వాళ్లున్నా రిషబ్‌పైనే!


Thu,January 12, 2017 02:14 AM

-నేడు ఇంగ్లండ్‌తో రెండో ప్రాక్టీస్ మ్యాచ్..ఎ కెప్టెన్‌గా రహానే
KOHLI
ముంబై: ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు ముందు భారత్ జట్టు చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి వామప్‌లో భారీ స్కోరు సాధించినా ఫలితం ప్రతికూలంగా రావడంతో ఇప్పుడు ఈ మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో నేడు జరుగబోయే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఎ జట్టు.. ఇంగ్లండ్ ఎలెవన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌కు అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఈ ముంబైకర్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌తో టీ20 స్టార్ సురేశ్ రైనా కూడా చాలాకాలం తర్వాత మళ్లీ బ్యాట్ పడుతున్నాడు. అయితే ఈ ఇద్దరిని పక్కనబెడితే ఢిల్లీ కుర్ర వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. ధోనీ వారసుడిగా వార్తల్లో నిలుస్తున్న పంత్.. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించాడు. కీపింగ్‌లోనూ అమోఘ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ రంజీ సీజన్‌లో మహారాష్ట్రపై ట్రిపుల్ సెంచరీ కొట్టడంతో అనూహ్యంగా అతనికి టీ20 జట్టులో చోటు కల్పించారు.

అయితే ఈ స్థానాన్ని అతనెంత మేరకు సుస్థిరం చేసుకుంటాడో వేచి చూడాలి. మరోవైపు జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ నుంచి రిషబ్‌కు తీవ్ర పోటీ ఉంది. ఈ మ్యాచ్‌కు కిషన్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడని సెలెక్టర్లు ముందుగానే చెప్పడంతో పంత్‌పై కాస్త ఒత్తిడి తగ్గింది. దీంతో మంచి బౌన్స్ ఉండే బ్రబౌర్న్ స్టేడియంపై ఈ ఢిల్లీ కుర్రాడు పరుగుల వరద సృష్టిస్తాడో చూడాలి. వన్డేలో చోటు కోల్పోయిన రైనా.. ఇప్పుడు టీ20 సిరీస్‌పై దృష్టిపెట్టాడు. విజయ్ శంకర్, రసూల్, దీపక్ హుడాలాంటి ఆల్‌రౌండర్లతో పాటు అనుభవజ్ఞుడు షెల్డన్ జాక్సన్ కూడా ఈ మ్యాచ్‌లో తమ సత్తా ఏంటో చూపాలని ప్రయత్నిస్తున్నారు. వినయ్ కుమార్, అశోక్ దిండా, ప్రదీప్ సాంగ్వాన్ పేస్ భారాన్ని మోయనుండగా, షాబాజ్ నదీమ్ స్పిన్ బాధ్యతలను తీసుకోనున్నాడు. రైనా పార్ట్‌టైమర్‌గా వ్యవహరించనున్నాడు.
RISHABH

ముగ్గురికి అవకాశం..


తొలి వామప్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కోసం మూడు మార్పులు చేయనుంది. తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ బెయిర్ స్టో, పేసర్ లిమ్ ఫ్లంకెట్ ఈ మ్యాచ్‌లో బరిలో దిగనున్నారు. జో రూట్ నేరుగా తొలి వన్డే ఆడనున్నాడు. అలీ, రషీద్, రాయ్, బట్లర్, హేల్స్ ఈ మ్యాచ్‌ను మరింతగా ఉపయోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

జట్లు (అంచనా)


భారత్ ఎ: రహానే (కెప్టెన్), పంత్, రైనా, హుడా, కిషన్, జాక్సన్, శంకర్, నదీమ్, రసూల్, వినయ్, సాంగ్వాన్, దిండా.
ఇంగ్లండ్ ఎలెవన్: మోర్గాన్ (కెప్టెన్), అలీ, బెయిర్‌స్టో, బాల్, బిల్లింగ్స్, బట్లర్, డావ్‌సన్, హేల్స్, ఫ్లంకెట్, రషీద్, రాయ్, స్టోక్స్, విల్లే, వోక్స్.

టాప్ ర్యాంక్‌పై కోహ్లీ కన్ను


టెస్టుల్లో సూపర్ ఫామ్‌ను చూపెట్టిన విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్డే ర్యాంక్‌ను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో రాణించి టాప్ ర్యాంక్‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్ బ్యాట్స్‌మన్ జాబితాలో విరాట్ 848 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. 861 పాయింట్లతో దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 846 పాయింట్లతో ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ మూడో ర్యాంక్‌లోఉన్నాడు. భారత్ నుంచి విరాట్‌తోపాటు రోహిత్ శర్మ మాత్రమే టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇక ఏడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ రూట్ కూడా ఈ సిరీస్‌లో ప్రదర్శనతో ర్యాంక్‌ను మెరుగుపర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. బౌలింగ్‌లో భారత్ నుంచి అక్షర్ పటేల్ (9), అమిత్ మిశ్రా (12)లు మాత్రమే మెరుగైన ర్యాంక్‌ల్లో ఉన్నారు.

క్లీన్‌స్వీప్ చేసినా మూడులోనే!


ఇంగ్లండ్‌తోమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసినా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడోస్థానంలోనే ఉంటుంది. కానీ రేటింగ్ పాయింట్లలో మాత్రం కాస్త మెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం భారత్ (111) పాయింట్లతో మూడో ర్యాంక్‌లో ఉండగా, 3-0తో సిరీస్ గెలిస్తే 114 పాయింట్లకు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గనుక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే టీమ్ ఇండియా ఐదో ర్యాంక్‌కు పడిపోతుంది. మోర్గాన్‌సేన నాలుగో ర్యాంక్‌కు ఎగబాకుతుంది. ఆస్ట్రేలియా (120), దక్షిణాఫ్రికా (116)లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

996
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS