ఓటమి ముంగిట్లో!


Tue,September 11, 2018 02:21 AM

-భారత్ లక్ష్యం 464.. ప్రస్తుతం 58/3..
-ధవన్, పుజార, కోహ్లీ అట్టర్ ఫ్లాప్
-కుక్, రూట్ సెంచరీల మోత..
-ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 423/8 డిక్లేర్డ్
సుదీర్ఘ సమరంలో భారత్ మరో భారీ ఓటమి చేరువైంది. అద్భుతాలు జరిగితే తప్పా పరాజయాన్ని అడ్డుకోవడం అసాధ్యం. సిరీస్‌లో బ్యాటింగ్ వైఫల్యం దిగ్విజయంగా కొనసాగుతున్న వేళ ఇంగ్లండ్ పేస్ ముందు మనోళ్లు మోకరిల్లారు. ఓవైపు ప్రత్యర్థులు శతకాలతో చెలరేగుతుంటే..పరుగుల వేటలో విఫలమైన కోహ్లీసేన ఐదో టెస్ట్‌లో ఓటమి ముంగిట్లో నిలిచింది. అండర్సన్ డబుల్ ధమాకాతో భారత టాపార్డర్ కకావికలైంది. రెండంటే రెండు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆఖరి టెస్ట్ ఆడుతున్న అలిస్టర్ కుక్, జోరూట్ సూపర్ సెంచరీలతో ఇంగ్లండ్ భారీ స్కోరు అందుకుంది.
dhawan-kohli-pujara
లండన్: చరిత్ర మారలేదు. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం భారత్‌కు అందనంత దూరంలోనే ఆగిపోయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టు అనిపించుకుంటామన్న చీఫ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలకు విరుద్ధమైన ఫలితం ఎదురైంది. ఇంగ్లండ్‌కు ఏ దశలోనూ పోటీనివ్వని భారత్..ఐదు టెస్ట్‌ల సుదీర్ఘ పోరాటంలో మరో ఓటమికి అడుగు దూరంలో ఉన్నది. ఇంగ్లండ్ నిర్దేశించిన 464 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమ్‌ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్( 51 బంతుల్లో 46 నాటౌట్, 8ఫోర్లు), రహానే(47 బంతుల్లో 10 నాటౌట్, ఫోర్) క్రీజులో ఉన్నారు. అండర్సన్(2/23)కు రెండు వికెట్లు దక్కగా, బ్రాడ్(1/17)ఒక వికెట్ పడగొట్టాడు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న టీమ్‌ఇండియా ఓటమి నుంచి తప్పించుకోవడానికి 406 పరుగుల దూరంలో ఉన్నది.

england

1, 0, 0

ప్రత్యర్థి ముందు భారీ లక్ష్య నిర్దేశంతో జోష్‌మీద బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు అండర్సన్ ఆదిలోనే అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. భారత పేస్ బౌలర్లు విఫలమైన చోట తనదైన స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగిన అండర్సన్..స్కోరుబోర్డుపై పరుగుల రాకకు ముందే టపాటపా వికెట్లు పడగొట్టాడు. ఇన్‌స్వింగ్ డెలీవరీతో ధవన్(1)ను వికెట్ల ముందు అడ్డంగా దొరకబుచ్చుకున్నాడు. దూసుకొచ్చిన అండర్సన్ బంతిని సరిగ్గా అర్థం చేసుకోని ధవన్..మరోమారు పేలవషాట్‌తో పెవిలియన్ వైపు కదిలాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి పుజారను ఎల్బీడబ్యూ చేసిన జిమ్మీ సహచరులతో కలిసి సంబురాలు చేసుకున్నాడు. దీంతో ఒక పరుగుకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. పుజార తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ కోహ్లీ(0)గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

బ్రాడ్ స్వింగ్ బంతిని షాట్ ఆడబోయిన కోహ్లీ..వికెట్‌కీపర్ బెయిర్‌స్టో చేతికి చిక్కడంతో టీమ్‌ఇండియా 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక పని అయిపోయిందనుకున్న తరుణంలో ఓపెనర్ రాహుల్, రహానే చక్కని సమన్వయంతో ఆడారు. ముఖ్యంగా రాహుల్ దూకుడైన ఆటతీరుతో కీలక పరుగులు కొల్లగొడుతూ ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆట ముగసే సరికి నాలుగో వికెట్‌కు వీరిద్దరు 56 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండు వికెట్ల తీయడం ద్వారా అండర్సన్(563)..ఆస్ట్రేలియా గ్రేట్ గ్లెన్ మెక్‌గ్రాత్(563) సరసన నిలువగా, కపిల్‌దేవ్(434)రికార్డుకు బ్రాడ్(433) అడుగుదూరంలో ఉన్నాడు.

కుక్, రూట్ శతక మోత:

అలిస్టర్ కుక్(286 బంతుల్లో 147, 14ఫోర్లు), కెప్టెన్ జోరూట్(190 బంతుల్లో 125, 12ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీలతో కదంతొక్కారు. దీంతో ఓవర్‌నైట్ స్కోరు (114/2)తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్..423/8 వద్ద డిక్లేర్ చేసింది. భారత బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ కుక్, రూట్ పరుగులు సాధించారు. దీనికి తోడు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం వీరికి బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కుక్..సమయోచిత షాట్లతో అభిమానులను అలరించాడు. కుక్, రూట్ చక్కని సమన్వయంతో ఇంగ్లండ్ 171 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యం అందుకుంది. ఈ క్రమంలో కుక్ పలు రికార్డులను తన పేరిట లఖించుకున్నాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే క్యాచ్ విడిచిపెట్టడంతో బయటపడ్డ రూట్..అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 70వ ఓవర్లో కుక్..తన కెరీర్‌లో 33వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో స్టేడియంలోని అభిమానులు లేచి నిలబడి కుక్ ప్రదర్శనను చప్పట్లతో అభినందించారు. మరోవైపు రూట్ కూడా సెంచరీని ఖాతాలో వేసుకుని తిరిగి ఫామ్‌లోకొచ్చాడు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి(3/37) విడగొట్టాడు. ఒకే ఓవర్లో ఇద్దరిని పెవిలియన్ పంపి మూడో వికెట్‌కు 259 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరతీశాడు. ఆఖర్లో స్టోక్స్(37), స్యామ్ కర్రాన్(21), రషీద్(20) బ్యాట్లు ఝలిపించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు అందుకుంది. జడేజా(3/179), షమీ(2/110) రాణించారు.

1.

టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు(12472) చేసిన ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌గా కుక్ నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో సంగక్కర(12400), లారా(11953), చంద్రపాల్(11867), బోర్డర్(11174) ఉన్నారు.

2.

టెస్ట్‌ల్లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన వారిలో పాంటింగ్(2555) తర్వాత కుక్(2431) రెండో స్థానంలో ఉన్నాడు. ైక్లెవ్ లాయిడ్(2344), మియాందాద్(2228), చంద్రపాల్(2171) ఆ తర్వాత ఉన్నారు.

2.

టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు(31) చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కుక్ రికార్డు అందుకున్నాడు. సునీల్ గవాస్కర్(33) టాప్‌లో ఉండగా, మాథ్యూ హేడెన్(30), గ్రేమ్ స్మిత్(27) రెండు, మూడులో ఉన్నారు.

స్కోరుబోర్డు

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 332 ఆలౌట్, భారత్ తొలి ఇన్నింగ్స్: 292 ఆలౌట్, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: కుక్(సి)పంత్(బి)విహారి 147, జెన్నింగ్స్(బి)షమీ 10, అలీ(బి)జడేజా 20, రూట్(సబ్/హార్దిక్)(బి)విహారి 125, బెయిర్‌స్టో(బి)షమీ 18, స్టోక్స్(సి)రాహుల్(బి)జడేజా 37, బట్లర్(సి)షమీ(బి)జడేజా 0, కర్రాన్(సి)పంత్(బి)విహారి 21, రషీద్ 20 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 25; మొత్తం: 112.3 ఓవర్లలో 423/8 డిక్లేర్డ్, వికెట్ల పతనం: 1-27, 2-62, 3-321, 4-321, 5-355, 6-356, 7-397, 8-423; బౌలింగ్: బుమ్రా 23-4-61-0, ఇషాంత్ 8-3-13-0, షమీ 25-3-110-2, జడేజా 47-3-179-3, విహారి 9.3-1-37-3.

భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ 46 నాటౌట్, ధవన్(ఎల్బీ)అండర్సన్ 1, పుజార(ఎల్బీ)అండర్సన్ 0, కోహ్లీ(సి)బెయిర్‌స్టో(బి)బ్రాడ్ 0, రహానే 10 నాటౌట్;
ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 18 ఓవర్లలో 58/3; వికెట్ల పతనం: 1-1, 2-1, 3-2; బౌలింగ్: అండర్సన్ 5-2-23-2, బ్రాడ్ 5-0-17-1, అలీ 3-0-8-0, కర్రాన్ 2-1-1-0, స్టోక్స్ 2-1-8-0.

412

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles