కింగ్ ఎవరో?


Sun,July 14, 2019 12:38 AM

-నేడే వన్డే ప్రపంచకప్ ఫైనల్
-హిట్టర్లతో ఇంగ్లండ్.. బౌలర్లతో న్యూజిలాండ్
-తుదిపోరుకు సిద్ధమైన ఇరుజట్లు
భారీ సెంచరీలు.. భీకర బౌలింగ్ ప్రదర్శనలు. కళాత్మక కవర్ డ్రైవ్‌లు.. చూడచక్కని స్ట్రెయిట్ డ్రైవ్‌లు. కండ్లు చెదిరే క్యాచ్‌లు.. అబ్బుర పరిచే రనౌట్‌లు. గుండెను హత్తుకునే హ్యాట్రిక్‌లు.. ఒళ్లు గగుర్పొడిచే ఫీల్డింగ్ విన్యాసాలు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించిన వీరులు కొందరైతే.. సమిష్టి ప్రదర్శనతో ముందుకు సాగిన జట్లు మరికొన్ని.. ఇలా 45 రోజుల పాటు 47 మ్యాచ్‌ల్లో నమోదైన పరుగుల జడివానలో తడిసి ముైద్దెన అభిమానులను మరింత అలరించేందుకు మెగా ఫైనల్ ముస్తాబైంది. నెలన్నరగా ప్రతీ ఒక్కరినీ ఉర్రూతలూగించిన వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. నాలుగేండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించే సమయం ఆసన్నమైంది. మరి కొద్ది గంటల్లో ప్రపంచకప్‌ను ముద్దాడే జట్టేదో తేలిపోనుంది. విశ్వసమరంలో భాగంగా జూన్ 16న పాకిస్థాన్‌పై భారత్ జయభేరి మోగించిన అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ ఓ ప్రశ్నకు బదులిస్తూ.. భారత్ పటిష్టంగా ఉన్న మాట వాస్తవమే కానీ.. న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయకూడదు. ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వస్తున్న ఆ జట్టు అత్యంత ప్రమాదకారిఅని అన్నాడు. నెలరోజులు తిరగకముందే.. మోర్గాన్ అంచనా నిజమైంది. సెమీస్‌లో పటిష్ట భారత్‌ను మట్టికరిపించిన న్యూజిలాండ్ క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. ఆటకు ఓనమాలు నేర్పించి.. 44 ఏండ్లలో ఐదుసార్లు మెగాటోర్నీకి ఆతిథ్యమిచ్చినా.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పును అక్కున చేర్చుకోలేకపోయిన ఇంగ్లండ్.. క్రితంసారి తుదిమెట్టుపై బోల్తా కొట్టిన న్యూజిలాండ్.. రెండు జట్లూ ఈసారి ట్రోఫీని ఒడిసి పట్టాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నాయి.
World-Cup1
లండన్: ఎన్ని కప్పులు సొంతం చేసుకున్నా.. మరెన్ని సిరీస్‌లు చేజిక్కించుకున్నా.. ప్రపంచకప్‌ను ముద్దాడటంలో ఉన్న మజానే వేరు. అందులో అది తొలిసారైతే ఆ అనుభూతి అనిర్వచనీయం. ఇలాంటి దశలోనే ఆదివారం ఐసీసీ 12వ ప్రపంచకప్ ఫైనల్‌కు ఇంగ్లండ్, న్యూజిలాండ్ రెడీ అయ్యాయి. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్.. చివరి మూడు లీగ్ మ్యాచ్‌ల్లోనూ ఓడి నాకౌట్ చేరుతుందా అనే అనుమానాలు రేకెత్తించినా.. రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో చచ్చీచెడి సెమీస్ చేరింది. ఏడాది ముందు నుంచే మంచి కాక మీద కనిపించిన ఇంగ్లండ్ హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగినా.. అనూహ్య పరాజయాలతో ఒకదశలో నాకౌట్ చేరడం కష్టమే అనిపించింది.

అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గడం ఆ జట్టుకు కలిసొచ్చి సెమీస్ చేరింది. అక్కడి వరకు ఒక లెక్క అక్కడి నుంచి మరో లెక్క అన్నట్లు సెమీఫైనల్లో రెండు జట్లు అదరగొట్టాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌కు న్యూజిలాండ్ షాకిస్తే.. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఇంటి దారి పట్టించి 27 ఏండ్ల తర్వాత తుది సమరానికి చేరింది. అకుంఠిత దీక్ష, అసమాన పట్టుదల ఉన్నా.. ఆవకాయంత అదృష్టం ఉండాలంటారు. మరి ఆ లక్కీ చాన్స్ ఎవరు కొట్టేస్తారో చూడాలి.

జే జే జెజ్జేజె..

బ్యాటింగే ప్రధానాయుధంగా ఇంగ్లండ్ తుదిపోరుకు చేరింది. బ్యాటింగ్‌లో జెచతుష్టయం జానీ బెయిర్‌స్టో (496), జాసన్ రాయ్ (426), జో రూట్ (549), జోస్ బట్లర్ (253) పరుగులు వరద పారిస్తుంటే.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (362), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (381) మెరుపులు మెరిపిస్తున్నారు. సొంత మైదానాలు, ఫ్లాట్ పిచ్‌లు, చిన్న బౌండ్రీలు ఇలా అనేక సానుకూలతల మధ్య బరిలో దిగిన ఇంగ్లండ్ అనుకున్నట్లే తుదిపోరుకు చేరింది. 1979, 1987, 1992 ప్రపంచకప్‌ల్లో ఫైనల్ చేరినా.. తుదిమెట్టుపై బోల్తా కొట్టిన ఇంగ్లండ్ ఈ సారి ఆ తప్పు జరగకూడదని కృతనిశ్చయంతో ఉంది. బౌలింగ్‌లో ఆర్చర్ (19), వుడ్ (17), వోక్స్ (13), రషీద్ (11) ఫర్వాలేదనిపిస్తున్నా.. ఇంగ్లండ్ గెలిచిన మ్యాచ్‌ల్లో ఎక్కువ శాతం బ్యాట్ పవర్‌తో వచ్చినవే. హిట్టర్లకు నెలవుగా మారిన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను అడ్డుకోవడంపైనే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఓపెనర్లు రాయ్, బెయిర్‌స్టో చూస్తుండగానే మ్యాచ్‌పై పట్టు సాధించడంలో సిద్ధ హస్తులు. మూడో నంబర్‌లో నిలకడకు మారుపేరైన జో రూట్ స్థిరంగా ఆడుతున్నాడు. ఆ తర్వాత మోర్గాన్, స్టోక్స్, బట్లర్, వోక్స్ భారీ స్కోర్లు చేయడానికే ఉన్నదన్నట్లు రెచ్చిపోతున్నారు. రెండో స్పిన్నర్ లోటు కనిపిస్తున్నా ఆదిల్ రషీద్ తన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. మొత్తంగా ఆతిథ్య జట్టు ఈ సారి కప్పు కొట్టి తమ అభిమానుల ఐదు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని తహతహలాడుతున్నది.

సమిష్టితత్వమే మంత్రంగా..

నాయకుడు ముందుండి నడిపిస్తే.. ఆ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి సరైన ఉదాహరణ న్యూజిలాండ్. గత ప్రపంచకప్‌లో మెకల్లమ్ ప్రదర్శనను మైమరిపిస్తూ.. టీమ్‌ను ఫైనల్‌కు చేర్చిన విలియమ్సన్.. ఆఖరి పోరాటంలోనూ అదే స్ఫూర్తితో చెలరేగిపోవాలని భావిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 91.33 సగటుతో 548 పరుగులు చేసిన విలియమ్సన్ జట్టులో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నిలకడ లోపించినా.. ఆల్‌రౌండర్ల నైపుణ్యం, బౌలర్ల పట్టుదలతో కేన్ జట్టును తుదిపోరుకు చేర్చాడు. టేలర్ (335) ఓ మోస్తరుగా రాణిస్తుంటే.. ఎన్నో ఆశలు పెట్టుకున్న గప్టిల్ (167) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆల్‌రౌండర్లు నీషమ్ (213), గ్రాండ్‌హోమ్ (174) అవసరమైనప్పుడు ఆదుకుంటున్నారు.

బౌలింగ్ విభాగంలో బ్లాక్‌క్యాప్స్‌కు తిరుగులేదనే చెప్పాలి. ఫెర్గూసన్ (18), బౌల్ట్ (17), హెన్రీ (13), నీషమ్ (12) కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టును పోటీలో నిలుపుతూ వచ్చారు. సెమీస్‌లో భారత్‌పై చెలరేగిపోయిన శాంట్నర్‌ను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కీలక మ్యాచ్‌లో కెప్టెన్‌కు గప్టిల్, టేలర్ సహకారం తోడైతే.. కివీస్‌కు బ్యాటింగ్‌లో కొండంత బలం చేకూరినట్లే. ఫైనల్లో ఇంగ్లండే ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నా.. పోరాట పటిమలో ఎవరికీ తీసిపోని బ్లాక్ క్యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే అనేది విశ్లేషకుల మాట.

లీగ్ దశలో ఇంగ్లండ్‌దే పైచేయి

ఇంగ్లండ్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతోనే నాకౌట్‌కు చేరింది. ఈ నెల 3న జరిగిన పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 305 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (106) సెంచరీతో చెలరేగగా.. రాయ్ (60), మోర్గాన్ (42) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో లాథమ్ (57) మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో కివీస్ 186 పరుగులకే ఆలౌటైంది. విలియమ్సన్ (27) విఫలమయ్యాడు.

7

-గత 11 ప్రపంచకప్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఏడుసార్లు విజయం సాధించాయి. గత రెండు మెగాటోర్నీల్లో మాత్రం ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి.

-ఇటీవల ఇంగ్లండ్ న్యూజిలాండ్ తలపడిన 9 మ్యాచ్‌ల్లో ఏడింట ఇంగ్లండ్ నెగ్గితే.. రెండింట కివీస్ విజయం సాధించింది.

1

-మరొక్క పరుగు చేస్తే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా.. శ్రీలంక మాజీ సారథి మహేళ జయవర్ధనే (548; 2007లో)ను అధిగమించి విలియమ్సన్ (548) అగ్రస్థానానికి చేరుతాడు.

-రెండు జట్లలో ఎవరు గెలిచినా వారికి ఇదే తొలి ప్రపంచకప్. గతంలో ఇంగ్లండ్ మూడుసార్లు (1979, 1987, 1992ల్లో) ఫైనల్ చేరినా.. రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. న్యూజిలాండ్ క్రితంసారి (2015లో) ఆసీస్ చేతిలో ఓడింది.

సండే బ్లాక్ బస్టర్

ఆదివారం ఇంగ్లండ్‌లో మూడు మెగా ఈవెంట్లు జరుగనున్నాయి. ఓ వైపు వన్డే ప్రపంచకప్ తుదిపోరు.. మరోవైపు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌తో పాటు బ్రిటీష్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేసింగ్ జరుగనుంది. దీంతో సండే ట్రిపుల్ ధమాకాకు అభిమానులు రెడీ అయిపోయారు.

* గత ప్రదర్శన ఎలా ఉందనే విషయాలు పక్కన పెట్టి చక్కటి ఆటతీరు కనబర్చడం ముఖ్యం. ఏ టోర్నీలోనైనా తుదిపోరుకు చేరడం అనేది పెద్దవిషయం. సానుకూలంగా ముందుకు నడవాలనుకుంటున్నాం
- కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్

*నాలుగేండ్ల కష్టానికి ప్రతిఫలం దక్కే టైమ్ వచ్చింది. తుది సమరం కోసం జట్టు సభ్యులంతా ఉత్సుకతతో ఉన్నారు. ట్రోఫీని హత్తుకోవడం గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు.
- మోర్గాన్, ఇంగ్లండ్ కెప్టెన్

పిచ్, వాతావరణం

స్వల్పంగా పచ్చికతో కూడిన పిచ్ నుంచి పేసర్లు లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

తుది జట్లు (అంచనా)

ఇంగ్లండ్: రాయ్, బెయిర్‌స్టో, రూట్, మోర్గాన్ (కెప్టెన్), స్టోక్స్, బట్లర్, వోక్స్, ప్లంకెట్, ఆర్చర్, రషీద్, వుడ్.

న్యూజిలాండ్: గప్టిల్, నికోల్స్, విలియమ్సన్ (కెప్టెన్), టేలర్, లాథమ్, నీషమ్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, హెన్రీ, బౌల్ట్, ఫెర్గూసన్.

ఫైనల్ చేరాయిలా..

england

nz

runs-wickets

1171

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles