వేదికలు అదరహో


Wed,June 13, 2018 01:46 AM

ఫుట్‌బాల్..ఫుట్‌బాల్..ఏదో తెలియని మత్తు దాగున్నది ఈ క్రీడలో. ఏ ముహూర్తాన మొదలైందో కానీ..భూగోళాన్ని ఊపేస్తున్నది. తరాలు మారినా..దశబ్దాలు గడిచినా.. వన్నె తరుగని రీతిలో అభిమానుల ఎనలేని ఆదరణ చూరగొంటూనే ఉన్నది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా..సాకర్ నామస్మరణే. మారుమూల పల్లె నుంచి మెట్రోపాలిటిన్ సిటీ వరకు అందరూ ఫుట్‌బాల్ మంత్రాన్ని జపించేవాళ్లే. మరో 24 గంటల్లో రష్యా వేదికగా ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి తెరలేవబోతున్నది. నాలుగేండ్లకోసారి జరిగే మెగా ఈవెంట్ కోసం అభిమానులు ఒళ్లంతా కండ్లు చేసుకుని చూస్తున్నారు. 32 అత్యుత్తమ జట్లు పోటీపడే ఫిఫా ప్రపంచకప్ కోసం 12 స్టేడియాలు సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యాయి. విభిన్న నిర్మాణ శైలిలో అద్భుత సాంకేతిక నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఆతిథ్య వేదికలపై ఓ లుక్కెద్దాం పదండి..

నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: కోట్లాది అభిమానుల క్రీడను తనివీతీరా ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. తాము ప్రాణంగా భావించే ఫుట్‌బాల్‌ను వీక్షించేందుకు ఇప్పటికే అభిమానులు సర్వం సిద్ధం చేసుకున్నారు. ప్రత్యక్షంగా చూసేందుకు వివిధ దేశాల నుంచి మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న రష్యాకు చేరుకోగా, కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తమ అభిమాన జట్లకు మద్దతుగా నిలిచేందుకు రెడీ అయ్యారు. రష్యా వేదికగా జరుగుతున్న ఈ యేటి ప్రపంచకప్‌లో జరిగే 64 మ్యాచ్‌లకు 12 స్టేడియాలు ఆతిథ్యమివ్వబోతున్నాయి. వివిధ దేశాల అభిమానులకు సాదర స్వాగతం పలుకుతున్న రష్యా స్టేడియాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దింది.
russia

లుజినికీ స్టేడియం(మాస్కో), సామర్థ్యం: 81,006

రష్యా రాజధాని మాస్కో నగర తీరం మోస్కా నదీ పరివాహక ప్రాంతంలో లుజినికీ స్టేడియం కొలువుదీరి ఉన్నది. సిటీ ప్రధాన కేంద్రం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న లుజినికీ స్టేడియం సామర్థ్యం 81 వేలు. ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిస్తున్న ప్రస్తుత స్టేడియాలన్నింటీలో ఇదే అతిపెద్దది. ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియా మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో పాటు సెమీఫైనల్-2, ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లకు ఈ వేదిక ఆతిథ్యమిస్తున్నది. 1955-56 మధ్యకాలంలో కేవలం 450 రోజుల్లో నిర్మితమైన లుజినికీ స్టేడియాన్ని తొలుత సెంట్రల్ లెనిన్ స్టేడియంగా పరిగణించేవారు. 1980లో మాస్కో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన ఈ స్టేడియం చారిత్రక సందర్భాలకు వేదికగా నిలిచింది. అయితే రెండేండ్ల తర్వాత జరిగిన యూఈఎఫ్‌ఏ టోర్నీలో తొక్కిసలాటలో 66 మంది చనిపోవడంతో విషాద చాయలు నెలకొన్నాయి. 1990లో పునరుద్ధరణ తర్వాత స్టేడియం పేరును లుజినికీగా మార్చారు. 2018 ప్రపంచకప్ కోసం దీన్ని రూపురేఖలను మార్చేశారు. అథ్లెటిక్స్ ట్రాక్‌ను తొలిగించడంతో పాటు స్టాండ్లను రెండుగా విభజించారు. అత్యాధునిక హంగులతో కండ్లు చిగేల్ మనేలా స్టేడియాన్ని నిర్మించిన తీరు అందరినీ ఆకట్టుకుంటున్నది.

Yekaterinburg-Stadium

ఎక్టరీన్‌బర్గ్ ఎరీనా, సామర్థ్యం: 35,696

రష్యాలోని నాలుగో పెద్ద నగరం ఎక్టరీన్‌బర్గ్‌లో ఉన్న ఈ స్టేడియం నిర్మాణం చాలా వినూత్నమైంది. యూరోప్, ఆసియా ఖండాల సరిహద్దుల్లో ఉన్న ఎక్టరీన్‌బర్గ్..యూరల్ పర్వత పాదాల చెంతలో ఉన్నది. ఈ ప్రపంచకప్‌లో ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఏకైక స్టేడియమిది. వ్లాదివోస్తోక్ నగరానికి సరిగ్గా4,590 మైళ్ల దూరంలో ఉన్న స్టేడియం రష్యా వైశాల్యం ఎంత పెద్దదో తెలియజేస్తున్నది. సాధారణంగా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే స్టేడియం తప్పనిసరిగా 35 వేల సామర్థ్యాన్ని కల్గి ఉండాలి. కానీ 1953-57 మధ్యకాలంలో నిర్మితమైన ఎక్టరీన్‌బర్గ్‌లోని ఈ స్టేడియానికి ఫిఫా నిబంధనలకు అనుగుణంగా లేదు. ఈ పరిస్థితుల్లో స్టేడియం రూపురేఖలను మారుస్తూ అసలు ఎవరూ ఊహించని రీతిలో నిర్మాణాన్ని మలిచారు. ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ స్టేడియంలో మిగతా స్టాండ్లకు భిన్నంగా ఓ స్టాండ్‌ను పూర్తిగా బయట నిర్మించారు. అదనపు సీటింగ్ సామర్థ్యంతో తాత్కాలికంగా నిర్మించిన ఈ స్టాండ్ స్టేడియానికి కొత్త రూపును తీసుకొచ్చింది. ఇందులో మ్యాచ్‌ను వీక్షించే అభిమానులకు కొత్త అనుభూతి మిగిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

samara

కాస్మోస్ ఎరీనా, సమారా, సామర్థ్యం: 44,807

రష్యా సౌత్‌ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న కాస్మోస్ ఎరీనా స్టేడియం చాలా వైవిధ్యంగా ఉంటుంది. 44 వేల ప్రేక్షకుల సామర్థం ఉన్న ఈ స్టేడియం వోల్గా నది ప్రాంతంలో నిర్మాణమై ఉన్నది. వాస్తవానికి నగరానికి దక్షిణాన ఐస్‌లాండ్ ప్రాంతంలో తొలుత స్టేడియాన్ని నిర్మించాలనుకున్నారు. కానీ ప్రజల నుంచి విమర్శల నేపథ్యంలో ఉత్తర దిశన నగర పరిధిలో స్టేడియానికి అంకరార్పణ జరిగింది. రష్యా స్పేస్ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన కాస్మోస్ నగరం పేరును స్టేడియానికి పెట్టారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో మిగతా స్టేడియాలతో పోలిస్తే కాస్మోస్ ఎరీనా చాలా విభిన్నంగా ఉంటుంది. 65.5 మీటర్ల ఎత్తుతో నిర్మించిన డోమ్..ఈ స్టేడియానికి ప్రత్యేక ఆకర్షణ. ఆస్టరాయిడ్ బిలాన్ని పోలి ఉండేలా స్టేడియం ఆకృతి కనిపిస్తుంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత లోకల్ ఫుట్‌బాల్ క్లబ్ క్రిలియా సోటోవ్ ఆతిథ్య వేదికగా మారనుంది.

Fisht_Olympic_Stadium

ఫిష్ట్ ఒలింపిక్ స్టేడియం, సామర్థ్యం: 47,700

యూరప్‌లో అతి పొడవైన సిటీగా పేరొంది న సోచీ నగరం బ్లాక్‌సీ నదీ ఒ డ్డున ఫిష్ట్ స్టేడి యం రూపుదిద్దుకుంది. కాకసస్ పర్వతసానువుల్లో ఒదిగిన ఈ స్టేడియం 2014లో వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చింది. ఒపెన్ ఎయిర్ స్టేడియంగా నిర్మితమైన ఈ స్టేడియం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. మంచుతో కప్పిన పర్వత శ్రేణుల ఆకారాన్ని తలపిస్తూ స్టేడియం పైకప్పును నిర్మించారు. వింటర్ ఒలింపిక్స్‌తో పాటు ఫిఫా ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిస్తున్న రెండో స్టేడియంగా ఫిష్ట్ నిలిచింది. ఫిష్ట్ పర్వతం పేరు మీద ఈ స్టేడియానికి పేరు పెట్టినట్లు ఫిఫా తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Krestovsky

క్రెస్టోవ్‌స్కీ స్టేడియం, సామర్థ్యం: 68,134

నెవా నదీ తీరంలో కొలువుదీరిన క్రెస్టోవ్‌స్కీ స్టేడియం నిర్మాణం అబ్బురపరుస్తుంది. అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యంతో నిర్మితమైన ప్రపంచ ఫుట్‌బాల్ స్టేడియాల్లో ఇది టాప్‌లో ఉంటుంది. కిషో కురొకోవా స్పేస్‌షిప్ డిజైన్ అనుసరించి స్టేడియాన్ని ఆధునిక హంగులతో నిర్మించారు. 2007లో మొదలైన నిర్మాణం వివిధ అవంతరాలతో 2009లో పూర్తయ్యింది. ఫిఫా నిబంధనలకు అనుగుణంగా డిజైనింగ్‌ను పూర్తిగా మర్చారు. రష్యన్ గ్యాస్ కంపెనీ గాజ్‌ప్రోమ్ నిర్మాణం నుంచి తప్పుకోగా..సెయింట్ పీటర్స్‌బర్గ్ ప్రభుత్వం పూర్తి చేసింది. 2017 కాన్ఫిడరేషన్ కప్ నాటికి పూర్తయిన ఈ స్టేడియంలో ైస్లెడింగ్ పిచ్‌తో పాటు పైకప్పుతో రూపొందించారు. జెనీత్ సెయింట్ పీటర్స్‌బర్గ్ క్లబ్‌కు ఆతిథ్య వేదికైన ఈ స్టేడియంలో గ్రూపు, నాకౌట్ మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్-1, వర్గీకరణ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది.

1004

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles