బెయిర్‌స్టో సెంచరీ బాదెన్ ఇంగ్లండ్‌దే మూడో వన్డే


Thu,May 16, 2019 04:05 AM

Bairstow
బ్రిస్టల్: సొంతగడ్డపై ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇంగ్లండ్ వరుస విజయాలతో అదరగొడుతున్నది. పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ముందంజ వేసింది. పాక్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ మరో 31 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్లు జాసన్ రాయ్(76), జానీ బెయిర్‌స్టో(93 బంతుల్లో 128, 15ఫోర్లు, 5సిక్స్‌లు) ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాయ్..వెనుతిరిగి చూడలేదు. బెయిర్‌స్టోకు చక్కని సహకరమందిస్తూ ముందుకు సాగాడు. పిచ్ పరిస్థితులకు తోడు, షార్ట్ బౌండరీలు, వేగవంతమైన ఔట్‌ఫీల్డ్‌ను అనుకూలంగా మలుచుకుంటూ 18 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ముఖ్యంగా తన ఐపీఎల్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ పాక్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 5 సిక్స్‌లతో అదరగొట్టిన బెయిర్ స్టో తన వన్డే కెరీర్‌లో ఏడో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఏ ఒక్క బౌలర్‌ను విడిచిపెట్టకుండా బెయిర్ స్టో సాగించిన విధ్వంసానికి పాక్ జట్టు చేష్టలుడిగిపోయింది. ఆఖర్లో మొయిన్ అలీ(46 నాటౌట్), కెప్టెన్ మోర్గాన్(17 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. వన్డేల్లో భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఇంగ్లండ్‌కు ఇది రెండోసారి. జునైద్ ఖాన్, ఇమాద్ వసీం, ఫహీమ్ ఆష్రాఫ్ ఒక్కో వికెట్ తీశారు. తొలుత ఇమాముల్ హక్(151) సెంచరీకి తోడు అసిఫ్ అలీ(52) అర్ధసెంచరీతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 358/9 స్కోరు చేసింది. 16 ఫోర్లు, సిక్స్‌తో ఆకట్టుకున్న ఇమామూల్ వన్డేల్లో ఆరో సెంచరీని నమోదు చేసుకున్నాడు. వోక్స్(4/67) నాలుగు వికెట్లతో రాణించాడు. బెయిర్‌స్టోకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

621

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles