బంగ్లా క్రికెటర్ల సమ్మె


Tue,October 22, 2019 01:16 AM

Shakib-Al-Hasan
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మెకు దిగారు. జీతభత్యాల పెంపు సహా 11 డిమాండ్లను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ముందు ఉంచారు. సీనియర్ క్రికెటర్, టెస్టు, టీ20 కెప్టెన్ షకీబల్ హసన్ సారథ్యంలో సోమవారం మీడియా ముందు తమ డిమాండ్లను బోర్డుకు వివరించారు. మహ్ముదుల్లా, ముష్ఫీకర్ రహీమ్‌తో పాటు దాదాపు 50 మంది జాతీయ క్రికెటర్లు ఈ నిరసనలో పాల్గొన్నారు. అనంతరం తాము ఎదుర్కొంటున్న సమస్యలను షకీబ్ మీడియా దృష్టికి తీసుకొచ్చాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ల వేతనాలు పెంచాలన్నది మా ప్రధాన డిమాండ్. ప్రస్తుతం ఒక్కో మ్యాచ్‌కు 35 వేల బంగ్లా టాకాలు ఇస్తున్నారు. దాన్ని లక్షకు పెంచాల్సిన అవసరముంది. అదే సమయంలో దేశవాళీ క్రికెటర్లు దినసరి వేతనం కింద 1500 టాకాలు పొందుతున్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇది ఎంత మాత్రం సరిపోదు అందుకే 50 శాతం పెంచాలి. దీనికి తోడు ప్రయాణ ఖర్చులను మార్చాలి. ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేందుకు బీసీబీ అనుమతిస్తే సంతోషం అని షకీబ్ అన్నాడు. ఇదిలా ఉంటే బంగ్లా క్రికెటర్ల సమ్మెతో వచ్చే నెలలో జరుగాల్సిన భారత పర్యటనపై ఒకింత సందిగ్ధత ఏర్పడింది. టీమ్‌ఇండియా టూర్‌లో భాగంగా బంగ్లా జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. క్రికెటర్ల సమ్మెతో భారత పర్యటన సన్నాహక శిబిరం జరుగుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. ఒకవేళ పర్యటన రద్దయితే రెండు టెస్టులకు గాను భారత్‌కు 120 పాయింట్లు దక్కుతాయి.

బీసీబీ అంతర్గత సమస్య: భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్‌లు జరుగుతాయన్న నమ్మకముందని బీసీసీఐ కాబోయే అధ్యక్షుడు గంగూలీ అన్నాడు. క్రికెటర్ల సమ్మె అనేది బీసీబీ అంతర్గత సమస్య. అది నా పరిధిలో లేదు. జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం అని గంగూలీ పేర్కొన్నాడు. నవంబర్ 22న కోల్‌కతా వేదికగా మొదలయ్యే రెండో టెస్టు మ్యాచ్‌కు ఇరు దేశాల ప్రధానులు హాజరవుతారన్న ఊహాగానాల మధ్య తాజా సమ్మె అలజడి కల్గిస్తున్నది.

1273

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles