ఎన్నాళ్లకెన్నాళ్లకు


Sun,April 14, 2019 03:10 AM

-లీగ్‌లో తొలి గెలుపు రుచి చూసిన బెంగళూరు
-పంజాబ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం
-రాణించిన కోహ్లీ, డివిలియర్స్.. గేల్ మెరుపులు వృథా

ఈ సీజన్‌లో లయ దొరకబుచ్చుకోలేక పల్టీలు కొడుతున్న మల్టీ స్టారర్ బెంగళూరు ఎట్టకేలకు సత్తాచాటింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇప్పటి నుంచి అన్నీ మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన స్థితిలో జూలు విదిల్చింది. చేజింగ్ కింగ్ కోహ్లీతో పాటు మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ విజృంభించడంతో ఆరు పరాజయాల తర్వాత ఆర్సీబీ గెలుపు ముఖంచూసింది. అంతకుముందు యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ చివరి బంతి వరకు క్రీజులో ఉంటే ఏం జరుగుతుందో మరోసారి చూపించాడు. ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 99 పరుగులు చేసినా.. సహచరుల నుంచి సరైన సహకారం అందకపోవడంతో పంజాబ్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైతే.. చేజింగ్‌లో ఆచితూచి ఆడిన ఆర్సీబీ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ఛేదించింది.
kohli
మొహాలీ: విజయాల కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూసిన కోహ్లీసేన ఎట్టకేలకు ఏడో మ్యాచ్‌లో గెలుపు రుచి చూసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించింది. క్రిస్ గేల్ (64 బంతుల్లో 99 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అదరగొట్టడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (53 బంతుల్లో 67; 8 ఫోర్లు), డివిలియర్స్ (38 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కడంతో బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. డివిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

de-Villiers

ఆ ఇద్దరి మెరుపులు..

తొలి ఓవర్ సాదాసీదాగా సాగినా.. ఆ తర్వాత రెండు ఓవర్లలో చెరో మూడు ఫోర్లతో ఓపెనర్లు విరాట్ కోహ్లీ, పార్థివ్ పటేల్ (9 బంతుల్లో 19; 4 ఫోర్లు) 30 పరుగులు రాబట్టారు. ఇదే జోరులో మరో భారీ షాట్‌కు యత్నించిన పార్థివ్ మయాంక్‌కు క్యాచ్ ఇచ్చి డగౌట్ బాట పట్టాడు. వచ్చిరావడంతోనే 2 ఫోర్లు బాదిన డివిలియర్స్ తన ఉద్దేశం చాటాడు. ఆ తర్వాత కోహ్లీ మరో 2 ఫోర్లు బాదడంతో పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు వికెట్ నష్టానికి 63 రన్స్ చేసి మంచి స్థితిలో నిలిచింది. ఇదే ఊపులో కోహ్లీ 37 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అడపాదడపా బౌండ్రీలు బాదిన ఈ జంట రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించాక కోహ్లీ ఔటయ్యాడు. ఐపీఎల్‌లో కోహ్లీ, డివిలియర్స్ కలిసి 2789 రన్స్ జోడించారు. దీంతో కోహ్లీ-గేల్ (2787) పార్ట్‌నర్‌షిప్ రెండో స్థానానికి పరిమితమైంది. విజయానికి 5 ఓవర్లలో 48 రన్స్ అవసరమైన దశలో కోహ్లీ వెనుదిరిగడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నా స్టొయినిస్ (16 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి డివిలియర్స్ మిగతాపని పూర్తి చేశాడు. పంజాబ్ ఫీల్డర్ల తప్పిదాలు కూడా బెంగళూరుకు కలిసొచ్చాయి.

gayle

గేల్ గర్జన..

పంజాబ్ ఇన్నింగ్స్ ప్రారంభం చూసిన వారెవరైనా కింగ్స్ ఇంత తక్కువ స్కోరుకే పరిమితమైతుందని ఊహించి ఉండరు. ఆరంభంలో గేల్ విరుచుకుపడటంతో పరుగులు ప్రవాహంలా వస్తే.. ఆ తర్వాత బెంగళూరు బౌలర్లు పుంజుకొని కట్టడి చేయడంతో పంజాబ్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. గత మ్యాచ్ సెంచరీ హీరో లోకేశ్ రాహుల్ (15 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి విధ్వంసక వీరుడు క్రిస్‌గేల్ ఎడాపెడా బౌండ్రీలు బాదడంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం లభించింది. ఎదుర్కొన్న తొలి ఎనిమిది బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన గేల్.. ఆ తర్వాత గేర్లు మార్చాడు. మూడో ఓవర్‌లో ప్రారంభమైన అతడి విజృంభణ ఆరో ఓవర్‌కు వచ్చేసరికి పతాక స్థాయికి చేరింది. ఉమేశ్‌ను ఫోర్, సిక్స్‌తో వదిలేసిన విండీస్ వీరుడు హైదరాబాదీ పేసర్ సిరాజ్‌కు చుక్కలు చూపించాడు. సిరాజ్ ఓవర్‌లో వరుసగా 4,6,4,0,6,4తో మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 60/0తో నిలిచింది. ఇక పంజాబ్‌ను ఆప డం కష్టమే.. భారీ స్కోరు ఖాయం అనుకుంటున్న సమయంలో చహల్ ఓవర్‌లో రాహుల్ ఔటయ్యాడు.

ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ (15)ను కూడా చహల్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో పరుగుల వేగం తగ్గింది. సర్ఫరాజ్ ఖాన్ (15) కొన్ని చక్కటి షాట్లు ఆడినా.. ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. సిరాజ్ బౌలింగ్‌లో దిల్‌స్కూప్‌తో కీపర్ తలమీదుగా సిక్సర్ కొట్టి స్టేడియాన్ని హోరెత్తించిన సర్ఫరాజ్ ఆ వెంటనే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కరన్ (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఓ వైపు గేల్ నిలబడ్డా.. బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో స్కోరు వేగానికి బ్రేకులు పడ్డాయి. మన్‌దీప్ సింగ్ (18 నాటౌట్) అండగా అడపాదడపా భారీ షాట్లు ఆడుతూ వచ్చిన గేల్ చివరి ఓవర్‌కు వచ్చేసరికి 90పై నిలిచాడు. అయితే.. కోహ్లీ వద్ద ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో అప్పటికే భారీగా పరుగులు సమర్పించుకున్నా.. సిరాజ్‌కే చివరి ఓవర్ చాన్సిచ్చాడు. అంతకుముందుతో పోల్చుకుంటే బాగానే బౌలింగ్ చేసిన అతడు గేల్ సెంచరీని అడ్డుకోగలిగాడంతే.

స్కోరు బోర్డు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: రాహుల్ (స్టంప్డ్) పార్థివ్ (బి) చహల్ 18, గేల్ (నాటౌట్) 99, మయాంక్ (బి) చహల్ 15, సర్ఫరాజ్ (సి) పార్థివ్ (బి) సిరాజ్ 15, కరన్ (ఎల్బీ) మొయిన్ అలీ 1, మన్‌దీప్ (నాటౌట్) 18, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 173/4. వికెట్లపతనం: 1-66, 2-86 ,3-110, 4-113, బౌలింగ్: ఉమేశ్ 4-0-42-0, సైనీ 4-0-23-0, సిరాజ్ 4-0-54-1, చహల్ 4-0-33-2, మొయిన్ అలీ 4-0-19-1.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: పార్థివ్ (సి) మయాంక్ (బి) అశ్విన్ 19, కోహ్లీ (సి) మురుగన్ అశ్విన్ (బి) షమీ 67, డివిలియర్స్ (నాటౌట్) 59, స్టొయినిస్ (నాటౌట్) 28, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 19.2 ఓవర్లలో 174/2. వికెట్ల పతనం: 1-43, 2-128, బౌలింగ్: కరన్ 3-0-31-0, షమీ 4-0-43-1, అశ్విన్ 4-0-30-1, మురుగన్ అశ్విన్ 4-0-24-0, టై 4-0-40-0, సర్ఫరాజ్ 0.2-0-6-0.
ipl-table
ipl-table2

363

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles