క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ


Fri,November 8, 2019 02:51 AM

satwik
ఫుజౌ(చైనా) : ఈ ఏడాది అద్భుత ప్రదర్శనతో అలరిస్తున్న భారత బ్యాడ్మింటన్ ద్వయం రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి మరోసారి సత్తాచాటారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ - 750 చైనా ఓపెన్ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరారు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 11వ ర్యాంకు సాత్విక్ జోడీ 21-18, 21-23, 21-11 తేడాతో ఆరో సీడ్ జపాన్ ద్వయం హిరోయుకు ఇండో - యుతా వతాంబేపై విజయం సాధించింది. గంటా ఆరు నిమిషాల పాటు హోరాహోరీగా పోరు సాగింది. ప్రారంభంలో ఆధిపత్యం ప్రదర్శించిన సాత్విక్ జోడీ 10-6తో నిలిచించి. ఆ తర్వాత ప్రత్యర్థులు పుంజుకోవడంతో 14-17తో వెనుకబడింది. ఆ సమయంలో వరుసగా ఆరు పాయింట్లు సాధించడంతో భారత ద్వయం గేమ్‌ను గెలిచింది. రెండో గేమ్ చివరి వరకు హోరాహోరీగా సాగగా.. చివర్లో మెరుగ్గా ఆడిన వతాంబే జోడీ దే పైచేయి అయింది. నిర్ణయాత్మక గేమ్‌లో సాత్విక్ జోడీకి తిరుగులేకుండా పోయింది. పూర్తి ఆధిపత్యంతో ఆరో సీడ్ జంటను చిత్తుచేసి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో మూడో సీడ్ చైనా జోడీ లీజన్ హు - యుచెన్‌తో భారత ద్వయం తలపడనుంది. గత నెల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఇదే జోడీని ఓడించిన సాత్విక్ - చిరాగ్ ఫైనల్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే.

ఇక పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ 20-22,22-20, 16-21 తేడాతో నాలుగోసీడ్ అంజెర్స్ అంటోస్ (డెన్మార్క్) చేతిలో గంటా 24 నిమిషాల పాటు పోరాడి ఓడాడు. మరో మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ 13-21, 19-21తో ఏడోసీడ్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)పై పరాజయం చెందడంతో చైనా ఓపెన్ సింగిల్స్‌లో భారత పోరు ముగిసింది. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్లు సింధు, సైనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

245

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles