ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు


Thu,January 12, 2017 01:39 AM

-మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీపై కోహ్లీ వ్యాఖ్య
పుణె: మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహించే రోజు తన జీవితంలో వస్తుందనుకోలేదని విరాట్ కోహ్లీ అన్నాడు. ఇప్పటికీ దీన్ని నమ్మలేకపోతున్నానని చెప్పాడు. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో బాగా ఆడాలనే తపన మాత్రమే ఉండేది. దాని ద్వారా స్థానం సుస్థిరం చేసుకొని మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలని భావిస్తుండేవాణ్ని. జట్టు విజయాలకు నా వంతు సాయం అందించాలనుకునేవాడిని. కానీ ఇలాంటి రోజు కూడా వస్తుందని నేను ఊహించలేదు. కెప్టెన్సీ విషయం ఇంకా అవాస్తవంగానే అనిపిస్తున్నది. ఇదంతా దేవుడి కృప వల్లే సాధ్యమైంది. జీవితంలో సంతోషం సరైన సమయంలో వస్తే మరింత ఆనందంగా ఉంటుంది. నాకు అలాగే జరిగింది అని కోహ్లీ పేర్కొన్నాడు. జూనియర్ స్థాయిల్లో కూడా తానే జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ భారత్‌కు సారథ్యం వహించడం చాలా భిన్నమైందన్నాడు. ఇది హాట్ సీట్ అని అభివర్ణించిన విరాట్.. విజయాలు, అపజయాలు, పొగడ్తలు, విమర్శలన్నింటికీ సిద్ధంగా ఉండాలన్నాడు. బాధ్యత పెరిగినప్పుడు తాను మరింత మెరుగైన క్రికెటర్‌గా మారుతానని, చాలా కాలంగా ఇది నిరూపితమైందన్నాడు. సారథ్యం దక్కడం ఆశ్చర్యం కలిగించకపోయినా ఓ ఆటగాడిగా మైదానంలో తాను సలహాలు ఇవ్వాలని భావిస్తుండేవాడినన్నాడు.

వాళ్ల బాటలోనే..
మాజీ సారథుల విజయ వారసత్వాన్ని తాను కాపాడుతానని భావించడం తనకు గర్వంగా ఉందని విరాట్ చెప్పాడు. మూడు ఫార్మాట్లలో దాన్ని కచ్చితంగా కాపాడుతానని హామీ ఇచ్చా డు. మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉండటం అదనపు ఒత్తిడి కలిగించబోదన్నాడు. ఇది ఒత్తిడితో కూడిన ఉద్యోగం కాదు. మూడింటికి సారథిగా ఉంటే మన చుట్టూ ఉండే వారి బలంబలహీనతలను సరిగ్గా అంచనా వేయొచ్చు. నా కెరీర్ కూడా ఇలాగే సాగింది. నేను చేసే తప్పులను కూడా ఎప్పుడూ ఉపేక్షించలేదు. వాటి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించా. మన దృక్పథం మంచిదైతే మెరుగుపడటానికి చాలా అవకాశా లుంటాయి అని విరాట్ వ్యాఖ్యానించాడు.

276
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS