-ఐటీడీఏ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలు

భద్రాచలం, నమస్తే తెలంగాణ: ఐటీడీఏ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాల్లో భద్రాచలం జోన్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. రెండో స్థానంలో ఏటూరు నాగారం , మూడోస్థానంలో ఉట్నూర్జోన్ నిలిచాయి. భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న ఐటీడీఏ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు గురువారంతో ముగిశాయి. ముగింపు వేడుకకు భద్రాచలం ఐటీడీఏ పీవో పమేలా సత్పతి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థులు చదువుతోపాటు అదనంగా క్రీడల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ సీహెచ్ రామ్మూర్తి, తెలంగాణ రాష్ట్ర క్రీడల నిర్వహణ అధికారి వీ జ్యోతి, జిల్లా క్రీడల నిర్వాహణ అధికారి పుట్టా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.