బిస్త్ భళా..


Sat,February 23, 2019 04:32 AM

-నాలుగు వికెట్లతో విజృంభణ
-ఇంగ్లండ్‌పై మిథాలీసేన ఘనవిజయం

Ekta
ముంబై: అమ్మాయిలు అదరగొట్టారు. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ప్రత్యర్థిని పడగొట్టారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో మిథాలీరాజ్ సారథ్యంలోని టీమ్‌ఇండియా 66 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీని ద్వారా ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్ రెండు పాయింట్లు దక్కించుకోవడంతో పాటు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. మిథాలీసేన నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్..ఏక్తా బిస్త్(4/25) ధాటికి 41 ఓవర్లలో 136 పరుగులకు కుప్పకూలింది. నటాలీ స్కీవర్(44), కెప్టెన్ హీథర్ నైట్(39) రాణించగా, మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో ఓ దశలో 3 వికెట్లకు 111 పరుగులతో మెరుగ్గా కనిపించిన ఇంగ్లండ్..ఏక్తా స్పిన్ విజృంభణతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. బిస్త్ స్పిన్‌ను సరిగ్గా అర్థం చేసుకోని ఇంగ్లిష్ బ్యాట్స్‌వుమన్ 24 పరుగుల తేడాతో ఆఖరి ఏడు వికెట్లు కోల్పోయి ఓటమివైపు నిలిచారు. పిచ్‌ను తనకు అనుకూలంగా మలుచుకున్న బిస్త్ ఐదు బంతుల తేడాతో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ నడ్డి విరిచింది. శిఖా పాండే(2/21), దీప్తిశర్మ(2/33) రెం డేసి వికెట్లతో రాణించారు. తొలుత జెమీమా రోడ్రిగ్స్(48), కెప్టెన్ మిథాలీరాజ్ (44) బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా 49.4 ఓవర్లలో 202 పరుగులు చేసింది.

ఓపెనర్లు రోడ్రిగ్స్, మందన (24) జట్టుకు మెరుగైన శుభారంభాన్నందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అయితే ఎల్వీస్(2/45) బౌలింగ్‌లో మందన క్లీన్‌బౌల్డ్‌గా తొలి వికెట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత దీప్తిశర్మ(7), రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్(2), మోనా మెశ్రమ్(0) వెంటవెంటనే నిష్క్రమించినా..భాటియా (25) తో కలిసి మిథాలీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరు ఆరో వికెట్‌కు 94 బంతుల్లో 54 పరుగులు జోడించారు. మిథాలీ ఔట్ తర్వాత ఆఖర్లో వెటరన్ జులన్ గోస్వామి(37 బంతుల్లో 30, 3ఫోర్లు, సిక్స్) ధనాధన్ బ్యాటింగ్‌తో భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. స్కీవర్(2/29), ఎకల్‌స్టోన్(2/27) రెండేసి వికెట్లు తీశారు. నాలుగు వికెట్లతో రాణించిన ఏక్తా బిస్త్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

544

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles