ఆర్చర్ సిక్సర్


Sat,September 14, 2019 12:20 AM

archer
6 వికెట్లు పడగొట్టిన పేసర్ ఆస్ట్రేలియా 225 ఆలౌట్

లండన్: యాషెస్ సిరీస్ చివరి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటికే రెండు పరాజయాలతో వెనుకబడ్డ ఆతిథ్య ఇంగ్లండ్ చివరి మ్యాచ్‌లో జోరు కనబరుస్తున్నది. బార్బడోస్ పేసర్ జోఫ్రా ఆర్చర్ (6/62) విజృంభించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌటైంది. ఈ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (80; 9 ఫోర్లు, 1 సిక్సర్) మరో చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. లబుషేన్ (48) అతడికి సహకారం అందించాడు. ఆరు ఓవర్లలోపే ఓపెనర్లు వార్నర్ (5), హారిస్ (3)ను పెవిలియన్ చేర్చిన ఆర్చర్ ఇంగ్లండ్‌కు శుభారంభం అందించాడు. ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ (3/46) కూడా ఆకట్టుకోవడంతో ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.

చివర్లో లియాన్ (25), సిడిల్ (18) విలువైన పరుగులు జతచేశారు. అనంతరం 69 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా 9 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఇంగ్లిష్ జట్టు ప్రస్తుతం 78 పరుగుల ముందంజలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 271/8తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 294 పరుగుల వద్ద ఆలౌటైంది. బట్లర్ (70; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు.

311

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles