ఎఫ్‌ఐహెచ్ సిరీస్ భారత్‌దే


Sun,June 16, 2019 03:25 AM

- ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం
hockey
భువనేశ్వర్: ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఆటతో అదరగొట్టిన భారత పురుషుల హాకీ జట్టు తుదిపోరులోనూ సత్తా చాటింది. శనివారం ఇక్కడి కళింగ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 5-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. వరుణ్ కుమార్(2ని.,49ని.), హర్మన్‌ప్రీత్ సింగ్(11ని., 25ని.) డబుల్ గోల్స్‌తో విజృంభించగా, వివేక్ ప్రసాద్ (35ని.) ఓ గోల్ చేయడంతో టీమ్‌ఇండియా తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. రిచర్డ్ పౌట్జ్(53ని) దక్షిణాఫ్రికాకు ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే వచ్చిన తొలి పెనాల్టీ కార్నర్‌ను టీమ్‌ఇండియా ఆటగాడు వరుణ్ సద్వినియోగం చేసుకొని గోల్ చేశాడు. అప్పటి నుంచి ఏ దశలోనూ భారత్ దూకుడు తగ్గించలేదు. 11 నిమిషంలో వచ్చిన మరో పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలిచాడు. దీంతో తొలి క్వార్టర్‌లోనే భారత్ 2-0తో మెరుగైన ఆధిక్యాన్ని సాధించింది. అలాగే హాఫ్ టైమ్‌కు ఐదు నిమిషాల ముందు హర్మన్‌ప్రీత్ మరో గోల్‌తో చెలరేగాడు. అప్పటికే 3-0 ఆధిక్యంలో ఉండగా.. 35వ నిమిషంలో వివేక్ ప్రసాద్ గోల్ సాధించాడు. 49 నిమిషంలో దక్కిన పెనాల్టీకార్నర్ సాయంతో వరుణ్ కుమార్ తన రెండో గోల్ కొట్టాడు. దీంతో భారత్ 5-0తో మ్యాచ్ సొంతం చేసుకుంటుందని అనుకుంటుండగా.. 53న నిమిషంలో దక్షిణాఫ్రికా ఆటగాడు రిచర్డ్ పౌట్జ్ గోల్ కొట్టాడు. ముగింపు కార్యక్రమానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో పాటు హాకీ ఇండియా చీఫ్ నరిందర్ బాత్రా హాజరయ్యారు. కాగా మహిళల ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్‌లో భారత్ 4-1తో ఉరుగ్వేపై భారీ విజయం సాధించింది.

197
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles