చెన్నై చిందేసింది


Sat,May 11, 2019 05:22 AM

-ఫైనల్లో ధోనీసేన
-డుప్లెసిస్, వాట్సన్ అర్ధసెంచరీలు
-ఢిల్లీపై 6 వికెట్లతో విజయం
-ఆదివారం ఫైనల్లో ముంబైతో అమీతుమీ

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ఓ వైపు.. పేలవ రికార్డు ఉన్న టీమ్ మరోవైపు.. ఆడిన 10 సీజన్లలోనూ ప్లే ఆఫ్స్ చేరిన అపార అనుభవం ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. ఏడేండ్ల తర్వాత నాకౌట్ దశకు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..
ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లో ఊహించినట్లే చెన్నైదే పైచేయి అయింది. సూపర్ కింగ్స్ సీనియారిటీ ముందు జూనియర్ ఢిల్లీ నిలువలేకపోయింది. మొదట బ్యాటింగ్‌లో సైకిల్ స్టాండ్‌ను తలపించిన ఢిల్లీ.. వరుసగా వికెట్లు కోల్పోయి ఓ మోస్తరు స్కోరు చేస్తే.. ఛేదనలో డుప్లెసిస్ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్), వాట్సన్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో రెచ్చిపోవడంతో చెన్నై అలవోకగా నెగ్గి ఫైనల్ చేరింది. ఈ సీజన్‌లో చెన్నైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీని ఓటమే పలకరించింది.

విశాఖపట్నం: మాస్టర్ మైండ్ మహేంద్ర సింగ్ ధోనీ ముందు కుర్రాళ్ల పప్పులు ఉడకలేదు. ఇక్కడి వరకు లాక్కొచ్చిన రేసుగుర్రాలు చివర్లో కట్టుతప్పాయి. ఫలితంగా శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. దీంతో లీగ్‌లో కొత్త విజేతను చూసే అవకాశం లేకుండా పోయింది. ఆదివారం హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో క్వాలిఫయర్-1లో తలపడ్డ చెన్నై, ముంబై మరోసారి ఢీ కొననున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ 20 ఓవర్లలో 9 వికెట్లకు 147 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (25 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే కాస్త పోరాడగా.. మిగతావారు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో బ్రేవో, చహర్, జడేజా,హర్భజన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో డుప్లెసిస్, వాట్సన్ మెరుపు అర్ధసెంచరీలతో రెచ్చిపోవడంతో.. చెన్నై 19 ఓవర్లలో 4 వికెట్లకు 151 పరుగులు చేసింది. డుప్లెసిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Watson

అలవోకగా..

టార్గెట్ 148. మహామహులతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇదో లెక్కా. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన ఓపెనర్లు డుప్లెసిస్, వాట్సన్ హాఫ్ సెంచరీలు బాదడంతో ఛేదన మరింత సులువైంది. ఈ జోడీ మంచి బంతులను గౌరవిస్తూనే చెత్తబంతులపై విరుచుకుపడటంతో పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. తొలి రెండు ఓవర్‌లలో 4 పరుగులే వచ్చినా.. అక్షర్ బౌలింగ్‌లో 4,6తో వేగం పెంచిన డుప్లెసిస్.. ఇషాంత్ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో అదరగొట్టాడు. ఆ తర్వాత కూడా ఎక్కడ జోరు తగ్గించకుండా బాదుకుంటూ వెళ్లిన డుప్లెసిస్ 37 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా చెన్నై 10 ఓవర్లలో 81 పరుగులు చేసింది. వీరిద్దరే మ్యాచ్ ముగిస్తారేమో అనుకుంటున్న దశలో డుప్లెసిస్ ఔటయ్యాడు. మరుసటి ఓవర్‌లో వాట్సన్ పూనకం వచ్చిన వాడిలా రెచ్చిపోయాడు. పాల్ బౌలింగ్‌ను 6,4,6,6తో తుత్తునియలు చేసి 31 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్ దాటాడు. ఈ ఒక్క ఓవర్‌లోనే 25 పరుగులు రావడంతో మ్యాచ్ చెన్నై వైపు మొగ్గింది. స్వల్ప వ్యవధిలో వాట్సన్, రైనా (11), ధోనీ (9) ఔటైనా.. బ్రేవో (4 నాటౌట్)తో కలిసి రాయుడు (20 నాటౌట్; 3 ఫోర్లు) మిగతా పని పూర్తిచేశాడు. కిమో పాల్ వేసిన తొలి రెండు ఓవర్లలోనే 41 పరుగులు ఇచ్చుకోవడం ఢిల్లీ అవకాశాలను తీవ్రంగా దెబ్బకొట్టింది.

ఒకరి వెంట మరొకరు..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ నుంచి బంతినందుకున్న ప్రతీ బౌలర్ వికెట్ తీస్తూ చెన్నై విజయానికి సహకరించుకుంటూ వెళ్తే.. ఒకరి తర్వాత ఒకరు బాధ్యత మరిచి పేలవ షాట్లతో క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. గత మ్యాచ్ హీరో పృథ్వీ షా (5) ఆరంభంలోనే ఔటయ్యాడు. హ్యాట్రిక్ ఫోర్లతో ఇన్నింగ్స్‌ను బాగానే మొదలెట్టిన శిఖర్ ధవన్ (18; 3 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మున్రో (27; 4 ఫోర్లు)తో కలిసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (13) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించినా.. అదీ ఎక్కువసేపు సాగలేదు. అప్పటికే నాలుగు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించిన మున్రోకు జడేజా డగౌట్ దారిచూపాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 68/3తో నిలిచింది. అయ్యర్, పంత్ క్రీజులో ఉండటంతో పెద్ద ఇబ్బందేమి లేదనపించినా.. కెప్టెన్ వికెట్ తీసిన తాహిర్ క్యాపిటల్స్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. అక్షర్ పటేల్ (3) అతడిని అనుసరించాడు. నాలుగు ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో ఒత్తిడికి గురైన రూథర్‌ఫోర్డ్ (10) వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎట్టకేలకు ఢిల్లీ 16వ ఓవర్లో 100 పరుగుల మార్క్ దాటింది. కీమో పాల్ (3) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఈ దశలో4,6 బాదిన పంత్ స్కోరును కాస్త ముందుకు కదిలించాడు. అవతలి ఎండ్‌లో మరో బ్యాట్స్‌మన్ లేకపోవడంతో స్ట్రయిక్ రొటేట్ చేయకుండా భారీ షాట్లకు యత్నించిన పంత్ లాంగాన్‌లో బ్రేవోకు చిక్కాడు. చివర్లో మిశ్రా (6 నాటౌట్), బౌల్ట్ (6) కొన్ని విలువైన పరుగులు జతచేస్తే.. ఇన్నింగ్స్ ఆఖరి రెండు బంతులకు 4, 6 కొట్టిన ఇషాంత్ శర్మ (3 బంతుల్లో 10 నాటౌట్) ఉన్నంతలో జట్టుకు మంచి స్కోరు అందించాడు. చివరి 4 ఓవర్లలో ఢిల్లీ 45 పరుగులు చేసింది.

కొసమెరుపు..

సీజన్ ఆరంభంలో ఇరు జట్లు తారసపడ్డ తొలి మ్యాచ్‌లోనూ మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 147 పరుగులకే పరిమితమైంది. ఆ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నెగ్గిన చెన్నై శుక్రవారం సేమ్ సీన్ రిపీట్ చేసింది. ఢిల్లీ తరఫున అప్పుడు ధవన్ ఒంటరి పోరాటం చేస్తే.. తాజా మ్యాచ్‌లో ఆ బాధ్యత పంత్ భుజాన వేసుకున్నాడు. చేజింగ్‌లో అప్పుడూ చెన్నై 4 వికెట్లు కోల్పోయే లక్ష్యాన్ని ఛేదిస్తే.. ఇప్పుడూ అన్నే వికెట్లు కోల్పోయి విజయం సాధించడం కొసమెరుపు.

స్కోరు బోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (ఎల్బీ) చహర్ 5, ధవన్ (సి) ధోనీ (బి) హర్భజన్ 18, మున్రో (సి) బ్రావో (బి) జడేజా 27, అయ్యర్ (సి) రైనా (బి) తాహిర్ 13, పంత్ (సి) బ్రేవో (బి) చహర్ 38, అక్షర్ (సి) తాహిర్ (బి) బ్రేవో 3, రూథర్‌ఫోర్డ్ (సి) వాట్సన్ (బి) హర్భజన్ 10, పాల్ (బి) బ్రేవో 3, మిశ్రా (నాటౌట్) 6, బౌల్ట్ (బి) జడేజా 6, ఇషాంత్ (నాటౌట్) 10, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 147/9. వికెట్ల పతనం: 1-21, 2-37, 3-57, 4-75, 5-80, 6-102, 7-119, 8-125, 9-137, బౌలింగ్: చహర్ 4-0-28-2, ఠాకూర్ 1-0-13-0, హర్భజన్ 4-0-31-2, జడేజా 3-0-23-2, తాహిర్ 4-0-28-1, బ్రేవో 4-0-19-2.

చెన్నై సూపర్ కింగ్స్: డుప్లెసిస్ (సి) పాల్ (బి) బౌల్ట్ 50, వాట్సన్ (సి) బౌల్ట్ (బి) మిశ్రా 50, రైనా (బి) అక్షర్ 11, రాయుడు (నాటౌట్) 20, ధోనీ (సి) పాల్ (బి) ఇషాంత్ 9, బ్రేవో (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 19ఓవర్లలో 151/4. వికెట్ల పతనం: 1-81, 2-109, 3-127, 4-146, బౌలింగ్: బౌల్ట్ 4-0-20-1, ఇషాంత్ 4-0-28-1, అక్షర్ 4-0-32-1, మిశ్రా 4-0-21-1, పాల్ 3-0-49-0.

340

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles