భారత్‌కు పతకాల పంట


Sun,April 15, 2018 12:52 AM

- కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పంచ్!
- మేరీకోమ్, సోలంకీ, వికాస్‌లకు స్వర్ణాలు
- షూటింగ్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, స్కాష్, టీటీలోనూ జోరు
- 10వ రోజు 8 స్వర్ణాలు, 5 రజతాలు సహా 17 పతకాలు
- బాక్సింగ్‌లో మేరీకోమ్, వికాస్‌క్రిషన్, గౌరవ్‌సోలంకి స్వర్ణాలు
- రెజ్లింగ్‌లో వినేశ్ ఫోగట్, సుమిత్ పసిడి పట్టు
- అథ్లెటిక్స్‌లో నీరజ్, టేబుల్ టెన్నిస్‌లో మనికా బాత్రా బంగారు మెరుపులు
Mary-Kom
కామన్వెల్త్‌లో భారత్‌కు మరో మర్చిపోలేని రోజు.. బాక్సింగ్ దిగ్గజాలు.. రెజ్లింగ్ వీరులు.. షూటింగ్ నేస్తాలు.. అథ్లెటిక్స్ అనుభవజ్ఞులు.. బ్యాడ్మింటన్ భామలు.. ఇలా బరిలోకి దిగిన ప్రతి ఈవెంట్‌లో భారత క్రీడాకారులు ఏదో ఓ పతకంతో దమ్ము చూపెట్టారు.. భారత బాక్సింగ్ చరిత్రలోనే.. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి గేమ్స్‌లో అత్యధిక పతకాలు కొల్లగొట్టి కొత్త చరిత్ర సృష్టిస్తే.. దంగల్ ధమాకాలో భారత్ పట్టు గణనీయంగా పెరిగింది. ఖాతా తెరువడమే కష్టం అనుకున్న పోటీల్లోనూ పతకం సాధించి గోల్డ్‌కోస్ట్‌ను కాస్త గోల్డ్ ఫెస్ట్‌గా మార్చేశారు. ఓవరాల్‌గా గేమ్స్ పదో రోజు అష్ట స్వర్ణ ఐశ్వర్యాన్ని తీసుకొస్తూ.. ఆసియా కప్.. టోక్యో ఒలింపిక్స్ వైపు వడివడిగా అడుగులు వేస్తుండటం శుభపరిణామం..!
Sports-Minister-Rajyavard
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్ల పంచ్ అదిరింది. దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీకోమ్.. అరంగేట్రం గేమ్స్‌లోనే స్వర్ణంతో మెరిస్తే.. మరో ఇద్దరు బాక్సర్లు, ఇద్దరు రెజ్లర్లు.. ఓ షూటర్, ఓ త్రోయర్.. టీటీ ప్లేయర్ భారతావనిని పసిడి కాంతులతో నింపారు. శనివారం జరిగిన మహిళల 48 కేజీల ఫైనల్లో మేరీ 5-0తో క్రిస్టినా ఓ హరా (నార్తర్న్ ఐర్లాండ్)పై సంచలన విజయం సాధించింది. దీంతో కామన్వెల్త్‌లో పసిడి గెలిచిన తొలి భారత మహిళా బాక్సర్‌గా రికార్డులకెక్కింది. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్, ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన మేరీ రింగ్‌లో చిరుతలా కదులుతుంటే.. క్రిస్టినా అడ్డుకోవడానికి కూడా సాహసించలేదు. ఓవరాల్‌గా మూడు రౌండ్లలో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపెట్టిన ఈ మణిపూర్ బాక్సర్ అన్ని పతకాలతో (ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ఆసియా మహిళల చాంపియన్‌షిప్, వరల్డ్ అమెచ్యూర్ చాంపియన్‌షిప్, ఆసియా ఇండోర్ గేమ్స్, ఆసియా కప్ మహిళల టోర్నీ) కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకుంది. గేమ్స్ ముగింపు కార్యక్రమంలో భారత్ తరఫున ఫ్లాగ్ బేరర్‌గా అవకాశాన్ని కూడా దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ గేమ్స్‌లో భారత బాక్సర్లు 9 పతకాలు నెగ్గి కొత్త చరిత్ర సృష్టించారు. 2010 ఢిల్లీ కామన్వెల్త్‌లో గెలిచిన ఏడు పతకాల రికార్డును బద్దలుకొట్టారు.
vinesh

డబుల్ గోల్డ్

పురుషుల 75 కేజీల ఫైనల్లో వికాస్ క్రిషన్ 5-0తో డియోడోన్ని విల్‌ఫ్రెడ్ నెసెంగ్యూ (కామోరూన్)ను ఓడించి కనకంతో మెరిశాడు. దీంతో ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత బాక్సర్‌గా వికాస్ రికార్డు సృష్టించాడు. పురుషుల 52 కేజీల ఫైనల్లో గౌరవ్ సోలంకీ 4-1తో బ్రెండన్ ఇర్విన్ (నార్తర్న్ ఐర్లాండ్)పై గెలిచి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్‌లో మూడోరౌండ్‌లో భారత బాక్సర్ నిరాశపర్చాడు. కానీ ఆరంభ రౌండ్లలో కురిపించిన పంచ్‌ల వర్షానికి వచ్చిన పాయింట్లు పసిడిని తెచ్చిపెట్టాయి.

రజత త్రయం

పురుషుల 49 కేజీల ఫైనల్లో అమిత్ పంగల్ 1-3తో గలాల్ యాఫై (ఇంగ్లండ్) చేతిలో, 60 కేజీల టైటిల్ పోరులో మనీష్ కౌశిక్ 2-3తో హారీ గార్‌సైడ్ (ఆస్ట్రేలియా) చేతిలో, +91 కేజీ ఫైనల్ బౌట్‌లో సతీష్ కుమార్ 0-5తో ఫ్రెజర్ క్లార్క్ (ఇంగ్లండ్) చేతిలో ఓడి రజత పతకాలతో సంతృప్తిపడ్డారు. ఆరంభం రౌండ్లలో ఈ ముగ్గురు మెరుగ్గానే పంచ్‌లు విసిరినా..చివర్లో నిరాశపర్చారు.
Vikas-Krishan

పట్టు బిగించారు..

భారత రెజ్లర్లు మరోసారి పట్టు బిగించారు. వినేశ్ పోగట్ (50 కేజీ), సుమిత్ (125 కేజీ) స్వర్ణాలతో మెరువగా, సాక్షి మాలిక్ (62 కేజీ), సోమ్‌వీర్ (86 కేజీ) కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్‌గా 5 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలతో భారత్ ఈ పోటీలను ముగించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌తో పోలిస్తే ఒక్క పతకం తక్కువగా వచ్చింది. అయితే స్వర్ణాలలో మాత్రం లెక్క సరిపోయింది. మహిళల 50 కేజీల ఫైనల్లో వినేశ్ పోగట్ 13-3తో జెస్సీకా మెక్‌డోనాల్డ్ (కెనడా)ను చిత్తు చేసింది. తొలి పీరియడ్‌లో ప్రత్యర్థి ఖాతా తెరువకముందే వినేశ్ 4,4,2 పాయింట్లను సాధించింది. ఓవరాల్‌గా 10 పాయింట్ల ఆధిక్యంతో స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. అంతకుముందు జరిగిన రెండు బౌట్లలో వినేశ్ 6-5తో మిసెన్నీ జెన్సిస్ (నైజీరియా)పై, 10-0తో రూపిందర్ కౌర్‌పై నెగ్గింది. 125 కేజీల ఫైనల్లో సుమిత్ 5-0తో సిన్వి బోల్టిక్ (నైజీరియా)పై గెలిచాడు. తొలి బౌట్‌లో కౌమెన్ మంగా (కామోరూన్) గాయంతో వైదొలుగడంతో సుమిత్‌కు వాకోవర్ లభించింది. తర్వాతి బౌట్లలో వరుసగా 6-4తో కొరియో జార్విస్ (కెనడా)పై, 10-4తో తయ్యబ్ రజా (పాకిస్థాన్)పై గెలిచాడు.
Sumit

సాక్షికి నిరాశ..

