒకప్పుడు రంజీ జట్టుకు ఎంపిక కాలేకపోయినా హైదరాబాద్ క్రికెటర్ సందీప్ గౌడ్(28) అంతర్జాతీయ క్రికెటర్ కావాలన్న కలను నిజం చేసుకున్నాడు. ఒమన్ జాతీయ జట్టు తరఫున క్రికెటర్‌గా రాణించి ఆ దేశ జాతీయజట్టులో చోటు సంపాదించుకున్నాడు. 2009-10 సీజన్‌లో అండర్-22 విభాగంలో కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో హైదరాబాద్ జట్టు చాంపియన్‌గా నిలువడంలో ఆల్‌రౌండర్ సందీప్ కీలకపాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం రాణించి మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కించుకున్నాడు. అనంతరం దేశవాళీ క్రికెట్‌లో రాణించినా హైదరాబాద్ రంజీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడని అతని సోదరి శ్రావణి విచారం వ్యక్తం చేసింది.

అనంతరం సందీప్ స్నేహితుడు వంశీ సలహాతో ఒమన్ జట్టుకు ఆడేందుకు వెళ్లినట్లు వివరించింది. అక్కడే ఇమిగ్రేషన్ అధికారిగా పని చేస్తూ క్రికెట్ ఆడుతున్న సందీప్ గౌడ్ ఒమన్ తరఫున అంతర్జాతీయ క్రికెటర్‌గా అరంగేట్రం చేశాడు. నెదర్లాండ్స్ తో జరిగిన తొలిమ్యాచ్‌లో 2 వికెట్లు తీసుకుని 5 పరుగులతో నాటౌట్‌గా నిలువగా..ఆదివారం స్కాట్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 19 బంతుల్లో 31 పరుగులతో రాణించడం విశేషం. తండ్రిని కోల్పోయిన అనంతరం సందీప్ ఎంతో మానసిక వేదనకు గురయ్యాడని, జట్టులో చోటు దొరకకపోవడంతో నిరాశ పడినా ..ఒమన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడంపై శ్రావణి సంతోషం వ్యక్తం చేసింది.

850

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles