ఎస్జీ బంతులే వాడుదాం


Tue,March 13, 2018 03:32 AM

కెప్టెన్-కోచ్‌ల సమావేశంలో ప్రతిపాదనలు

ముంబై: కోకబుర్రా బంతుల స్థానంలో ఎస్జీ కంపెనీ బంతులను వన్డే, టీ20లకూ ఉపయోగించాలని బీసీసీఐ సమాలోచనలు చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన వార్షిక కెప్టెన్-కోచ్‌ల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌లు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు ఎస్జీ బంతులనే వాడుతున్నారు. వన్డేలకు మాత్రం కోకబుర్రా బంతులను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మధ్య జరిగిన ముస్తాక్ అలీ టీ20, విజయ్ హజారే టోర్నీల్లో ఎస్జీ బంతులను ప్రయోగాత్మకంగా వాడారు. ఈ విషయమై క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సాబాకరీంతో చర్చ జరగ్గా, భవిష్యత్‌లో భారత్ వన్డే, టీ20లకు ఎస్జీ తెల్ల బంతులను వాడుతుందని తేల్చారు. ఇక అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దేశవాళీ మ్యాచ్‌ల్లోనూ డీఆర్‌ఎస్‌ను ఉపయోగించాలని కొందరు ప్రతిపాదించగా, ఆ అంశాన్ని పక్కనపెట్టారు. ఇటీవల బీసీసీఐ అంపైర్ల పరీక్ష కోసం తయారుచేసిన ప్రశ్నల్లో కొన్ని జోన్‌లకు సంబంధించిన అంపైర్లకు ప్రాథమిక ప్రశ్నలు సంధించారని, కొన్ని జోన్‌లకు మాత్రం అత్యంత కఠినమైన ప్రశ్నలు ఇచ్చారని ఆరోపించారు.

రంజీలో మూడు గ్రూపులే..

రంజీ ట్రోఫీలో జట్లను మూడు గ్రూపులుగా చేయాలని కొందరు కెప్టెన్లు ప్రతిపాదించారు. మొత్తం 28 జట్లను మూడు గ్రూపులకే కుదించి, ఒక గ్రూపులో పది, మిగతా రెండు గ్రూపుల్లో తొమ్మిది చొప్పున జట్లు ఉండాలని ప్రతిపాదించారు. దీని వల్ల ఆటగాళ్లకు ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుందని తెలిపారు. దాదాపు అందరు కెప్టెన్లు దీనికి మద్దతు తెలిపారు.

ఢిల్లీ డుమ్మా

ముంబైలో జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) గైర్హాజరైంది. ఈ ఏడాది ఢిల్లీ తరపున ముగ్గురు కెప్టెన్లుండగా ఒక్కరు కూడా సమావేశానికి హాజరుకాలేదు. రిషబ్ పంత్ శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. ఇషాంత్, ప్రదీప్ సాంగ్వాన్‌లలో ఒకరైనా రిప్రజెంట్ చేస్తారనుకుంటే సమావేశానికి డుమ్మా కొట్టారు.

296
Tags

More News

VIRAL NEWS