హెచ్‌సీఏలో గుబులు!

Tue,March 21, 2017 12:55 AM

డెలాయిట్ నివేదికపై వివరణ ఇవ్వాలంటూ
రాష్ట్ర సంఘాలకు సీవోఏ ఆదేశాలు


HCA న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ)లాంటి రాష్ట్ర సంఘాలకు ఇది ఎదురుదెబ్బే. ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాల నిధుల పర్యవేక్షణ కోసం బీసీసీఐ నియమించిన డెలాయిట్ నివేదికలను సమీక్షిసున్నట్లు సుప్రీంకోర్టు నియమిత పరిపాలక కమిటీ (సీవోఏ) ప్రకటించింది. అంతేకాదు, డెలాయిట్ సంస్థ రూపొందించిన నివేదికలపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాలను సీవోఏ సోమవారం ఆదేశించింది. అన్ని రాష్ట్ర సంఘాల్లో నిధుల వ్యవహారాలు సక్రమంగా సాగుతున్నాయా లేదా అన్నదాన్ని సమీక్షించేందుకు గతంలో డెలాయిట్ సంస్థతో బీసీసీఐ విచారణ చేయించింది. హైదరాబాద్, అసోం, గోవా, ఢిల్లీ, బరోడా క్రికెట్ సంఘాలు పూర్తి అవినీతికూపంలో కూరుకుపోయాయని సీవోఏకు అందజేసిన తమ నివేదికలో డెలాయిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో డెలాయిట్ నివేదికలోని పూర్తి వివరాలను అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు పంపిన సీవోఏ.. అందులోని అంశాలకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. మరి.. అవినీతి ఆరోపణలపై కోర్టు కేసులకు కూడా హాజరవుతున్న హెచ్‌సీఏ లాంటి సంఘాలు ఏమని వివరణ ఇస్తాయో చూడాలి.

616
Tags

More News

మరిన్ని వార్తలు...