స్టార్క్‌కు విశ్రాంతి


Fri,November 9, 2018 12:32 AM

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు ప్రకటన
సిడ్నీ: భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును గురువారం ప్రకటించారు. ఆరోన్ ఫించ్ సారథ్యంలో 13 మంది సభ్యులను ఎంపిక చేశారు. టీమ్‌ఇండియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ప్రధాన పేసర్లు మిచెల్ స్టార్క్, పీటర్ సిడెల్, స్పిన్నర్ నాథన్ లియోన్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌లకు విశ్రాంతినిచ్చారు. వీళ్ల స్థానంలో మార్కస్ స్టోయినస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌లకు పునరాగమనం కల్పించారు. ఈనెల 21 నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది. స్వదేశంలో బిజీ షెడ్యూల్ కారణంగా ప్రధాన క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చామని కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. సమ్మర్‌తో పాటు వరల్డ్‌కప్ మాకు అత్యంత కీలకమైనవి. ఇవి ముగిసిన వెంబడే యాషెస్ కూడా ఉంది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని మంచి జట్టును ఎంపిక చేశాం. విశ్రాంతి ఇచ్చిన నలుగురు ప్లేయర్లు ఆసీస్ తరఫున అన్ని ఫార్మాట్లు ఆడేందుకు సరిపోతారు. కానీ రాబోయే టోర్నీలను దృష్టిలో పెట్టుకుని వాళ్లను రిస్క్‌లో పెట్టదల్చుకోలేదు. ఫిట్‌నెస్ లేకపోవడంతో స్టోయినిస్ యూఏఈలో ఆడలేదు. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా కూడా ఉంది. బెహ్రెన్‌డార్ఫ్ కూడా ఈ టోర్నీకి సిద్ధంగా ఉన్నాడు అని లాంగర్ పేర్కొన్నాడు. మరోవైపు ఈనెల 17న దక్షిణాఫ్రికాతో జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌కు కూడా ఇదే జట్టును సీఏ ప్రకటించింది. ఆస్ట్రేలియా టీ20 జట్టు: ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కొరే, ఎగర్, బెహ్రెన్‌డార్ఫ్, కోల్టర్‌నీల్, క్రిస్ లిన్, మ్యాక్స్‌వెల్, మెక్ డర్మెట్, షార్ట్, స్టాన్లీకి, స్టోయినిస్, టై, జంపా.

487

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles