రద్దు జరిగేనా!


Sat,February 23, 2019 12:53 AM

Vinod-Rai
భారత్, పాక్ మ్యాచ్‌పై సీవోఏ నిర్ణయం వాయిదా

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడుతుందా అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది పాక్‌తో మ్యాచ్ విషయంలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మాజీలు ఆడి ఓడించాలని సూచిస్తుంటే..అసలు పాక్‌తో ఆడే ప్రసక్తే లేదంటూ మరికొందరు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ ఆసక్తికర పరిణామాల్లో భాగంగా శుక్రవారం క్రికెట్ పరిపాలన కమిటీ(సీవోఏ) సమావేశమైంది. సీవోఏ చీఫ్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీ, సీఈవో రాహుల్ జోహ్రీ ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. అయితే మే 30న మొదలయ్యే ప్రపంచకప్ నాటికి ఇంకా మూడు నెలల సమయముందన్న కారణంతో భారత్, పాక్ మ్యాచ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సీవోఏ భేటి ముగిసింది. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని సీవోఏ చీఫ్ రాయ్ పేర్కొన్నాడు. ఏమైనా కీలక నిర్ణయాలు వెలువెడుతాయనుకున్న ఊహాగానాల మధ్య సమావేశం తుది నిర్ణయానికి రాకుండానే ముగిసింది. దీనిపై రాయ్ మీడియాతో మాట్లాడుతూ జూన్ 16 తేదికి ఇంకా చాలా సమయముంది. ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం అని అన్నాడు. మరోవైపు పుల్వామా ఘటనను పేర్కొంటూ బీసీసీఐ ఐసీసీకి లేఖ రాసింది.

ఇందులో అన్ని దేశాలు దాడిని ఖండిస్తూ ఇప్పటికే భారత్‌కు మద్దతు ప్రకటించాయి. ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న భారత జట్టు ఆటగాళ్లు, అధికారులు, అభిమానులకు ఆతిథ్య ఇంగ్లండ్ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఐసీసీ, ఈసీబీ పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేస్తాయన్న నమ్మకం మాకుంది. అదే సమయంలో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలతో క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలని సూచిస్తాం. దుబాయ్‌లో ఈనెల 26 నుంచి మొదలయ్యే ఐసీసీ బోర్డు భేటిలో ఈ అంశాలను లేవనెత్తుతాం అని రాహుల్ జోహ్రీ లేఖలో రాసుకొచ్చాడు.

పాక్‌తో మ్యాచ్ బహిష్కరిస్తారా?

ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరిస్తుందా అన్న దానికి రాయ్ స్పందిస్తూ దీనిపై నేనేమి మాట్లాడలేను. ఏదైనా ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఇంకా మూడు నెలల సమయముంది ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం పాక్‌ను ఐసీసీ బహిష్కరించలేదు అని రాయ్ పేర్కొన్నాడు.

409

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles