ఊరించి.. ఉసూరుమని..

Tue,March 21, 2017 01:08 AM

భారత్ విజయాన్ని అడ్డుకున్న ఆస్ట్రేలియాహాండ్స్‌కోంబ్, మార్ష్ మారథాన్ ఇన్నింగ్స్రాంచీ టెస్ట్ డ్రా 4 టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమం ధర్మశాలలో సిరీస్ ఫలితం భారత ఆశలను ఆస్ట్రేలియా ఆవిరి చేసింది. కీలకమైన రాంచీ టెస్ట్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళుదామనుకున్న టీమ్‌ఇండియాను ఆసీస్ అద్భుతంగా నిలువరించింది. ఓటమి దాదాపు ఖాయమైన వేళ డ్రా కోసం కంగారూలు కడదాకా కసిగా పోరాడిన తీరు ఆకట్టుకుంది. చివరిరోజు మన బౌలర్లను వికెట్లకోసం చెమటోడ్చేలా చేస్తూ హాండ్స్‌కోంబ్, షాన్‌మార్ష్ మారథాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో రాంచీ టెస్ట్ ఎలాంటి ఫలితం లేకుండానే డ్రాగా ముగిసింది. నాలుగు టెస్ట్‌ల సిరీస్ కాస్తా 1-1తో సమం కావడంతో ఆఖరిదైన ధర్మశాల టెస్ట్‌తో సిరీస్ ఫలితం తేలనుంది.
VIRAT
రాంచీ: మన విజయానికి కావాల్సినవి ఇంకా ఎనిమిది వికెట్లు. సొంతగడ్డపై మేటి జట్లను వరుసగా మట్టికరిపిస్తూ సిరీస్‌లు సాధిస్తున్న భారత్‌కు ఇది అంత పెద్ద లెక్క కాదునుకున్నాం. కానీ అంచనాలు తారుమారయ్యాయి. క్రీజులో నిలదొక్కుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించవచ్చని నిరూపించిన పుజార, సాహాను ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆదర్శంగా తీసుకున్నారు. దీనికి పిచ్ సహకారం కూడా బాగా కలిసొచ్చింది. ఫలితంగా రాంచీ టెస్ట్ ఎలాంటి ఫలితం లేకుండానే డ్రాగా ముగిసింది. ఈ కారణంగా సిరీస్‌లో ఆధిక్యంలోకి నిలుద్దామనుకున్న ఆతిథ్య భారత ఆశలను ఆసీస్ నీరుగార్చింది. 23/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. హాండ్స్‌కోంబ్(200 బంతుల్లో 72 నాటౌట్, 7ఫోర్లు), షాన్ మార్ష్(197 బంతుల్లో 53, 7ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. జడేజా(4/54) నాలుగు వికెట్లతో ఆకట్టుకోగా, అశ్విన్(1/71), ఇషాంత్(1/30) ఒక్కో వికెట్ తీశారు. డబుల్ సెంచరీతో అదరగొట్టిన పుజారకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఆఖరిదైన నాలు గో టెస్ట్ ధర్మశాలలో ఈనెల 25న మొదలవుతుంది.

స్మిత్, రెన్‌షా వెంటవెంటనే:


129 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో ఆఖరి రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆదిలో తడబడింది. కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మ్యాట్ రెన్‌షా(15)తో పాటు తొలి ఇన్నింగ్స్ అజేయ సెంచరీ హీరో కెప్టెన్ స్మిత్(21) వికెట్లను వెంటవెంటనే చేజార్చుకుంది. ఇషాంత్‌శర్మ బౌలింగ్‌లో రెన్‌షా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటికే క్రీజులో కుదురుకుని భారత బౌలర్లకు విసుగు తెప్పిస్తున్న రెన్‌షాను ఇషాంత్ అద్భుత స్వింగ్‌తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సిరీస్‌లో సూపర్‌ఫామ్‌మీదున్న స్మిత్ కూడా రెన్‌షాను అనుసరించాడు. జడేజా వేసిన ఆ మరుసటి ఓవర్ తొలి బంతికే స్మిత్ క్లీన్‌బౌల్డ్ అయి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. దీం తో 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇక్కణ్నుంచి పీటర్ హాండ్స్‌కోంబ్, షాన్ మార్ష్ మ్యాచ్ గతినే మార్చివేశారు.

హాండ్స్‌కోంబ్, మార్ష్ మారథాన్:


89 పరుగుల లోటు, చేతిలో 6 వికెట్లు. ఓ దశలో ఆస్ట్రేలియా పరిస్థితి ఇది. టీమ్‌ఇండియా బౌలర్ల జోరు చూస్తే కంగరూల పని ఖతమే అనుకున్నాం. కానీ అంచనాలు పూర్తిగా తలకింద్రులయ్యాయి. పీటర్ హాండ్స్‌కోంబ్(72 నాటౌట్), షాన్ మార్ష్(53) అర్ధసెంచరీల ఇన్నింగ్స్‌తో సీన్ మొత్తం రివర్సయ్యింది. ఓటమి తప్పదేమో అనుకున్న పరిస్థితి నుంచి అద్భుత పోరాటపటిమతో తమ జట్టును డ్రాతో గట్టెక్కించారు. లంచ్ విరామం వరకు అంతో ఇంతో ప్రభావం చూపిన టీమ్‌ఇండియా బౌలర్లు ఆ తర్వాత హాండ్స్‌కోంబ్, మార్ష్‌ల మారథాన్ బ్యాటింగ్‌తో తేలిపోయారు. పిచ్ పరిస్థితులను తమకు పూర్తి అనుకూలంగా మలుచుకుంటూ వీరిద్దరు జిడ్డుగా బ్యాటింగ్ కొనసాగించారు. భారత బౌలర్లను సహనాన్ని పరీక్షిస్తూ ఇద్ద రు కలిసి ఐదోవికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యా న్ని నెలకొల్పారు.

ఈ క్రమంలో హాండ్స్‌కోంబ్ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 200 బంతులెదుర్కొని 72 పరుగులతో అజేయంగా నిలిస్తే..మార్ష్ 197 బంతు ల్లో 53 పరుగులు చేశాడు. వీరిద్దరిని విడగొట్టేందుకు కెప్టెన్ కోహ్లీ చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. ముఖ్యంగా ఓవైపు సహచర నంబర్‌వన్ బౌలర్ జడేజా వికెట్లు పడగొడుతుంటే.. అశ్విన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అయితే జడేజా బౌలింగ్‌లో విజయ్‌కు క్యాచ్ ఇచ్చి మార్ష్ వెనుదిరిగాడు. ఆ వెంటనే మార్ష్ బాటలో మ్యాక్స్‌వెల్ పయనించాడు. అశ్విన్ ఓవర్లో 2 పరుగులకే మ్యాక్స్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన మాథ్యూ వేడ్(9 నాటౌట్).. హాండ్స్‌కోంబ్‌ను జతకలిశాడు. అప్పటికే మ్యాచ్‌పై ఓ అంచనాకు వచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.

ఇషాంత్ గరం గరం


భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య వైరం కొనసాగుతూనే ఉన్నది. స్లెడ్జింగ్‌కు చిరునామా అయిన ఆసీస్ ఆటగాళ్లు నోటికి పనిచెబుతుంటే టీమ్‌ఇండియా క్రికెటర్లు అంతే దీటుగా బదులిస్తున్నారు. ఐదో రోజు ఆటలో ఆసీస్ ఓపెనర్ రెన్‌షా వ్యవహరించిన తీరుపై స్పీడ్‌స్టర్ ఇషాంత్‌శర్మ గరమయ్యాడు. ఇన్నింగ్స్‌కు 29వ ఓవర్ వేయడానికి ఇషాంత్ బౌలింగ్‌కు దిగగానే క్రీజులో ఉన్న రెన్‌షా..సైట్‌స్క్రీన్ దగ్గర ఎవరో కనిపించే సరికి వికెట్లకు ఎడంగా జరిగాడు. దీంతో అప్పటికే రనప్‌లో ఉన్న లంబూకు కోపం నశాలానికి ఎక్కింది. అదే స్పీడ్‌తో బంతిని రెన్‌షా వైపు విసిరాడు. దీంతో ఇద్దరు ఒకరికొకరు తిట్టుకున్నారు. అవతలి ఎండ్‌లో ఉన్న కెప్టెన్ స్మిత్ కూడా నోటికి పనిచెప్పాడు. తానేం తక్కువ కాదన్నట్లు ఇషాంత్ కూడా బదులివ్వడంతో సీన్ కాస్తా హాట్‌హాట్‌గా మారింది. అంపైర్ కలుగజేసుకుని కెప్టెన్ కోహ్లీతో మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. ఇదే ఓవర్ నాలుగో బంతికి రెన్‌షా వికెట్ల ముందు ఇషాంత్‌కు అడ్డంగా దొరికిపోయాడు. ఇక్కడే భారత్‌కు బ్రేక్‌కు లభించింది.
MARSH

ధర్మశాల టెస్ట్‌కు షమీ!


రాంచీ: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడ్డ మహ్మద్ షమీ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. సోమవారం తమిళనాడుతో జరిగిన విజయ్ హజారే టోర్నీ ఫైనల్లో నాలుగు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. దీంతో ఆస్ట్రేలియాతో ఆఖరిదైన ధర్మశాల టెస్ట్ కోసం షమీని జట్టుకు ఎంపిక చేసే అవకాశాలున్నాయని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ విషయమై సెలెక్టర్లతో తానేమి మాట్లాడలేదని, కానీ చివరి టెస్ట్‌కు షమీ అందుబాటులో ఉంటాడని విరాట్ నమ్మకం వ్యక్తం చేశాడు.

మా ఫిజియోను అవమానిస్తారా?


భారత్, ఆస్ట్రేలియా కెప్టెన్లు కోహ్లీ, స్మిత్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బెంగళూరు టెస్ట్‌లో డీఆర్‌ఎస్‌తో మొదలైన వైరం ఇంకా రగులుతూనే ఉన్నది. టీమ్‌ఇండియా ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాత్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు అవమానించారని కెప్టెన్ కోహ్లీ అన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. అతని(ప్యాట్రిక్) పేరును ఎందుకు బయటకుతీసుకొచ్చారో అర్థం కావడం లేదు. అతను మా జట్టు ఫిజియో. గాయపడ్డ ఆటగాళ్లకు వైద్యసేవలు చేస్తాడు. అతన్ని బయటికి లాగడం వెనుక ఉన్నా కారణమేంటో తెలియడం లేదు అని కోహ్లీ అన్నాడు. ఇదిలా ఉంటే ప్యాట్రిక్‌ను మేము అవమానించలేదని, తమ దేశానికే చెందిన అతన్ని ఎందుకు అగౌరవపరుస్తామని ఆసీస్ కెప్టెన్ స్మిత్ పేర్కొన్నాడు.

రాహుల్, మురళీ విజయ్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. కానీ వీరిద్దరి కంటే పుజార, సాహా నెలకొల్పిన భాగస్వామ్యం నేను చూసినదాంట్లో అత్యుత్తమైంది. ఆస్ట్రేలియాకు కీలకమైన టాస్ కోల్పోయిన తర్వాత 150 పరుగుల ఆధిక్యం సాధిస్తామని అస్సలు ఊహించలేదు. దీనికి తోడు జడేజా రెండు వికెట్లు పడగొట్టి గెలుపుపై ఆశలు రేపాడు. గెలుపు ఖాయమనుకున్న మ్యాచ్‌ను డ్రాగా మలిచిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ హండ్స్‌కోంబ్, షాన్‌మార్ష్ ఆటతీరు అద్భుతం.
- కెప్టెన్ కోహ్లీ

2 రాంచీ టెస్ట్‌లో 9/178 వికెట్ల ప్రదర్శన జడేజా కెరీర్‌లో రెండో అత్యుత్తమం. ఈ మ్యాచ్‌లో జడ్డూ 93.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తన 29 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో ఈ సౌరాష్ట్ర ఆల్‌రౌండర్‌కు ఇదే బెస్ట్.

7భారత్‌లో ఓ టెస్ట్ చివరి రోజు ఆటలో 75 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లపాటు ఆడి విదేశీ జట్టు మ్యాచ్‌ను కాపాడుకోవడం ఏడోసారి. రాంచీ టెస్ట్‌లో ఆసీస్ ఆఖరి రోజు 92.4 ఓవర్లు ఆడి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 2008లో సౌతాఫ్రికాతో చెన్నై టెస్ట్‌లో ఇది చివరిసారి చోటుచేసుకుంది

3భారత్‌లో 150 పరుగులకు పైగా లోటుతో టెస్ట్ మ్యాచ్‌ను కాపాడుకోవడం ఆస్ట్రేలియాకు ఇది మూడో సారి. గతంలో 1979-80, 1986-87లో ఆసీస్ రెండు సార్లు టెస్ట్‌లను నిలబెట్టుకుంది.

78ఈ సీజన్(2016-17)లో అశ్విన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య. గతంలో(2007-08) దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ స్టెయిన్ తీసిన అత్యధిక వికెట్ల(78) రికార్డును అశ్విన్ సమం చేశాడు. జడేజా 67 వికెట్లతో అశ్విన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.

స్కోరుబోర్డు


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 451 ఆలౌట్, భారత్ తొలి ఇన్నింగ్స్: 603/9 డిక్లేర్డ్, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్(బి)జడేజా 14, రెన్‌షా(ఎల్బీ)ఇషాంత్ 15, లియాన్(బి)జడేజా 2, స్మిత్(బి)జడేజా 21, మార్ష్(సి)విజయ్(బి)జడేజా 53, హాండ్స్‌కోంబ్ 72 నాటౌట్, మ్యాక్స్‌వెల్ (సి)విజయ్(బి) అశ్విన్2, వేడ్9 నాటౌట్.
ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 100 ఓవర్లలో 204/6;
వికెట్ల పతనం:1-17, 2-23, 3-59, 4-63, 5-187, 6-190, బౌలింగ్: అశ్విన్ 30-10-71-1, జడేజా 44-18-54-4, ఉమేశ్ 15-2-36-0, ఇషాంత్‌శర్మ 11-0-30-1.

740

More News

మరిన్ని వార్తలు...