-48 పరుగులతో పాక్ చిత్తు

అడిలైడ్: బ్యాట్స్‌మెన్ కనీస ప్రతిఘటన చూపకపోవడంతో ఆస్ట్రేలియాతో జరిగిన డే అండ్ నైట్ టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 2-0తో చేజిక్కించుకుంది. పింక్ బాల్ టెస్టుల్లో ఆసీస్‌కు ఇది ఆరో విజయం కాగా.. అందులో నాలుగింటికి అడిలైడ్ వేదిక కావడం విశేషం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్ 120 పాయింట్లు చేజిక్కించుకొని మొత్తం 176 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. టీమ్ఇండియా (360) టాప్‌లో ఉంది. రెండు టెస్టులు ఆడిన పాకిస్థాన్ ఇంకా ఖాతా తెరువలేదు. ఓవర్‌నైట్ స్కోరు 39/3తో సోమవారం ఫాలోఆన్ కొనసాగించిన పాక్.. చివరకు 239 పరుగులకు ఆలౌటైంది. కంగారూ బౌలర్లు లియాన్ (5/69), హజిల్‌వుడ్ (3/63) ధాటికి మసూద్ (68), అసద్ షఫీక్ (57), రిజ్వాన్ (45) మినహా మిగిలినవారు చేతులెత్తేశారు. ట్రిపుల్ సెంచరీ హీరో డేవిడ్ వార్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', ‘మ్యాన్ ఆప్ ది సిరీస్' అవార్డులు దక్కాయి.