హెచ్‌సీఏ చీఫ్ వివేక్‌కు చుక్కెదురు


Wed,June 13, 2018 01:03 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా జీ వివేక్‌ను కొనసాగడానికి అనుమతిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయస్థానం జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. అధ్యక్షుడిగా వివేక్ వ్యవహారంలో క్రికెట్ అంబుడ్స్‌మన్ ఇచ్చిన తీర్పుపై మరోసారి తాజాగా విచారణ చేపట్టాలంటూ సింగిల్ బెంచ్ న్యాయస్థానానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ కొంగర విజయలక్ష్మీతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. హెచ్‌సీఏతో వాణిజ్యపరమైన సంబంధాల నేపథ్యంలో అధ్యక్షుడిగా వివేక్ కొనసాగరాదంటూ అజరుద్దీన్, బాబురావు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా జస్టిస్ నరసింహ్మారెడ్డి నేతృత్వంలోని అంబుడ్స్‌మన్ ఈ ఏడాది మార్చి 8న ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వివేక్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయగా... విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి న్యాయస్థానం వివేక్ అధ్యక్షుడిగా కొనసాగవచ్చంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనం ఎదుట అజరుద్దీన్, బాబూరావు అప్పీల్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం...సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను తోసిపుచ్చింది. తాజాగా మరోసారి అంబుడ్స్‌మన్ తీర్పుపై విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది.

448
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles