కిప్‌చోగె కమాల్


Sun,October 13, 2019 12:40 AM

Marathaon

-42 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లోపే పూర్తి చేసిన కెన్యా అథ్లెట్

వియన్నా (ఆస్ట్రియా): వారం రోజుల క్రితం ఆస్ట్రియా గడ్డపై చరిత్ర తిరగరాస్తా అని ప్రకటించిన ఒలింపిక్ చాంపియన్, కెన్యా మారథాన్ రన్నర్ ఎలిడ్ కిప్‌చోగె.. చెప్పిన మాటలను చేతల్లో చూపెట్టాడు. మానవమాత్రులకు అసాధ్యమనుకున్న ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. రెండు గంటల్లోపే (గంటా 59 నిమిషాల 40.2 సెకన్లు) మారథాన్ (42.195 కిలోమీటర్లు) పరుగు పూర్తి చేసి యావత్ ప్రపంచంతో శభాష్ అనిపించుకున్నాడు. మానవ శక్తికి హద్దులు లేవు. అందుకు నేనే ఉదాహరణ. ఈ పరుగుతో ప్రజల్లో చైతన్యం నింపాలనుకున్నా. రెండు గంటల్లోపు మారథాన్ పూర్తిచేసిన తొలి వ్యక్తిని నేనే. మనమంతా ఈ ప్రపంచాన్ని అందమైన, శాంతికాముక లోకంగా తీర్చిదిద్దాలి అని పరుగు అనంతరం అన్న కిప్‌చోగె తన సందేశంతోనూ అందరి మన్ననలు అందుకున్నాడు. దారి పొడవునా కెన్యా దేశస్తుల జయజయధ్వానాల మధ్య పరుగు కొనసాగించిన 34 ఏండ్ల కిప్‌చోగె.. చిరునవ్వుతో ఫినిష్ లైన్ దాటాడు. ఇప్పటికే 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో అత్యంత తక్కువ సమయంలో మారథాన్ పూర్తిచేసిన రన్నర్‌గా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న కిప్‌చోగె.. ఇప్పుడు తన బెస్ట్ టైమింగ్‌ను మరో 2 నిమిషాలు మెరుగు పర్చుకున్నాడు. అయితే ప్రాటర్ పార్క్‌లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రాక్‌పై పరుగెత్తడంతో దీనికి రికార్డుల్లో చోటు దక్కలేదు. మామూలు మారథాన్ రన్నింగ్ ట్రాక్‌లతో పోల్చుకుంటే.. తక్కువ మలుపులు, గాయాలయ్యే అవకాశాల్లేని ట్రాక్ కావడంతో అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య (ఐఏఏఎఫ్) దీనికి అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. కాగా ఈ పరుగులో కిప్‌చోగె సగటున 2 నిమిషాల 50 సెకన్లకు ఒక కిలోమీటర్ చొప్పున పరుగెత్తడం విశేషం.

354

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles