క్వార్టర్స్‌లో బ్రెజిల్


Tue,July 3, 2018 03:27 AM

-2-0 గోల్స్‌తో మెక్సికోపై విజయం
-నెయ్‌మార్ మ్యాజిక్
-బ్రెజిల్ గోల్‌మార్
-క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్..

Football
నాకౌట్ పోరులో బ్రెజిల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఫిఫా ప్రపంచకప్‌లో ఆడిన తొలిమ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ జర్మనీని ఓడించిన మెక్సికో జట్టును 2-0 గోల్స్ తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. జట్టు స్టార్ ఫార్వర్డ్ నెయ్‌మార్(51), రాబెర్టో ఫిర్మినో(88) చెరో గోల్ కొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే జర్మనీ,అర్జెంటీనా, స్పెయిన్, పోర్చుగల్ ఓటమితో టోర్నీలో స్టార్ కళతప్పిన నేపథ్యంలో బ్రెజిల్ విజయం ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులకు పండుగే.. ఫుట్‌బాల్‌కోసమే పుడుతాం..ఆట కోసమే జీవిస్తాం..గెలిచేందుకే వస్తామన్నట్లుగా బ్రెజిల్ గర్జించింది..టైటిల్ ఫేవరెట్ బిరుదుకు న్యాయం చేస్తూ..సంచలన విజయాలతో సూపర్‌ఫాంలో దూసుకెళుతున్న మెక్సికోను చిత్తు చేసి క్వార్టర్స్ చేరింది.. తొలిమ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌కే చుక్కలు చూపిన మెక్సికో..ప్రిక్వార్టర్స్‌లో బ్రెజిల్ ముందు పిల్లికూనలా మారింది.. తమపై ఆడిన 15 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు నెగ్గిన మెక్సికోను ఈసారి ఓడించడం కష్టమే అన్న అంచనాలను మాజీ చాంపియన్ బ్రెజిల్ వమ్ము చేసింది. ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నా.. ఘనవిజయంతో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది..
Brazil's-forward-Neymar
సమారా(రష్యా):ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా..బుల్లెట్ దిగిందా లేదా అన్న ఫేమస్ హీరో డైలాగ్ నిజం చేస్తూ ..బ్రెజిల్ స్టార్ ైస్ట్రెకర్ నెయ్‌మార్ ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు.. లీగ్‌దశలో అంతగా ఆకట్టుకోలేకపోయినా..కీలకమైన నాకౌట్ పోరులో అద్భుతమైన ఆటతీరుతో అదరొట్టాడు. మెక్సికోతో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో గోల్ సాధించడమే కాదు..మరో గోల్ అందించేందుకు అవసరమైన పాస్‌ను అందించి 2-0 తేడాతో మెక్సికోపై బ్రెజిల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. శుక్రవారం సమారా అరీనాలో మెక్సికోతో జరిగిన రెండోరౌండ్ పోరులో 5సార్లు ప్రపంచ చాంపియన్ బ్రెజిల్ జట్టు విజయంతో క్వార్టర్స్ చేరుకుంది. పేలవ ఆటతీరుతో మాజీ చాంపియన్లు అందరూ వెనుదిరుగుతున్న దశలో టైటిల్ ఫేవరెట్ హోదాకు న్యాయం చేస్తూ కీలకమైన సమయంలో చాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది. జట్టులోని స్టార్ నెయ్‌మార్ (51వనిమిషం), రాబెర్టో ఫిర్మినో(88వ నిమిషం)గోల్ సాధించి జట్టుకు ఘన విజయం అందించారు. మెక్సికో జట్టు ఎంతగా పోరాడినా..బ్రెజిల్ జోరును అడ్డుకోలేక పోవడంతో మరోసారి నిరాశగా ప్రపంచకప్‌నుంచి ఇంటిముఖం పట్టింది.

ఆదినుంచి హోరాహోరీ..

ఎన్నో అంచనాలు..మరెంతో ఒత్తిడితో మెక్సికో, బ్రెజిల్ మైదానంలో తలపడ్డాయి. తొలుత మెక్సికోనే దూకుడుగా ఆడడం మొదలుపెట్టింది. అద్భుతమైన ైస్ట్రెకర్లు.. ఫాంలో ఉన్న బ్రెజిల్ మిడ్‌ఫీల్డర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే దాడి చేయడమే వ్యూహంగా ఆరంభంలో మెక్సికో ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. తొలి 15 నిమిషాల్లో ఆట మొత్తం బ్రెజిల్ కోర్టులోనే సాగిందంటే మెక్సికో దూకుడు అర్థం చేసుకోవచ్చు.. తొలి రెండు నిమిషాల్లోపే మెక్సికో ఆటగాళ్లు చేసిన దాడిని గోల్‌పోస్టు ముందు బ్రెజిల్ గోల్ కీపర్ అలిసన్ అప్రమత్తతో బంతిని పక్కకు తప్పించాడు. దీంతో మెక్సికోకు కార్నర్ లభించినా.. సద్వినియోగం కాలేదు. ప్రతి క్షణం గోల్ కొట్టేలా మెక్సికో ఆటగాళ్లు దూకుడుగా ఆడుతుండడంతో బ్రెజిల్ రక్షణశ్రేణి అప్రమమత్తమైంది. ఫిలిపే లూయిస్, కౌటినో, కాసిమెరో, మిరాండా, సిల్వా అందరూ డిఫెన్స్‌కే మళ్లీ మెక్సికో దాడులను కాచుకున్నారు. అడపాదడపా బ్రెజిల్ దాడులు చేసినా డి బాక్స్ సమీపంలోనే మెక్సికో అడ్డుకోవడంతో పెద్ద మెరుపులేం కనిపించలేదు.. దీంతో ప్రథమార్ధం 0-0తో ముగిసింది..
Brazils

నెయ్‌మార్ మ్యాజిక్..

రెండో అర్ధభాగం ప్రారంభం నుంచే చాంపియన్ ఆటతీరుతో బ్రెజిల్ జట్టు దూకుడు ప్రదర్శించింది. నెయ్‌మార్‌తో కలిసిన బ్రెజిల్ మిడ్‌ఫీల్డర్లు షార్ట్‌పాస్‌లతో మెక్సికో రక్షణపంక్తిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో మెక్సికన్లు దూకుడు తగ్గించి రక్షణాత్మకంగా ఆడడం ప్రారంభించారు. ఒకవైపు బ్రెజిల్ ఫార్వర్డ్స్ నెయ్‌మార్, ఫిర్మినో ప్రమాదకరమైన దాడులతో విరుచుకుపడ్డారు. ఆట 51వ నిమిషంలో విలాన్ నుంచి అందించిన లో క్రాస్ పాస్‌ను..గోల్‌పోస్టు సమీపంలో అందుకున్న నెయ్‌మార్.. సునాయాసంగా బంతిని గోల్‌పోస్టులోకి పంపాడు. ఇటు మెక్సికో గోల్ కీపర్ సహా.. వారి డిఫెండర్లు గోల్ ఆపేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వేగంగా పరుగెత్తిన నెయ్‌మార్ .. గోల్‌తో బ్రెజిల్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. దీంతో మెక్సికో మరింతగా ఒత్తిడిలో పడింది. ప్రతి నిమిషం వారికి బ్రెజిల్ దాడులను అడ్డుకోవడమే పనిగా మారింది. ఆట 88వ నిమిషంలో నెయ్‌మార్ అందించిన క్రాస్‌ను ఫిర్మినో ఎలాంటి తడబాటు లేకుండా గోల్‌పోస్టులోకి పంపడంతో ఆట మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా.. బ్రెజిల్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరివరకు మెక్సికో గోల్ కొట్టలేకపోవడంతో బ్రెజిల్ విజయంతో క్వార్టర్స్ చేరగా..మెక్సికో ఓటమితో ఇంటిముఖం పట్టింది.

6 ప్రపంచకప్‌లో ఆరు గోల్స్ చేసిన నెయ్‌మార్.. మాజీ చాంపియన్లు రాబర్టో రివెలినో, బెబెటో రికార్డును సమం చేశాడు.

7 1994 నుంచి వరుసగా ఏడోసారి ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్ చేరిన జట్టుగా బ్రెజిల్ రికార్డు.

15 రెండేండ్ల కిందట కోపా అమెరికా కప్‌లో పెరూ చేతిలో ఓడిన తర్వాత వరుసగా 15 మ్యాచ్‌ల్లో నెగ్గిన బ్రెజిల్.

228 వరల్డ్‌కప్‌లో బ్రెజిల్ చేసిన గోల్స్ సంఖ్య. ఇప్పటివరకు జర్మనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.

605

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles