కోహ్లీకి నో రెస్ట్


Mon,July 22, 2019 03:20 AM

-అన్ని ఫార్మాట్లకు విరాటే కెప్టెన్
-విండీస్ పర్యటనకు భారత జట్ల ఎంపిక
-వన్డే, టీ20 సిరీస్‌లకు యువ ఆటగాళ్లు
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గాడితప్పిన మిడిల్ ఆర్డర్‌ను చక్కదిద్దే దిశగా విండీస్ పర్యటనకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్లను ఎంపిక చేసింది. బ్యాటింగ్‌లో మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవడంతో పాటు బౌలింగ్‌లోనూ కొత్తవారికి అవకాశమిచ్చింది. గాయం నుంచి కోలుకున్న ధావన్ టీ20, వన్డేలకు ఎంపిక కాగా.. జాదవ్‌ను 50 ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితం చేసింది. కార్తీక్‌ను పూర్తిగా పక్కనబెట్టగా, ఎడతెరిపి లేని క్రికెట్‌తో అలిసిపోయిన పాండ్యాకు పర్యటన నుంచి విశ్రాంతినిచ్చింది. సైన్యంలో సేవలందించేందుకు ధోనీ సెలెక్షన్‌కు దూరం కాగా.. పంత్ మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. టెస్టు జట్టులో తెలుగు కుర్రాడు హనుమ విహారి ప్లేస్ కాపాడుకోగా.. ప్రపంచకప్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కూ అందుబాటులోకి వచ్చాడు. ప్రపంచకప్ తర్వాత విండీస్ టూర్ నుంచి కోహ్లీకి విశ్రాంతినిస్తారనే వార్తలొచ్చినా... సెలెక్టర్లు అతడికే మూడు ఫార్మాట్ల పగ్గాలు అప్పగించారు.
kohli
ముంబై: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎంతో కాలంగా వేధిస్తున్న మిడిల్‌ఆర్డర్ సమస్య పరిష్కారం కోసం కొత్త ఆటగాళ్లతో మరో ప్రయోగానికి టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటన కోసం మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్ వైపు సెలెక్షన్ కమిటీ మొగ్గుచూపింది. టెస్టు సిరీస్‌లో తెలుగుతేజం హనుమ విహారి చోటు కాపాడుకున్నాడు. ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి అనంతరం తీవ్ర ఉత్కంఠ మధ్య ఆదివారం చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సమావేశమైన కమిటీ వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే టీ20, వన్డే, టెస్టు జట్లను ప్రకటించింది. ఈ సమా వేశంలో కెప్టెన్ కోహ్లీతో పాటు బీసీసీఐ అధికారులు పాల్గొ న్నారు.

గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపిక చేసి.. టెస్టులకు పరిగణనలోకి తీసుకోలేదు. టెస్టు అరంగేట్రంలోనే శతక్కొట్టిన యువకెరటం పృథ్వీషా గాయంతో బాధపడుతుండటంతో అతడిని పక్కనపెట్టింది. భవిష్యత్తులో ధోనీ స్థానాన్ని భర్తీ చేస్తాడని అందరూ ఆశిస్తున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలోనూ ఆడనున్నాడు. విండీస్ టూర్‌లో టీ20, వన్డేలకు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిస్తారని తొలుత వార్తలొచ్చినా.. అలాంటిదేమీ జరగలేదు. మూడు ఫార్మాట్లకు అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు పర్యటన నుంచి, స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రాకు వన్డేలు, టీ20ల నుంచి విశ్రాంతి ఇచ్చింది.

రిటైర్మెంట్ ధోనీ వ్యక్తిగతం..

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ అంశంపై ఎమ్మెస్కే మాట్లాడుతూ.. రిటైర్మెంట్ అనేది పూర్తిగా ధోనీ వ్యక్తిగతం. మహీలాంటి దిగ్గజ క్రికెటర్లకు ఎప్పుడు రిటైరవ్వాలో బాగా తెలుసు. భవిష్యత్తులో తీసుకునే చర్యలు సెలెక్షన్ కమిటీ చేతిలో ఉంటాయి. వాటి గురించి ఇప్పడే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌కు అతడు అందుబాటులో లేడు. ఆ సమాచారాన్ని మాకు చెప్పాడు. పంత్ మెరుగయ్యేందుకు కావాల్సిన అవకాశాలను అతడికి ఇస్తాం. ప్రపంచకప్ సెమీస్‌లోనూ అతడు బాగా ఆడాడు అని అన్నాడు. ప్రపంచకప్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని విస్తృతంగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైన్యంలో సేవలందించేందుకు గాను ధోనీ రెండు నెలల విరామాన్ని కోరినట్టు సమాచారం. దీన్నిబట్టి జార్ఖండ్ డైనమేట్ రిటైర్మెంట్ ఇప్పట్లో లేనట్టేనని అర్థమవుతున్నది.

సాహా ఆగమనం..

భుజం శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చాలా కాలం తర్వాత తిరిగి టెస్టు జట్టులోకి వచ్చాడు. అతడు చివరగా 2018లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడాడు. పరిమిత ఓవర్ల జట్టులో యువ పేసర్లు ఖలీల్ అహ్మద్, నవ్‌దీప్‌సైనీలు చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్‌లో అదరగొట్టిన అన్నదమ్ములు రాహుల్ చాహర్, దీపక్ చాహర్ టీ20లకు ఛాన్స్ కొట్టేశారు. గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను కూడా పరిగణించలేదు. ఇండియా-ఏ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని జట్టును ఎంపిక చేశామని ప్రకటించిన సెలెక్టర్లు... విండీస్-ఏపై సిరీస్‌లో అదరగొట్టిన యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు మాత్రం మొండిచేయి చూపారు.

rayudu

రాయుడు ట్వీట్‌ను ఆస్వాదించా..

msk
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రిటైర్మెంట్‌పై ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. ప్రపంచకప్‌లో రాయుడిని కాదని, ఇతర ఆటగాళ్లను ఎంపిక చేయడంలో ఎలాంటి పక్షపాతం చూపలేదని స్పష్టం చేశాడు. అలాగే 3డీ ట్వీట్‌గురించి మాట్లాడుతూ.. అది సమయోచిత ట్వీట్, దాన్ని నేను కూడా ఎంజాయ్ చేశా అని అన్నాడు. ప్రపంచకప్‌లో జట్టు కూర్పు వల్లే రాయుడుకు చోటు దక్కలేదని వెల్లడించాడు. గతంలో రాయుడికి ఎంతో మద్దతిచ్చామని, ఫిట్‌నెస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన సమయంలోనూ అతడికి తోడుగా నిలిచి జట్టులోకి వచ్చే విధంగా తోడ్పాటునందిచినట్టు తెలిపాడు. ధవన్‌కు గాయమైన సమయంలో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ కావాలని టీమ్ మేనేజ్‌మెంట్ అడిగినందునే పంత్‌ను ప్రపంచకప్‌నకు పంపామని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. మయాంక్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా మాత్రమే పరిగణించామని స్పష్టం చేశాడు.

విండీస్ పర్యటన షెడ్యూల్

-మూడు టీ20లు (ఆగస్టు 3,4,6)
-మూడు వన్డేలు (ఆగస్టు 8, 11, 14)
-రెండు టెస్టులు (ఆగస్టు 22-26, 30-సెప్టెంబర్ 3)
-తొలి రెండు టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనుండగా మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ వెస్టిండీస్ అతిథ్యమివ్వనుంది.

టీ20 జట్టు:

కోహ్లీ (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, మనీశ్, పంత్(వికెట్ కీపర్), జడేజా, సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, భువనేశ్వర్, కృనాల్, ఖలీల్, సైనీ.

వన్డే జట్టు:

కోహ్లీ(కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, పంత్(వికెట్ కీపర్), మనీశ్, జడేజా, కుల్దీప్, చాహల్, జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్, సైనీ.

టెస్టు జట్టు:

కోహ్లీ(కెప్టెన్), రహానే(వైస్ కెప్టెన్), మయాంక్, రాహుల్, పుజారా, విహారి, రోహిత్, పంత్ (వికెట్ కీపర్), సాహా(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, కుల్దీప్, ఇషాంత్, షమీ, బుమ్రా, ఉమేశ్.

695

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles