జర్మనీ విజయం


Thu,December 6, 2018 12:29 AM

మలేషియాతో పాక్ మ్యాచ్ డ్రా
Germany-players
భువనేశ్వర్: రెండుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టు ప్రపంచకప్ క్వార్టర్స్‌కు మరింత చేరువైంది. బుధవారం పూల్-డీ మ్యాచ్‌లో భాగంగా యూరప్ ఖండానికే చెందిన ప్రత్యర్థి, గత ప్రపంచకప్ రన్నరప్ నెదర్లాండ్స్‌ను 4-1 గోల్స్ తేడాతో ఓడించింది. జర్మనీ తరఫున మథియాస్ ముల్లర్ (30వ), లూకాస్ విండ్‌ఫెడర్(52వ), మాక్కో మిట్కాయు(54వ), క్రిస్టోఫర రుర్(58వ) నిమిషంలో గోల్స్‌తో మెరువడంతో జర్మనీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. నెదర్లాండ్స్ తరఫున వాలెంటినా వెర్గా 13వ నిమిషంలో ఏకైక గోల్ అందించాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం సాధించిన జర్మనీ జట్టు తాజా విజయంతో 6 పాయింట్లతో పూల్-డీలో అగ్రస్థానం అందుకోగా.. మూడు పాయింట్లతో నెదర్లాండ్స్ జట్టు రెండోస్థానంలో కొనసాగుతున్నది. తొలిమ్యాచ్‌లో 7-0తో మలేషియాను చిత్తుగా ఓడించిన నెదర్లాండ్స్ జట్టు ..జర్మనీ చేతిలో అనూహ్య పరాజయంతో ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ ఆరంభంలో డచ్ టీమ్ ఆటను దూకుడుగా ప్రారంభించింది.

8వ నిమిషంలోనే నెదర్లాండ్స్ టీమ్ కెప్టెన్ బిల్లీ బాకర్ గోల్ పోస్ట్ సమీపం నుంచి కొట్టిన అద్భుతమైన షాట్‌ను జర్మనీ గోల్‌కీపర్ తోబియాస్ వాల్టర్ అడ్డుకుని అతని ప్రయత్నం వమ్ము చేశాడు. తొలి క్వార్టర్‌లో వారి దూకుడుకు 13వ నిమిషంలో వెర్గా గోల్‌తో ఫలితం లభించింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు 1-0 ఆధిక్యంతో మరింత ఉత్సాహంగా జర్మనీపై అటాకింగ్ మొదలుపెట్టింది. మరోవైపు డచ్ గోల్ కీపర్ పిర్మిన్ బల్లాక్ కూడా జర్మనీ చేసిన రెండు గోల్స్ దాడులను నిలువరించడంతో మ్యాచ్ మరింత హోరాహోరీగా కొనసాగింది. రెండో క్వార్టర్ ఆఖరి నిమిషంలో ముల్లర్ అద్భుతమైన గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత వరుసగా నాలుగు పెనాల్టీలు సంపాదించినా నెదర్లాండ్స్ గోల్ కొట్టలేకపోయింది. మరోవైపు దూకుడు పెంచిన జర్మనీ జట్టు ఆఖరి క్వార్టర్ చివరి పది నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ సాధించి 4-1 స్కోరుతో విజయం సాధించి గ్రూప్‌లో అగ్రస్థానంతో నేరుగా క్వార్టర్స్ చేరేందుకు కొద్ది దూరంలో నిలిచింది.

పాక్‌ను నిలువరించిన మలేషియా

నాలుగుసార్లు చాంపియన్ పాకిస్థాన్ జట్టుతో హోరాహోరీగా పోరాడిన మలేషియా జట్టు 1-1 స్కోరుతో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. తొలిమ్యాచ్‌లో జర్మనీ చేతిలో పాకిస్తాన్ ఓడగా..మలేషియాను నెదర్లాండ్స్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విజయంతో క్వార్టర్స్ ఆశలు సజీవం చేసుకోవాలనుకున్న పాక్ ఆశలను మలేషియా వమ్ముచేసింది. చివరి క్వార్టర్ 51వ నిమిషంయలో మహ్మద్ అతిఖ్ గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. కాగా, మరో నాలుగు నిమిషాలకే మలేషియాకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఫైజల్ సరీ గోల్ కొట్టడంతో స్కోరు 1-1తో సమమైంది. చివరి నిమిషాల్లో రెండు జట్లూ గోల్‌కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ప్రపంచకప్‌లో దాదాపు రెండుజట్లూ నిష్క్రమించినట్లే.
hockey-germany

376

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles