నోబాల్స్‌కు ఓ అంపైర్


Wed,November 6, 2019 12:25 AM

IPL2020

-ఐపీఎల్ కమిటీ ఆలోచన

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల్లో నో బాల్స్ గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓ అంపైర్‌ను నియమించాలని ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ ఆశిస్తున్నది. వచ్చే సీజన్ నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉంది. చైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధ్యక్షతన మంగళవారం ఇక్కడ సమావేశమైన ఐపీఎల్ పాలనా కమిటీ (సీజీ).. వచ్చే ఏడాది జరుగనున్న సీజన్ కోసం ప్రణాళికలు, విదేశీ ఆటగాళ్ల అందుబాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. రెగ్యులర్ అంపైర్లతో పాటు ఐపీఎల్ వచ్చే సీజన్‌లో మరో అదనపు అంపైర్‌ను చూసే అవకాశం ఉంది. నోబాల్స్‌ను పరిశీలించేందుకే ఆ అంపైర్ ప్రత్యేకంగా ఉంటారు. ఈ కాన్సెప్ట్ వినేందుకు కాస్త విభిన్నంగా అనిపించొచ్చు. సమావేశంలో దీనిపై చర్చించాం అని ఐపీఎల్ కమిటీలోని ఓ సీనియర్ సభ్యుడు చెప్పాడు. ఐపీఎల్‌లో భారత అంపైర్లు నోబాల్స్‌ను సరిగా గుర్తించలేకున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కమిటీ ఈ దిశగా అడుగులు వేస్తున్నది. ఈ సీజన్‌లో భారత అంపైర్ ఎస్.రవిపై టీమ్‌ఇండియా కెప్టెన్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ నోబాల్ వేసినా అంపైర్ రవి గుర్తించలేకపోవడంతో విరాట్ సారథ్యంలోని బెంగళూరు కీలక సమయంలో నష్టపోయి, చివరికి మ్యాచ్ ఓడిపోయింది.

నో పవర్ ప్లేయర్

తీవ్ర చర్చనీయాంశమైన ఆటగాళ్ల సబ్‌స్టిట్యూషన్ నిబంధన పవర్ ప్లేయర్ వచ్చే సీజన్‌లో ప్రవేశపెట్టే అవకాశం లేదని స్పష్టమైపోయింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ నిబంధనను పరీక్షించడం సాధ్యం కాని కారణంగా ఐపీఎల్ కమిటీ పక్కనపెట్టింది. సీనియర్లతో నిండిన ఓ జట్టు ప్రయోజనాల కోసం పవర్ ప్లేయర్‌ను తెస్తున్నారంటూ విమర్శలు రావడంతో పాటు బుకీలు ఫిక్సింగ్‌కు యత్నించే అవకాశాలు అధికమవుతాయని ఆందోళన వ్యక్తమవడంతో ఇప్పటికైతే పవర్ ప్లేయర్ ఆలోచనను కమిటీ విరమించుకుంది.

773

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles