ఘనంగా ముగిస్తారా!


Thu,October 12, 2017 12:29 AM

ఘనా జట్టుతో భారత్‌పోరు
ఫిఫా ప్రపంచకప్

india
న్యూఢిల్లీ: ఫిఫా అండర్-17 ప్రపంచకప్‌నకు ముందు భారత్‌పై అంచనాలు అస్సలు లేవు. కానీ కొండంత ఆత్మవిశ్వాసముంది. తొలిమ్యాచ్‌లో అమెరికా చేతిలో ఓడి నా.. కొలంబియాపై భారత్ పోరాడిన తీరు అందరినీ కట్టిపడేసింది. మణిపూర్ స్టార్ జాక్సన్‌సింగ్ సూపర్ హెడర్‌గోల్‌తో భారత్‌కు ప్రపంచకప్‌లో తొలి గోల్ అందించి రికార్డుల్లోకెక్కాడు. అదే ఆత్మవిశ్వాసంతో పటిష్ఠ ఘనాపై గెలుపుతో మెగా టోర్నీకి ఘనమైన ముగింపు పలుకాలన్న ఆరాటంలో అమర్‌జీత్‌సింగ్ సేన ఉంది. నాకౌట్ ఆశలు లేకపోయినా.. పోరాడాలన్న కసితో మన కుర్రాళ్లు ఉన్నారు. గ్రూప్-ఏలో భాగంగా భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఘనా జట్టుతో గురువారం ఆడనుంది. వరుసగా రెండు ఓటములతో పాయింట్ల ఖాతా తెరువని భారత్‌కు నాకౌట్ అవకాశాలు లేకపోయినా.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మా జీ చాంపియన్ ఘనాకు పోటీనివ్వలన్న పట్టుదలతో ఉన్నది.

నాకౌట్ బెర్తు కష్టమే


గ్రూపు-ఎలో ప్రస్తుత సమీకరణాలు గమనిస్తే..అమెరికా రెండింటిలో గెలిచి ఆరు పాయింట్లతో ఇప్పటికే నాకౌట్ బెర్తు దక్కించుకుంది. ఒక్కో విజయంతో కొలంబియా(3), ఘనా(3) రెండు, మూడు స్థానాల్లో ఉండగా, రెండు ఓటములతో భారత్ నాలుగులో ఉన్నది. ఈ నేపథ్యంలో నాకౌట్ కు అర్హత సాధించడం భారత్‌కు కష్టమే. అయితే గ్రూపులో రెండో బెర్తు కోసం కొలంబియా, ఘనా మధ్య పోటీ నెలకొన్నది. ఒకవేళ పాయింట్ల పరంగా సమమైతే గోల్స్ తేడాను పరిగణనలోకి తీసుకుని మెరుగైన జట్టు ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశిస్తుంది.

334

More News

VIRAL NEWS