పోటీల్లో ఆరుగురి కంటే తక్కువ రెజ్లర్లు ఉండటంతో సాక్షి, వినేశ్ బౌట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగాయి. దీంతో తొలి రౌండ్ పోటీల్లోనే సాక్షి గోల్డ్ మెడల్‌కు దూరమైంది. 62 కేజీల తొలి బౌట్‌లో 10-0తో బెర్తీ ఎమిలిని ఇటాన్‌నగోలి (కామోరూన్)పై గెలిచినా.. రెండో బౌట్‌లో 8-11తో మిచెల్ ఫజ్జారీ (కెనడా) చేతిలో ఓడటం బాగా దెబ్బతీసింది. అయితే మూడోబౌట్‌లో 3-6తో అమినట్ అడెని (నైజీరియా) చేతిలో ఓడింది. ఇక పతకం కష్టమే అనుకున్న దశలో న్యూజిలాండ్ రెజ్లర్ తైలా ఫోర్డ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 6-5తో గెలిచి కాంస్యంతో సంతృప్తిపడింది. పురుషుల 86 కేజీల కాంస్య పతక పోరులో సోమ్‌వీర్ 7-3తో అలెగ్జాండర్ మూర్ (కెనడా)పై గెలిచాడు. ఓ దశలో 1-3తో వెనుకబడ్డా.. తర్వాతి రౌండ్లలో వీరోచితంగా పుంజుకున్నాడు. కీలకమైన రెప్‌చేజ్ రౌండ్‌లో సోమ్‌వీర్ 7-0తో జైడెన్ లారెన్స్ (ఆస్ట్రేలియా)పై గెలిచి ప్లే ఆఫ్ మ్యాచ్‌కు అర్హత సాధించాడు.

అశ్విని, సిక్కిరెడ్డికి కాంస్యం: స్కాష్‌లో భారత్ రజతంతో బోణీ కొట్టింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో దీపికా, సౌరవ్ జోడి 0-2తో డొన్నా,కామెరూన్ చేతిలో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకున్నది. బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్‌లో అశ్విని, సిక్కిరెడ్డి జోడి కాంస్యం నెగ్గగా.. సైనా, సింధు మహిళల సింగిల్స్ ఫైనల్‌కు చేరారు.

గోల్డెన్ ఫినిష్

Sanjeev-Rajput
గోల్డ్‌కోస్ట్: షూటింగ్‌లో భారత స్వర్ణ పతక జోరు పదో రోజు కూడా కొనసాగింది. సంజీవ్ రాజ్‌పుత్ 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో అగ్రస్థానంలో నిలిచి పసిడి కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో 454.5 స్కోరు నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే వ్యక్తిగతంగా మాత్రం రాజ్‌పుత్‌కు ఇది చాలా తక్కువ స్కోరు. అయినా స్వర్ణం గెలువడానికి ఈ స్కోరు సరిపోయింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన 37 ఏండ్ల ఈ హర్యానా షూటర్ తాను గతంలో ప్రతీసారి 480కి పైగా స్కోర్లు సాధించానని, ఈసారి మాత్రం స్కోరు సంతృప్తి ఇవ్వలేదని చెప్పాడు. ఏదేమైనా రాజ్‌పుత్ స్వర్ణంతో షూటింగ్‌లో భారత పసిడి పతకాల సంఖ్య 7తో ముగిసింది.

టీటీలో తొలి బంగారం

భారత టేబుల్ టెన్నిస్‌లో చరిత్రలోనే కామన్వెల్త్‌లో తొలి స్వర్ణం సాధించిన మహిళగా మనికా బాత్రా రికార్డు సృష్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో బాత్రా 4-0 (11-7, 11-6, 11-2, 11-7)తో మెంగ్యూను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో శరత్, సాతియా జోడి ఫైనల్లో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకోగా, మరో జోడి హర్మిత్, సనిల్ కాంస్యం సాధించింది.

నీరజ్.. కొత్త చరిత్ర

Neeraj-Chopra
గోల్డ్‌కోస్ట్: భారత క్రీడా చరిత్రలో నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ దక్కించుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్లో నీరజ్ పోల్‌ను 86.47మీటర్ల దూరం విసిరి ఈ సీజన్‌లోనే అత్యధిక దూరం విసిరిన రికార్డు నెలకొల్పాడు. అంతకు ముందు రోజు తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్..ఫైనల్లోనూ తొలి ప్రయత్నంలోనే ప్రత్యర్థులు చేరుకోలేని (85.50మీ) దూరాన్ని అధిగమించాడు. కామన్వెల్త్ చరిత్రలోనే జావెలిన్ త్రో విభాగంలో భారత్‌కు ఇది రెండో పతకమే. అంతకు ముందు కాశీనాథ్ నాయక్ (2010) కాంస్యం సాధించాడు. ఓవరాల్‌గా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్‌కు ఇది ఐదో స్వర్ణం మాత్రమే. మిల్కాసింగ్ (స్ప్రింటర్,1958), క్రిష్ణ పూనియా (డిస్కస్, 2010) మన్‌జీత్, సిని, అశ్విని, మన్‌దీప్ (4x 400మీ, 2010) వికాస్ గౌడ (షాట్ పుట్, 2014) స్వర్ణాలు సాధించారు.

1478

More News

VIRAL NEWS