ఒలింపిక్స్‌కు అవినాశ్‌


Sun,October 6, 2019 02:07 AM

avinash

- హీట్స్‌లోనే రిలే జట్ల నిష్క్రమణ
- నేటితో ముగియనున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌
దోహా: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ పోరు ముగిసింది. మరోసారి పతకం లేకుండానే మన అథ్లెట్లు ఉత్తచేతులతో వెనుదిరిగారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళల, పురుషుల 4x400 రిలే జట్లు కనీసం ఫైనల్‌ కూడా అర్హత సాధించలేక చతికిలపడ్డాయి. అయితే, 3000 మీటర్ల స్టిపుల్‌ చేజ్‌ ఫైనల్లో భారత అథ్లెట్‌ అవినాశ్‌ సేబల్‌ పతకం సాధించడంలో విఫలమైనా.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఒలింపిక్స్‌కు అర్హత మార్కు 8నిమిషాల 22.00సెకన్లు కాగా తుదిపోరులో లక్ష్యాన్ని 8నిమిషాల 21.37సెకన్లలో అవినాశ్‌ ఛేదించి, జాతీయ రికార్డును కూడా మెరుగుపరుచుకున్నాడు.

మహిళల 4x400 రిలేలో భారత జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. శనివారం జరిగిన హీట్‌-1లో బరిలోకి దిగిన జిస్నా మాథ్యూస్‌, పూవమ్మ రాజు, విస్మయ, వెంకటేశన్‌ సుభలతో కూడిన టీమ్‌ లక్ష్యాన్ని చేరేందుకు 3నిమిషాల 29.42 సెకన్ల సమయం తీసుకొని ఆరో స్థానంలో నిలిచి, పోటీ నుంచి నిష్క్రమించింది. ఇక పురుషుల 4x400 రిలేలోనూ సేమ్‌సీన్‌ రిపీట్‌ అయింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌ హీట్‌-2లో బరిలోకి దిగిన జాకోబ్‌, మహమ్మద్‌ అనస్‌, జీవన్‌, నోవా నిర్మల్‌టామ్‌తో కూడిన మన జట్టు లక్ష్యాన్ని 3నిమిషాల 03.09సెకన్లలో ఛేదించి ఏడో స్థానంలో నిలిచి, నిరాశపరిచింది. 16 జట్లు పోటీ పడగా 13వ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఇక పురుషుల జావెలిన్‌త్రోలో భారత అథ్లెట్‌ శివ్‌పాల్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లోని మూడు ప్రయత్నాల్లో 78.97మీటర్ల అత్యుత్తమ త్రోను నమోదు చేసి గ్రూప్‌-ఏ పదో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరలేకపోయాడు. ఆదివారంతో అథ్లెటిక్స్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు తెరపడనుంది.

295

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles