ఫ్రాన్స్ అదరహో


Thu,July 12, 2018 01:31 AM

ఉమిటిటీ సూపర్ హెడర్
సెమీస్‌లో బెల్జియంపై
1-0తో అద్భుత విజయం
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రెంచ్ జట్టు

ఒకే ఒక్క అడుగు! రెండు దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న చిరకాల కలను సాకారం చేసుకోవడానికి ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు ముందున్న లక్ష్యం. అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ఫ్రాన్స్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ఆస్ట్రేలియాతో ఆరంభమైన గెలుపు జోరు బెల్జియంతో సెమీస్ వరకు దిగ్విజయంగా సాగుతూనే ఉన్నది. నువ్వానేనా అన్న తరహాలో ఇరు జట్లు కత్తులు దూసుకున్న సెమీస్ ఫైట్‌లో ఫ్రాన్స్‌దే పైచేయి అయ్యింది. సామ్యూల్ ఉమిటిటీ సూపర్ హెడర్‌తో ఫ్రెంచ్ జట్టు.. ఫిఫా ప్రపంచకప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈసారైనా తమ కప్ కలను నేరవేర్చుకుందామనుకున్న రెడ్ డెవిల్స్ ఆశలను
వమ్ముచేస్తూ ఫ్రాన్స్.. మాస్కోలో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.

Umtiti
సెయింట్ పీటర్స్‌బర్గ్: ప్రపంచకప్ ఫుట్‌బాల్ వేటలో ఫ్రాన్స్ మరో అడుగు ఘనంగా వేసింది. కప్‌ను ముద్దాడడమే తమ లక్ష్యమన్న తరహాలో ఫ్రెంచ్ సాకర్ జట్టు బెల్జియంను చిత్తుచేసింది. మంగళవారం అర్ధరాత్రి హోరాహోరీగా సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0 తేడాతో బెల్జియంపై అద్భుత విజయం సాధించింది. 64 వేల మందికి పైగా కిక్కిరిసిన అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్‌లో టైటిల్ ఫేవరెట్ ఫ్రాన్స్..పక్కా ప్రణాళికను ఎంచుకున్నది. చీఫ్ కోచ్ దిదీయర్ దెస్‌చాంప్స్ రచించిన వ్యుహానికి అనుగుణంగా బెల్జియం గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. ఈ క్రమంలో మ్యాచ్ 51వ నిమిషంలో డిఫెండర్ సామ్యూల్ ఉమిటిటీ కొట్టిన సూపర్ హెడర్‌తో ఫ్రాన్స్‌ను గెలుపు వైపు నిలిపింది. ఆదివారం మాస్కో వేదికగా జరిగే ఫైనల్లో..ఇంగ్లండ్ లేదా క్రొయేషియాతో ఫ్రాన్స్ తలపడుతుంది. మరోవైపు ఎలాగైనా ఫైనల్లోకి ప్రవేశించాలన్న పట్టుదలతో ఆడి ఓటమిపాలైన బెల్జియం.. శనివారం మూడో స్థా నం కోసం జరిగే ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఆడుతుంది.

హోరాహోరీ:

ఇద్దరిదీ ఒక్కటే లక్ష్యం. ఆరునూరైనా ఫైనల్లో ఆడాలన్నది. తమ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కప్‌ను ఒడిసిపట్టుకోవాలన్నది. కానీ గెలుపు అనేది ఒకరి పక్షమే అవుతుంది. అది ఈసారి ఫ్రాన్స్ పరమైంది. ఏ క్షణంలో మెగా టోర్నీలో అడుగుపెట్టిందో కానీ ఫ్రెంచ్ జట్టుకు ఎదురన్నది లేకుండా పోయింది. మెరికల్లాంటి యువకులకు తోడు అనుభవం తోడైతే ఎంతటి మేటి జట్టునైనా మట్టికరిపించవచ్చనే ప్రాథమిక సూత్రాన్ని ఇరు జట్లు పాటించి సఫలమయ్యాయి. ఫైనల్‌కు చేరుకునే ప్రస్థానంలో అర్జెంటీనా, ఉరుగ్వే లాంటి జట్లను ఫ్రాన్స్ తుదముట్టిస్తే..ఇంగ్లండ్, బ్రెజిల్‌ను బెల్జియం ఓటమివైపు నిలిపింది. ఈ క్రమంలో సెమీస్ మ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫ్రాన్స్, బెల్జియం ఆదినుంచే హోరాహోరీ పోరుకు తెరలేపాయి. ఫ్రాన్స్ పటిష్ఠ డిఫెన్స్‌కు, బెల్జియం మెరుపు ైస్ట్రెకర్ల మధ్య పోరులాగా మ్యాచ్ సాగింది. మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే బెల్జియం డిఫెన్స్ లోపాలను ఎత్తి చూపుతూ ఫ్రాన్స్ స్టార్ ైస్ట్రెకర్ ఎంబాప్పే దాడులకు పూనుకున్నాడు. బెల్జియం డిఫెడండర్ జాన్ వెర్టోన్హెన్‌ను తప్పిస్తూ అడ్డువచ్చిన మిడ్‌ఫీల్డర్ విన్సెంట్ కంపెనీని బోల్తా కొట్టించిన ఎంబాప్పే..గ్రిజ్‌మన్‌కు పాస్ అందించడం చకాచకా జరిగిపోయాయి. అప్పటికే అప్రమత్తమైన బెల్జియం గోల్‌కీపర్ తియబౌత్ కౌర్టియోస్ సమర్థంగా నిలువరించడంతో గోల్‌కాలేదు. మరోవైపు తమ దాడులకు పదునుపెట్టిన బెల్జియం..ైస్ట్రెకర్ ఈడెన్ హజార్డ్ చేసిన ప్రయత్నాలు ఫ్రాన్స్ గోల్‌పోస్ట్‌ను ముద్దాడుతూ బయటికి వెళ్లాయి. ఇలా రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో ప్రథమార్ధం ఎలాంటి గోల్ లేకుండానే ముగిసింది.
Courtois

ఉమిటిటీ సూపర్ హెడర్:

కీలకమైన ద్వితీయార్ధంలో ఫ్రాన్స్ తమ వ్యుహాన్ని మార్చుకుంది. బెల్జియం గోల్‌పోస్ట్‌పై దాడుల తీవ్రత పెంచేందుకు సమాయత్తమైంది. ద్వితీయార్ధం మొదలైన కొద్దిసేపటికే బెల్జియం డీబాక్స్ ఏరియాలో ఎంబాప్పే అందించిన అద్భుతమైన పాస్‌ను సీనియర్ ైస్ట్రెకర్ ఒలీవర్ గిరౌడ్ గోల్‌గా మలుచడంలో విఫలమయ్యాడు. అందివచ్చిన అవకాశాన్ని గిరౌడ్ చేజేతులా విడిచిపెట్టాడు. ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు కనిపించిన ఈ ైస్ట్రెకర్ ఫ్రాన్స్ తరఫున గత ఎనిమిది మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క గోల్ చేయలేకపోవడంతో పాటు లక్ష్యంపై దాడి చేయడంలోనూ విఫలమయ్యాడు. మ్యాచ్ 51వ నిమిషంలో కార్నర్ నుంచి అంటోనీ గ్రిజ్‌మన్ కొట్టిన బంతిని డిఫెండర్ సామ్యూల్ ఉమిటిటీ కండ్లు చెదిరే హెడర్‌తో గోల్‌గా మలిచాడు. బెల్జియం గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ ఉమిటిటీ క్షణకాలంలో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. గోల్ కొట్టిన సంబురంలో సహచరులతో కలిసి ఉమిటిటీ చూడచక్కని స్టెప్పులతో అలరించాడు. ఇక్కణ్నుంచి బెల్జియం ప్రతిదాడులు చేసే ప్రయత్నం చేసింది. కానీ పెట్టని గోడలాంటి ఫ్రాన్స్ డిఫెన్స్‌ను ఛేదించడంలో బెల్జియం ైస్ట్రెకర్లు ఈడెన్ హజార్డ్, కెవిన్ డీబ్రుయిన్, రోమెలు లుకాకు విఫలమయ్యారు. ఫ్రాన్స్ సెంట్రల్ బ్యాక్ ద్వయం ఉమిటిటీ, రాఫెల్ వరానెను నిలువరించడంలో బెల్జియం సఫలం కాలేకపోయింది. బెల్జియం డిఫెన్స్‌ను కకావికలు చేస్తూ ఫ్రాన్స్ ైస్ట్రెకర్లు ఆధిక్యం పెంచే ప్రయత్నం చేశారు. మ్యాచ్ మొత్తమ్మీద 64 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్న బెల్జియం 9సార్లు ఫ్రాన్స్‌పై దాడికి దిగితే..అదే ఫ్రెంచ్ జట్టు అంతకుమించి 19 సార్లు బెల్జియం గోల్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుంది.

బెల్జియం సాధించిన వరుస విజయాల సంఖ్య.
2016 సెప్టెంబర్‌లో స్పెయిన్ చేతిలో ఓటమి తర్వాత బెల్జియం వరుసగా విజయాలు సాధించింది.

24 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం ఫ్రాన్స్‌కు ఇది మూడోసారి. గతం(1998, 2006)లో ఫ్రాన్స్ టైటిల్ పోరులో నిలిచింది. ఇప్పటి వరకు ఫైనల్ చేరిన యూరోప్ దేశాల్లో జర్మనీ(8), ఇటలీ(6) ఫ్రాన్స్ కంటే ముందంజలో ఉన్నాయి.

3 1998 నుంచి ఇప్పటిదాకా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు అత్యధిక సార్లు(3) చేరుకున్న జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది.

649

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles