గెలిచేదెవరో?


Wed,July 11, 2018 01:22 AM

ఇంగ్లండ్‌కు చెలగాటం.. క్రొయేషియాకు సంకటం
నేడు రెండో సెమీస్

ముగింపు అంకానికి చేరుకున్న ఫిఫా ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి వేళయింది. గెలిస్తే చరిత్ర.. ఓడితే ఇంటికి అన్న నేపథ్యంలో క్రొయేషియా, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇరుజట్ల చరిత్రలో ఇంగ్లండ్ కాస్త పైచేయిలో ఉన్నా.. ఆటలో మాత్రం క్రొయేషియా అద్భుతాలు చేస్తున్నది. ఫిఫా కప్‌లో తొలిసారి ఇరుజట్ల మధ్య మ్యాచ్ కావడంలో అటు అభిమానులు, ఇటు ఆటగాళ్లు సంచలనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫేవరెట్‌ను అంచనా వేయలేకపోయినా.. అభిమానులకు కావాల్సినంత ఉత్కంఠను పంచడానికి ఇరుజట్లు రెడీగా ఉన్నాయని చెప్పొచ్చు..! రెండు దశాబ్దాలుగా ఫైనల్ బెర్త్ కోసం రెండు జట్లు అలుపెరుగని పోరాటం చేస్తుండటంతో ఈ మ్యాచ్‌లో గెలిచేదెవరో?
ivan-rakitic
మాస్కో: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రెండు జట్లపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. గ్రూప్ దశలో వీరోచిత ప్రదర్శనతో దూసుకువచ్చిన క్రొయేషియా.. ఇంగ్లండ్ మధ్య బుధవారం రెండో సెమీస్ జరుగనుంది. 1966లో ఇంగ్లండ్ సొంతగడ్డపై చాంపియన్‌గా నిలువగా, క్రొయేషియా తొలిసారి ఫిఫా కప్‌ను ముద్దాడాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. అయితే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇరుజట్లకు ఇదే తొలి సెమీస్‌ఫైనల్ మ్యాచ్ కావడంతో గట్టిపోరు అభిమానులను అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. క్వార్టర్‌ఫైనల్లో క్రొయేషియా ఆతిథ్య రష్యాను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించగా, ఇంగ్లండ్ 2-0తో స్వీడన్‌పై నెగ్గి సెమీస్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. ఇరుజట్లలో స్టార్ ఆటగాళ్లకు కొదువలేకపోయినా.. కుర్రాళ్లతో ఇంగ్లండ్ కాస్త పటిష్టంగా కనిపిస్తున్నది. దీనికితోడు అద్భుతమైన వ్యూహాలు రచించే సౌత్‌గేట్ ఉండటం కలిసొచ్చే అంశం.
John-Stones

ముఖాముఖి


అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో క్రొయేషియా, ఇంగ్లండ్ మధ్య ఆధిపత్యం సమంగా ఉంది. 2004 యూరో కప్‌లో ఇంగ్లండ్ 4-2తో గెలిస్తే, 2008 యూరో క్వాలిఫయింగ్‌లో 2-0తో ఓడించి క్రొయేషియా ప్రతీకారం తీర్చుకున్నది. 2007 యూరోలోనూ క్రొయేషియా 3-2తో నెగ్గింది. కానీ 2010 వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్‌లో ఇంగ్లండ్ 4-1, 5-1తో గెలిచి లెక్క సరిచేసింది. 1998లో తొలిసారి సెమీస్ చేరిన క్రొయేషియాకు ఇది రెండో అవకాశం కాగా, 1990 (ఇటలీ)లో ఇంగ్లండ్ చివరిసారి సెమీస్‌లోకి ప్రవేశించింది.
table

మోడ్రిక్‌ను ఆపతరమా..?


గ్రూప్ దశలో అర్జెంటీనాలాంటి మేటి జట్టును కంగుతినిపించిన క్రొయేషియాకు డిఫెన్స్ అతిపెద్ద బలం. ప్రపంచ అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్ లుకా మోడ్రిక్ (రియల్ మాడ్రిడ్)ను నిలువరిస్తే ప్రత్యర్థుల విజయం నల్లేరు మీద నడకే. కానీ తొలిసారి ఫైనల్లో చేర్చాలన్న దేశం ఆశలను మోస్తున్న మోడ్రిక్ ఇప్పటికే ఈ టోర్నీలో సంచలన ఆటతీరుతో చెలరేగిపోతున్నాడు. ఇతనికి తోడుగా ఇవాన్ రాక్టిక్ (బార్సిలోనా) కుదురుకుంటే ఇంగ్లండ్ స్ట్రయికర్లు చుక్కలు చూడాల్సిందే. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీపై అనుసరించిన వ్యూహాన్ని ఈ మ్యాచ్‌ల్లోనూ అమలు చేయాలని క్రొయేషియా భావిస్తున్నది. ఇందులో భాగంగా ఇంగ్లీష్ స్టార్ హ్యారీకేన్‌ను నిలువరించేందుకు ఈ ఇద్దరు పూర్తిగా సమాయత్తమవుతున్నారు. దీనికితోడు జట్టులో అనుభవజ్ఞులు, కుర్రాళ్లు సమతూకంగా ఉన్నారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న ఒకటి, రెండు పరిణామాలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నా.. తమ ఆటతీరుతో ఎలాంటి ప్రభావం చూపబోవని మోడ్రిక్ అంటున్నాడు.
table1

కేన్ చెలరేగితే..


ఇప్పటివరకు ఇంగ్లండ్ ఆటతీరును చూసి విశ్లేకులు, అభిమానులు విపరీతంగా ఆశ్చర్యపోతున్నారు. తమ జట్టేంటి ఇలా ఆడుతున్నదని టీవీల వైపు ఎగబడుతున్నారు. దీంతో ఊహించనిరీతిలో అభిమానుల సంఖ్య పెరిగిపోవడంతో జట్టులో ఉండే కుర్రాళ్లు కూడా సెమీస్ మ్యాచ్‌పై బాగా దృష్టిపెట్టారు. ఇంగ్లండ్ స్టార్ స్ట్రయికర్ హ్యారీకేన్ ఈ టోర్నీలో ఇప్పటికే 6 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకుపోతున్నాడు. ఇతన్ని అడ్డుకోవాలంటే క్రొయేషియా డిఫెన్స్ శక్తికి మించి కష్టపడాలి. మైదానంలో తమ పని తామ చేసుకుపోతామని, జట్టులో ప్రతి ఒక్కరి పాత్ర ఏంటో స్పష్టంగా తెలుసని మిడ్‌ఫీల్డర్ డిలీ అల్లీ స్పష్టం చేశాడు. దీనికితోడు కోచ్ గ్యారెత్ సౌత్‌గేట్ వ్యూహాలు కూడా చాలా భిన్నంగా ఉంటున్నాయి. ఒత్తిడికి దూరంగా ఉండేందుకు జట్టు మొత్తం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఓ రిసార్ట్‌లో సేద తీరుతున్నది. అయితే క్రొయేషియాతో మ్యాచ్ వీళ్లకు కఠిన పరీక్ష అని మాత్రం చెప్పొచ్చు.
modric

జట్లు (అంచనా)


క్రొయేషియా: డానిజెల్ సుబాసిక్, సిమి వ్రాసాల్జికో, డిజాన్ లోవ్రెన్, డొమాగో విడా, ఇవాన్ స్ట్రినిక్, ఇవాన్ రాక్టిక్, మార్సెల్లో బ్రోజోవిక్, అంటె రెబిక్, లుకా మోడ్రిక్, ఇవాన్ పెరిసిక్, మారియో మండ్‌జుకిక్.
ఇంగ్లండ్: జోర్డాన్ పిక్‌ఫోర్డ్, కైల్ వాకర్, జాన్ స్టోన్స్, హ్యారీ మగుయేర్, కిరాన్ ట్రిప్పి ర్, డిలీ, జోర్డా హెండర్సన్, జెస్సీ లింగార్డ్, ఆష్లే యంగ్, రహీమ్ స్టెర్లింగ్, హ్యారీ కేన్.

554

More News

VIRAL NEWS

Featured Articles