అగాధం నుంచిఅందలానికి!


Wed,July 17, 2019 02:46 AM

-నాలుగేండ్లలో పెను మార్పులు
-ప్రపంచకప్ గెలుపు వెనుక ఇంగ్లండ్ కఠోర శ్రమ
ఉలి దెబ్బకు శిల అందమైన శిల్పంగా మారినట్లు ఎదురుదెబ్బలు తిన్నప్పుడే మనలోని అసలైన ప్రతిభ బయటికి వచ్చేది. ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలుస్తూ, ఎదురైన అవాంతరాలను అధిగమిస్తూ ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేది. అవును నాలుగేండ్ల కిందటి ఇంగ్లండ్‌ను ఇప్పటి జట్టును ఓసారి పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. గత రెండు ప్రపంచకప్‌లలో సెమీస్ చేరని ఇంగ్లిష్ జట్టు తమ సుదీర్ఘ కలను ఈసారి సాకారం చేసుకుంది. ఇన్నాళ్లు సంప్రదాయ క్రికెట్ నీడలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను నిర్లక్ష్యం చేసి మూల్యం చెల్లించుకున్న ఇంగ్లండ్ ప్రపంచకప్ లక్ష్యంగా పెనుమార్పులకు నాంది పలికింది. ఈ క్రమంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ముందుకు సాగింది. మూడుసార్లు తుదిమెట్టుపై బోల్తాకొట్టి అడుగుదూరంలో నిలిచిపోయిన ఇంగ్లండ్ ఈసారి అద్భుతంగా ఒడిసిపట్టుకుంది. న్యూజిలాండ్‌తో హోరాహోరీ ఫైనల్లో స్కోర్లు సమమైనా..అత్యధిక బౌండరీలతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఓవైపు విజేతను నిర్ణయించడంలో కీలకమైన ఐసీసీ నిబంధనలపై విమర్శల జడివాన కురుస్తున్నా..ఇన్నేండ్ల శ్రమ సాకారమైన వేళ ఇంగ్లండ్ అంతటా పండుగ వాతావరణం నెలకొన్నది.
england-Cricket-team
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: ప్రపంచకప్..జీవితంలో ఒక్కసారైనా తనివీతీరా ముద్దాడాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష. ప్రతిష్ఠాత్మకంగా భావించే కప్‌ను దక్కించుకోవడం కోసం ప్రతి జట్టు పడని కష్టం లేదు. విజయమో, వీర స్వర్గమో అన్న రీతిలో బరిలోకి దిగి జట్లు మైదానంలో చూపించే పరాక్రమం అభిమానులను మరో లోకంలోకి తీసుకెళ్తుంది. నాలుగేండ్లకోసారి జరిగే ప్రపంచకప్‌లో ఎలాగైనా విజేతగా నిలువాలనేది ఆశ, అభిమతం. కానీ అందరికీ ఆ అదృష్టం దక్కకపోవచ్చు. ఇప్పటివరకు 12సార్లు ప్రపంచకప్ జరిగితే అందరికంటే ఎక్కువ సార్లు ఆస్ట్రేలియా(5) విజేతగా నిలిస్తే భారత్, వెస్టిండీస్ రెండేసి సార్లు కప్‌ను తమ వశం చేసుకోగా, పాకిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి అందుకున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఇంగ్లండ్ కొత్తగా చేరింది. ఆట పుట్టింది, పెరిగింది ఆ దేశంలోనేనైనా ఇన్నాళ్లు కలగానే మిగిలిపోయిన కప్ ఎట్టకేలకు పుట్టింటికి చేరింది. తీరని లోటుగా మారిన ప్రపంచకప్‌ను దక్కించుకోవడం వెనుక ఇంగ్లండ్ పడ్డ శ్రమ అంతాఇంతా కాదు. నాలుగేండ్ల కిందట గ్రూప్ దశలోనే నిష్క్రమించిన నాటి నుంచి నేటి వరకు ఇంగ్లండ్ జట్టులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గత వరల్డ్‌కప్ ఆడిన ఐదుగురు క్రికెటర్లు(మోర్గాన్, రూట్, అలీ, వోక్స్, బట్లర్) మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారంటే ఎంతలా మారిపోయిందో అర్థమవుతుంది.

మోర్గాన్‌పై నమ్మకముంచుతూ

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ప్రాధాన్యమిస్తూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు సానుకూల ఫలితానిచ్చాయి. సరిగ్గా 2015 ప్రపంచకప్ టోర్నీకి రెండు నెలల ముందు అలిస్టర్ కుక్ నుంచి బాధ్యతలు అందుకున్న ఇయాన్ మోర్గాన్‌పై ఈసీబీ గట్టి నమ్మకం పెట్టుకుంది. అదే సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బెయిలిస్‌కు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అప్పగించి పాల్ ఫాబ్రెస్‌ను డిప్యూటి కోచ్‌గా నియమించింది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న క్రికెటర్లపై ఈసీబీ దృష్టిసారించి అనుకున్న ఫలితాన్ని సాధించింది. వివిధ జట్ల తరఫున దూకుడైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్న క్రికెటర్లకు మరింత సానబెట్టి జాతీయ జట్టులో అవకాశాలు కల్పించింది. జాసన్ రాయ్, బెయిర్‌స్టో, జేమ్స్ విన్స్ లాంటి వాళ్లు ఇలా వచ్చినవారే.

ఇన్నాళ్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్ అంటే భయపడుతూ వచ్చిన నేపథ్యాన్ని కోచ్ బెయిలిస్, కెప్టెన్ మోర్గాన్ పూర్తిగా మార్చేశారు. జట్టుకు దూకుడును పరిచయం చేస్తూ కొత్త సంస్కృతికి తెరతీశారు. ఆటగాళ్లకు బాధ్యతలు అప్పగిస్తూ వారిపై నమ్మకముంచుతూ ముందుకు సాగ డం కలిసొచ్చింది. 2015 ప్రపంచప్ నుంచి ఇప్పటి వరకు మిగతా జట్లతో పోలిస్తే..వన్డేల్లో అత్యధిక విజయాల శాతం ఇంగ్లండ్ (70.97)దే కావడం వారి మార్పునకు ఉదాహరణ అని చెప్పొచ్చు. దీనికి తోడు వివిధ దేశాల సమహారంగా కనిపించే ఇంగ్లండ్ జట్టులో ఆటగాళ్లు ఒక కుటుంబంలా కలిసి సమిష్టిగా ఆడటం వారి ప్రదర్శనకు తార్కాణం. ఇన్నేండ్లు పడ్డ కష్టానికి అదృష్టం కలిసొచ్చిన వేళ ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌కు అనుకున్న ఫలితం లభించింది.

ఆల్‌రౌండర్లతో కళకళ

ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టును చూస్తే ఆల్‌రౌండర్లతో కళకళలాడుతూ కనిపిస్తున్నది. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీ ఇలా మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పే ఆటగాళ్లే. జాసన్ రాయ్ నుంచి మొదలుపెడితే ఆఖర్లో ఆర్చర్ వరకు అందరూ బ్యాట్లు ఝులిపించే వారే. బరిలోకి దిగారంటే బాదుడే లక్ష్యంగా ప్రత్యర్థిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే వాళ్లే వీరంతా. ప్రపంచకప్ టోర్నీకి ముందు పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో 300 లేదా అంతకుపైగా పరుగులు సాధించిన ఇంగ్లండ్.. వన్డేల్లో సరికొత్త ఒరవడికి నాంది పలికింది. వీరి జోరు చూస్తే ప్రపంచకప్‌లో 500ల స్కోరు కూడా సాధ్యమే కావచ్చు అంటూ టీమ్‌ఇండియా కెప్టెన్ కోహ్లీ అన్నాడంటే వాళ్ల బ్యాటింగ్ ఏంటో తెలుస్తుంది.

archer

స్టోక్స్, ఆర్చర్ ఆయువుపట్టులా..

ఇంగ్లండ్ జట్టుకు ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, ఆర్చర్ ఆయువుపట్టు అని చెప్పొచ్చు. తమదైన నైపుణ్యంతో జట్టు సుదీర్ఘ కలను సాకారం చేయడంలో వీరిద్దరిది కీలక పాత్ర. మోతాదుకు మించి మద్యం తాగి వీధి గొడవలో కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్న నేపథ్యం స్టోక్స్‌ది అయితే..బార్బడోస్‌లో పుట్టి ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నేపథ్యం ఆర్చర్‌ది. తాను చేసిన తప్పునకు ప్రాయచిత్త పడి మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొని ఒకానొక పరిస్థితుల్లో క్రికెట్‌కు దూరమవుతాడనుకున్న స్టోక్స్...కెరీర్‌లో అదిరిపోయే ఆటతో ఆకట్టుకున్నాడు.

విశ్వకప్ వేదికగా తనదైన ఆల్‌రౌండ్ నైపుణ్యంతో జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించాడు. ఉపయుక్తమైన బౌలింగ్‌కు తోడు మిడిలార్డర్‌లో నమ్మకమైన బ్యాట్స్‌మన్‌గా మన్ననలు అందుకున్నాడు. ఫైనల్లో పోరాట పటిమతో జట్టు సుదీర్ఘ కలను సాకారం చేసి దిగ్గజ ఇయాన్ బోథమ్ తర్వాత ఇంగ్లండ్‌కు దొరికిన మేలిమి ముత్యంలా స్టోక్స్ నిలిచాడు. మరోవైపు ప్రపంచకప్ టోర్నీకి ముందు మూడంటే మూడు మ్యాచ్‌లు ఆడి అనూహ్యంగా జట్టులోకొచ్చిన ఆర్చర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

1009

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles