భారత్‌తో టెస్ట్‌కు స్టోక్స్ దూరం


Tue,March 13, 2018 04:09 AM

మ్యాచ్ రోజే కేసు విచారణ

BEN-STOKES.jpg
లండన్: నైట్ క్లబ్ వివాదం ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను వెంటాడుతూనే ఉన్నది. కేసు విచారణలు అతడి మ్యాచ్‌లను అడ్డుకుంటూనే ఉన్నాయి. కోర్టు విచారణ కారణంగా యాషెస్ సిరీస్‌కు దూరమైన ఈ ఆల్‌రౌండర్, ఆగస్టులో భారత్‌తో జరుగనున్న టెస్ట్ మ్యాచ్‌కూ దూరమవుతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న స్టోక్స్.. కేసుకు సంబంధించి సోమవారం వీడియో లింక్ ద్వారా జడ్జి ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఆ కేసులో మరో ఇద్దరు నిందితులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అయితే జడ్జి తదుపరి హియరింగ్‌ను ఆగస్టు 6కు వాయిదావేశారు. ఆగస్టు 9 నుంచి లార్డ్స్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా, అదే సమయంలో స్టోక్స్ బ్రిస్టల్ క్రౌన్ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో అతడు రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం కష్టమే. ట్రయల్ సుమారు వారం రోజులపాటు జరిగే అవకాశం ఉండటంతో స్టోక్స్ లేకుండానే ఇంగ్లండ్ బరిలోకి దిగనున్నది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతుంది. సుదీర్ఘమైన భారత పర్యటన ఆగస్ట్ 1 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే తొలి టీ20తో మొదలుకానుంది.

379
Tags

More News

VIRAL NEWS