ధవన్ దంచెన్..


Sat,April 13, 2019 02:22 AM

-7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలిచెన్
-రిషబ్ జోరు..కోల్‌కతాకుమూడో పరాజయం

మొత్తానికి ఈడెన్ గార్డెన్స్ ప్రత్యర్థి శిబిరం డగౌట్‌లో కూర్చోని గంగూలీ ఇచ్చిన సలహాలు, సూచనలు అమోఘంగా పని చేశాయి. వేసిన స్కెచ్‌ను పక్కాగా అమలు చేపిస్తూ.. అనుక్షణం ఢిల్లీని పరుగులు పెట్టించిన దాదా.. వరుస విజయాలతో జోరుమీదున్న కోల్‌కతాకు చెక్ పెట్టించాడు. శిఖర్ ధవన్ (63 బంతుల్లో 97 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌కు.. రిషబ్ పంత్ (31 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) జోరు తోడుకావడంతో.. ఢిల్లీ నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్నది. మరోవైపు శుభ్‌మన్ గిల్, రస్సెల్ బ్యాటింగ్ థ్రిల్ వృథా అయ్యింది. బౌలర్ల వైఫల్యంతో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక మూడో ఓటమిని మూటగట్టుకుంది.
Dhawan
కోల్‌కతా: భారీ లక్ష్య ఛేదనలో సమిష్టిగా చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఐపీఎల్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. సరైన ఆరంభం లభించకపోయినా.. ధవన్ యాంకర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. దీంతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో కోల్‌కతాపై గెలిచింది. టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా, కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్‌గా ప్రమోట్ అయిన శుభ్‌మన్ గిల్ (39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రస్సెల్ (21 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టారు. తొలి బంతికే డెన్లీ (0) వికెట్ కోల్పోయిన కేకేఆర్ ఇన్నింగ్స్‌ను గిల్ ఆదుకున్నాడు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ కీలక భాగస్వామ్యాలతో ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఉతప్ప (30 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా వరుసగా ఫోర్లు కొడుతూ చెలరేగాడు. ఈ క్రమంలో పవర్‌ప్లేలో కోల్‌కతా 41/1 స్కోరు చేసింది. పాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో జోరు చూపెట్టిన ఉతప్ప 9వ ఓవర్‌లో ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మిడిలార్డర్‌లో నితీశ్ రానా (11) సిక్సర్‌తో జోరు చూపెట్టినా.. మూడో వికెట్‌కు 30 పరుగులు జత చేసి ఔటయ్యాడు. ఈ దశలో రస్సెల్ మరోసారి రఫ్పాడించాడు. వరుసగా ఆరోసారి 40కి పైగా పరుగులు సాధించాడు. 14వ ఓవర్‌లో 4, 6, 4తో 16 పరుగులు రాబట్టిన రస్సెల్ ఎక్కడా తగ్గలేదు. రెండోఎండ్‌లో ఆరు బంతుల తేడాలో గిల్, దినేశ్ కార్తీక్ (2) ఔటైనా.. రస్సెల్ దూకుడు ఆపలేదు. బ్రాత్‌వైట్ (6)ను ప్రేక్షక పాత్రకు పరిమితం చేస్తూ 16వ ఓవర్‌లో సిక్స్, ఫోర్, తర్వాతి ఓవర్‌లో మరో సిక్స్ బాదాడు. రబడ వేసిన 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టి ఔటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 39 పరుగులు నమోదయ్యాయి. చివర్లో చావ్లా (14 నాటౌట్) వేగంగా ఆడటంతో కోల్‌కతా పోటీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మోరిస్, రబడ, పాల్ తలా రెండు వికెట్లు తీశారు.
Pant

ధవన్ నిలకడ..

179 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసి ఛేదించింది. రెండో ఓవర్‌లో రెండు సిక్సర్లతో దూకుడు చూపెట్టిన పృథ్వీ (14) తొలి వికెట్‌కు 32 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చాడు. రెండోఎండ్‌లో ధవన్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. నాలుగోఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. కానీ ఆరో ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్ (6) ఔట్‌కావడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ స్కోరు 57/2కు చేరింది. ధవన్‌తో జతకలిసిన రిషబ్ పంత్ మంచి సమన్వయాన్ని అందించాడు. వీళ్లను కట్టడి చేసేందుకు కార్తీక్.. స్పిన్నర్లను రంగంలోకి దించినా ధవన్ 32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా తొలి 10 ఓవర్లలో ఢిల్లీ 88/2 స్కోరు చేసింది. కుల్దీప్ 11వ ఓవర్‌లో బంతిని స్టాండ్స్‌లోకి పంపిన పంత్.. సింగిల్స్, డబుల్స్ రాబట్టాడు. ఈ జోడీని విడదీసేందుకు బౌలర్లు మార్చినా పెద్దగా ప్రయోజనం కనబడలేదు. ముఖ్యంగా ధవన్ ఖాళీల్లో బంతిని పంపుతూ బౌండరీలు సాధించడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. రస్సెల్ వేసిన 16వ ఓవర్‌లో పంత్.. ఓ సిక్స్, ఫోర్‌తో జోరు పెంచాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే రానాకు వికెట్ ఇచ్చుకోవడంతో మూడో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అప్పటికే చేయాల్సిన రన్‌రేట్ తక్కువగా ఉండటంతో ఇంగ్రామ్ (14 నాటౌట్) వచ్చి రావడంతో బాదుడు మొదలుపెట్టాడు. ధవన్ సెంచరీని అడ్డుకుంటూ 12 బంతుల్లో 12 పరుగులు కావాల్సిన దశలో ఓ ఫోర్, సిక్స్ కొట్టి విజయాన్ని అందించాడు.
Gill

స్కోరు బోర్డు

కోల్‌కతా నైట్‌రైడర్స్: డెన్లీ (బి) ఇషాంత్ 0, గిల్ (సి) పటేల్ (బి) పాల్ 65, ఉతప్ప (సి) పంత్ (బి) రబడ 28, రానా (బి) మోరిస్ 11, రస్సెల్ (సి) రబడ (బి) మోరిస్ 45, కార్తీక్ (సి) ధవన్ (బి) రబడ 2, బ్రాత్‌వైట్ (సి) టెవాటియా (బి) పాల్ 6, చావ్లా నాటౌట్ 14, కుల్దీప్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 178/7. వికెట్లపతనం: 1-0, 2-63, 3-93, 4-115, 5-122, 6-161, 7-171. బౌలింగ్: ఇషాంత్ 4-1-21-1, మోరిస్ 4-0-38-2, రబడ 4-0-42-2, అక్షర్ 4-0-30-0, పాల్ 4-0-46-2.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి) కార్తీక్ (బి) ప్రసిద్ద్ కృష్ణ 14, ధవన్ నాటౌట్ 97, శ్రేయాస్ (సి) కార్తీక్ (బి) రస్సెల్ 6, రిషబ్ (సి) కుల్దీప్ (బి) రానా 46, ఇంగ్రామ్ నాటౌట్ 14, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 18.5 ఓవర్లలో 180/3. వికెట్లపతనం: 1-32, 2-57, 3-162. బౌలింగ్: ప్రసిద్ద్ కృష్ణ 3-0-25-1, ఫెర్గుసన్ 3-0-37-0, రస్సెల్ 3-0-29-1, కుల్దీప్ 4-0-28-0, చావ్లా 2.5-0-35-0, బ్రాత్‌వైట్ 1-0-13-0, రానా 2-0-12-1.

357

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles