మ్యాచ్‌కు సూర్యుడు అడ్డంకిగా..


Thu,January 24, 2019 02:55 AM

-సూర్యకిరణాలతో మ్యాచ్‌కు అర్ధగంట అంతరాయం
అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిల్ల కవితకు కాదేది అనర్హం. మహాకవి శ్రీశ్రీ చేతి నుంచి జాలువారిన కవిత ఇది. అచ్చం ఇలాగే మనం ఇప్పటి వరకు క్రికెట్‌లో వర్షం, వెలుతురులేమి, జంతువుల వల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలుగడం చూశాం. కానీ కనివినీ ఎరుగని రీతిలో సూర్యుడు కూడా మ్యాచ్‌ను అడ్డుకున్నాడంటే ఆశ్చర్యం కలుగకమానదు. అవును భారత్, న్యూజిలాండ్ మధ్య నేపియర్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో ఇదే జరిగింది. కివీస్ నిర్దేశించిన లక్ష్యఛేదన కోసం భోజన విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌కు సూర్యభగవానుడు ప్రతిబంధకంగా మారాడు. నేరుగా కండ్లలోకి సూర్య కిరణాలు పడుతుండటంతో చేసేదేమి లేక ఫీల్డ్‌అంపైర్లు మ్యాచ్‌ను అర్ధగంట సేపు వాయిదా వేశారు. దీంతో క్రీజులో ఉన్న ధవన్, కోహ్లీతో పాటు కివీస్ ఆటగాళ్లు పెవిలియన్ చేరుకున్నారు. మ్యాచ్‌కు వేదికైన నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్ స్టేడియం నిర్మాణం మిగతా వాటికి భిన్నంగా ఉంది. సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే స్టేడియాల్లోని పిచ్‌లన్నీ కూడా ఉత్తర, దక్షిణ అభిముఖంగా ఉంటాయి. కానీ మెక్‌లీన్ పార్క్ మాత్రం తూర్పు, పశ్చిమ ముఖంగా ఉండటంతో సూర్యుడితో ఆటంకం ఏర్పడింది. సూర్య భగవానుడు పశ్చిమవైపు ఉన్న స్టాండ్ వెనుకకు వెళ్లిన తర్వాత మ్యాచ్‌ను అంపైర్లు తిరిగి ప్రారంభించారు. అయితే సమయం వృథా కావడంతో మ్యాచ్‌లో ఒక ఓవర్‌తో పాటు పరుగు కుదిస్తూ లక్ష్యాన్ని సవరించారు. దీనిపై మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ నా క్రికెట్ జీవితంలో ఇలాంటి అనుభవం ఎదుర్కొలేదు. ఇది చాలా ఫన్నీగా ఉంది. 2014లో సూర్యుని కిరణాలతో నేనోసారి ఔటయ్యాను. అప్పుడు ఇలాంటి నిబంధనలు లేవు అని అన్నాడు.

329

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles