ప్రపంచకప్‌పై ప్రక్షాళన


Sat,July 13, 2019 02:51 AM

Vinod-Rai
- కెప్టెన్, కోచ్‌ను ప్రశ్నించనున్న సీవోఏ

లండన్: ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనపై ప్రక్షాళన చేసేందుకు క్రికెట్ పరిపాలన కమిటీ(సీవోఏ) సిద్ధమైంది. లండన్ నుంచి స్వదేశానికి చేరుకోగానే టీమ్‌ఇండియా కెప్టెన్ కోహ్లీతో పాటు, చీఫ్ కోచ్ రవిశాస్త్రితో సమావేశమై వరల్డ్‌కప్ నిష్క్రమణకు గల కారణాలను అడిగి తెలుసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ఎలాంటి రోడ్‌మ్యాప్ అనుసరించబోతున్నారనేది చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో సీవోఏ చర్చించనుంది. ఇందులో సీవోఏ చీఫ్ వినోద్‌రాయ్‌తో పాటు సభ్యులు డయానా ఎడుల్జీ, రవి తోడ్గె భాగం కానున్నారు. కెప్టెన్, కోచ్ స్వదేశానికి రాగానే వారితో మాట్లాడుతాం.

అయితే ప్రత్యేకంగా తేది, సమయమనేది ఇంకా నిర్ధారించుకోలేదు. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా సెలెక్షన్ కమిటీ రోడ్‌మ్యాప్‌పై మేము మాట్లాడుతాం అని రాయ్ అన్నారు. మరోవైపు ధవన్, శంకర్ గాయపడ్డా స్టాండ్‌బైగా ఉన్న రాయుడిని తీసుకోకపోవడంపై సీవోఏ చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. దీనికి తోడు వన్డేల్లో విఫలమవుతూ వస్తున్న దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయడం, ఒకే సమయంలో ముగ్గురు వికెట్‌కీపర్లు(ధోనీ, కార్తీక్, పంత్)ను ఆడించడంపై సీవోఏ ప్రశ్నించనుంది. మరోవైపు కివీస్‌తో కీలక సెమీస్‌లో ధోనీని ఏడో స్థానంలో పంపడంపై సీవోఏ సభ్యులు వివరణ అడుగనున్నారు. ఇక సెలెక్షన్ కమిటీ సమావేశాల్లో శరణ్‌దీప్‌సింగ్, దేవాంగ్ గాంధీ నుంచి సరైన రీతిలో ఇన్‌పుట్స్ రావడం లేదని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతున్నది.

534

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles