న్యూఢిల్లీ: కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. టీమ్ఇండియా ఆటగాళ్లకు ప్రవర్తనకు సంబంధించిన కౌన్సిలింగ్ ఇప్పించేందుకు పరిపాలన కమిటీ (సీవోఏ) సిద్ధమవుతున్నది. అం డర్-19, భారత్-ఎ జట్ల ఆటగాళ్లను కూడా ఇందులో భాగం చేయనున్నారు. సీనియర్ జట్టుతో పాటు కుర్రాళ్లకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని భావిస్తున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ కార్యక్రమం జరుగనుంది. ప్రొఫెషనల్ క్రీడాకారుడి జీవితంలోని ప్రతి అంశాన్ని సృశించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. లింగ భేదంపై కూడా తరగతులు ఉంటా యి అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. రాహు ల్, పాండ్యా ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్లకు ప్రత్యేక క్లాస్‌లు ఏమీ ఉండవని స్పష్టం చేశారు. ఈ ఇద్దరితో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉండే ప్రతి క్రికెటర్ ఈ సెషన్‌కు హాజరవుతారన్నారు. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న కుర్ర క్రికెటర్లకు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు అనిరుధ్ చౌదరి తెలిపారు. ఐపీఎల్ వల్ల కొంత మంది కుర్రాళ్లు మిలియనీర్లు అయ్యారు. వాళ్లు వేరే వ్యామోహంలో పడకుండా డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకునేలా ఈ సెషన్స్‌లో నేర్పుతారు. సీనియర్ జట్టుకు ఇది పెద్దగా అవసరంలేకపోయినా.. అండర్-19 కుర్రాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. కెరీర్‌ను చక్కగా మల్చుకునేలా ప్రణాళికలు ఎలా వేసుకోవాలో చెబుతారు అని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఒకరు వెల్లడించారు. శిక్షణ వ్యక్తిగతంగా లేక గ్రూప్‌లుగా ఉంటుందన్న అంశం ఇంకా తేలలేదు. ఏదైనా ఔట్సోర్సింగ్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 