లెక్క సరిచేశారు


Tue,March 13, 2018 04:27 AM

నాలుగు వికెట్లతో శార్దుల్ విజృంభణ ..
మనీశ్, దినేశ్ మెరుపులు
లంకపై భారత్ ప్రతీకార విజయం

manish.jpg
కొలంబో: నిదహాస్ ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. వర్షం అంతరాయం మధ్య ఆలస్యంగా మొదలైన సోమవారం మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీని ద్వారా ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్న రోహిత్‌సేన లంక బెర్తుకు ఎసరు తెచ్చింది. తొలుత శార్దుల్ ఠాకూర్(4/27) బౌలింగ్ విజృంభణతో లంక కుదించిన 19 ఓవర్లలో 152/9 స్కోరు చేసింది. కుశాల్ మెండిస్(38 బంతుల్లో 55, 3ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీమ్‌ఇండియా 17.3 ఓవర్లలో 153/4 స్కోరు చేసింది. మనీశ్‌పాండే(31 బంతుల్లో 42 నాటౌట్, 3ఫోర్లు, సిక్స్), కార్తీక్( 25 బంతుల్లో 39 నాటౌట్, 5 ఫోర్లు) అద్భుతంగా రాణించారు. ధనంజయ(2/19)కు రెండు వికెట్లు దక్కాయి. నాలుగు వికెట్లతో లంకను కట్టడి చేయడంలో కీలకమైన శార్దుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది.

లక్ష్యాన్ని అలవోకగా: శ్రీలంక నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కలేదు. 22 పరుగులకే ఓపెనర్లు రోహిత్‌శర్మ(11), ధవన్(8) ఔటైయ్యి నిరాశపరిచారు. ధనంజయ తన తొలి ఓవర్లోనే రోహిత్‌ను పెవిలియన్ పంపాడు. ఆ మరుసటి ఓవర్లోనే భారీ షాట్ ఆడబోయిన ధవన్ మిడ్‌ఆన్‌లో తిసారకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకొచ్చిన రైనా(27)ఆదిలోనే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. చమీర వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో రైనా జోరు మీద కనిపించాడు. స్కోరుబోర్డు ఊపందుకుంటున్న దశలో ఫెర్నాండో బౌలింగ్‌లో రైనా అనవసరపు షాట్‌కు పోయి ఔట్ కావడంతో మూడో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యానికి ముగింపు పడింది. అప్పటికే క్రీజులో ఉన్న రాహుల్(18)కు మనీశ్ పాండే(42 నాటౌట్) జత కలిశారు. ఓవైపు రాహుల్ నెమ్మదిగా ఆడినా..మనీశ్ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. కుదురుకున్నారన్న తరుణంలో రాహుల్ హిట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్(39 నాటౌట్) జతగా మనీశ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. పసలేని లంక బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జోడించారు. వీరిని విడగొట్టేందుకు తిసార పెరెర చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా సమయోచిత ఆటతీరుతో భారత్‌కు విజయాన్ని కట్టబెట్టారు.
Shardul.jpg
శార్దుల్ విజృంభణ: తొలుత టాస్ గెలిచిన భారత్ ప్రత్యర్థి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తాను ఎదుర్కొన్న తొలి బంతినే కుశాల్ మెండిస్(55) భారీ సిక్స్‌గా మలిచాడు. తానేం తక్కువ కాదన్నట్లు గుణతిలక(17) సిక్స్‌తో ఊపుమీద కనిపించాడు. కానీ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో రైనా కండ్లు చెదిరే క్యాచ్ ద్వారా గుణతిలక తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఓవైపు సహచరుడు నిష్క్రమించినా వెనుకకు తగ్గని మెండిస్ అదే జోరు కొనసాగించాడు. సిరీస్‌లో సూపర్ ఫామ్‌మీదున్న కుశాల్ పెరెర(3)ను సుందర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. మెండిస్‌కు ఉపుల్ తరంగ(22) తోడయ్యాడు. ఇక్కణ్నుంచి లంక ఇన్నింగ్స్ స్వరూపామే మారిపోయింది. మెండిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మెండిస్‌కు జతగా తరంగ కూడా ఆడటంతో రన్‌రేట్ 10తో దూసుకెళ్లింది. అయితే విజయ్ శంకర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన తరంగ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మూడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

39 పరుగులకు 6 వికెట్లు: తిసార పెరెర(15) వచ్చి రావడంతోనే రెండు భారీ సిక్స్‌లతో అలరించినా అదే జోరు కొనసాగించలేకపోయాడు. శార్దుల్ బౌలింగ్‌లో చాహల్ సూపర్ క్యాచ్‌తో పెరెర ఔటయ్యాడు. ఇక్కణ్నుంచి లంక వికెట్ల పతనం మొదలైంది. జీవన్ మెండిస్(1), కుశాల్ మెండిస్, ధనంజయ(5), శనక(19), చమీర(0) వెంటవెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో ఆఖరి 6 వికెట్లు లంక కేవలం 39 పరుగుల తేడాతో కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్(4/27) నాలుగు వికెట్లతో విజృంభించగా, సుందర్(2/21)కు రెండు వికెట్లు దక్కాయి.

స్కోరుబోర్డు:


శ్రీలంక: గుణతిలక(సి)రైనా(బి)శార్దుల్ 17, కుశాల్ మెండిస్ (సి)రోహిత్(బి)చాహల్ 55, పెరెర(బి)సుందర్ 3, తరంగ(బి)శంకర్ 22, తిసార పెరెర(సి)చాహల్(బి)శార్దుల్ 15, జీవన్ మెండిస్(బి)సుందర్ 1, శనక(సి)కార్తీక్(బి)శార్దుల్ 19, ధనంజయ(సి)రాహుల్(బి)ఉనాద్కట్ 5, లక్మల్ 5 నాటౌట్, చమీర(సి)ఉనాద్కట్(బి)శార్దుల్ 0, ఫెర్నాండో 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు:10; మొత్తం: 19 ఓవర్లలో 152/9; వికెట్ల పతనం: 1-25, 2-34, 3-96, 4-113, 5-118, 6-120, 7-146, 8-151, 9-151; బౌలింగ్: ఉనాద్కట్ 3-0-33-1, సుందర్ 4-0-21-2, శార్దుల్ 4-0-27-4, చాహల్ 4-0-34-1, శంకర్ 3-0-30-1, రైనా 1-0-6-0.

భారత్: రోహిత్(సి)మెండిస్(బి)ధనంజయ 11, ధవన్(సి)తిసార పెరెర(బి)ధనంజయ 8, రాహుల్ హిట్‌వికెట్(బి)జీవన్ 18, రైనా(సి)తిసార (బి)ఫెర్నాండో, మనీశ్ 42 నాటౌట్, కార్తీక్ 39 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 17.3 ఓవర్లలో 153/4; వికెట్ల పతనం: 1-13, 2-22, 3-62, 4-85; బౌలింగ్: లక్మల్ 2-0-19-0, ధనంజయ 4-0-19-2, చమీర 3-0-33-0, ఫెర్నాండో 2.3-0-30-1, జీవన్ 4-0-34-1, పెరెర 2-0-17-0.

542

More News

VIRAL NEWS

Featured Articles