ఆసీస్ టీమ్ బస్సుపై రాళ్ల దాడి!


Thu,October 12, 2017 12:26 AM

stone గువాహటి: భారత్‌తో రెండో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. ఈ సంఘటనలో బస్సు కిటికీ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఆ సీట్లో క్రికెటర్లెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిం ది. క్రికెటర్లందరూ సురక్షితంగా ఉన్నారని అసోం క్రికెట్ అసోసియేసన్ (ఏసీఏ) తెలిపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్‌కు చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనతో క్రికెటర్లందరూ భయపడిపోయారని ఫించ్ ట్వీట్ చేశాడు. జరిగిన ఘటనకు క్షమాపణలు కోరుతున్నాం. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తాం అని అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ట్వీట్ చేశారు. ఈ దాడిలో పాల్గొన్నారనే అనుమానంతో పోలీసులు ఇప్పటికే ఇద్దర్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. భారత్‌లో పర్యటించే విదేశీ ఆటగాళ్ల భద్రత చాలా ప్రధానమైందని క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ స్పందించారు. ఈ ఘటనను ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఖండించాడు.

ఇవేమి సౌకర్యాలు..?


మరోవైపు మ్యాచ్ కవరేజ్ కోసం వచ్చిన జర్నలిస్ట్‌లకు ఏసీఏ చుక్కలు చూపెట్టింది. మీడియా బాక్స్‌లో 250 మంది జర్నలిస్ట్‌లు ఉంటే ఒకే ఒక్క టీవీతో సరిపెట్టింది. ఇంటర్నెట్ కనెక్షన్ అసలుకే లేదు. వాష్ రూమ్‌లో కరెంట్ లేదు. తినడానికి తిండి కూడా సరిగా పెట్టని పరిస్థితి. బర్సాపరాలో ఈ స్టేడియాన్ని కొత్తగా నిర్మించారు. అంతర్జాతీయ మ్యాచ్ జరుగడం ఇదే తొలిసారి. మొత్తానికి జర్నలిస్ట్‌లకు మంగళవారం రాత్రి ఓ పీడకలగా మిగిలింది.

406
Tags

More News

VIRAL NEWS