‘అమితా’నందం


Tue,July 18, 2017 12:37 AM

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో
అమిత్‌కుమార్‌కు రజతం

లండన్: భారత పారా అథ్లెట్ అమిత్‌కుమార్ సరోహా మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తాచాటాడు. హర్యానాకు చెందిన అమిత్ వరుసగా రెండోసారి ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకంతో మెరిశాడు. సోమవారం ఇక్కడ జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో 32ఏండ్ల అమిత్‌కుమార్ క్లబ్ త్రో ఎఫ్51 పోటీల్లో రెండోస్థానంలో నిలిచి రజత పతకం అందుకున్నాడు. అమిత్ మూడోప్రయత్నంలో 30.25 మీటర్లు త్రోచేసి రెండోస్థానం సాధించాడు. సెర్బియాకు చెందిన జెజ్‌కో దిమిత్రిజెవిచ్ 31.99 మీటర్లు త్రో చేసి ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకం ఎగురేసుకుపోయాడు. కాగా, అమిత్‌కుమార్ నమోదుచేసిన 30.25 మీటర్లు ఈ టోర్నీలో సరికొత్త ఆసియా రికార్డు కావడం విశేషం.
Amit-Kumar-Saroha
మరో భారత అథ్లెట్ ధరమ్‌బీర్ 22.34 మీటర్లు త్రోచేసి పదోస్థానంతో సరిపెట్టుకున్నాడు. 2015 దోహాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌లోనూ అమిత్‌కుమార్ రజతం సాధించాడు. అంతకుముందు ఏడాది ఇంచియాన్ (కొరియా) ఆసియా పారా క్రీడల్లో ఇదే ఈవెంట్‌లో అమిత్ స్వర్ణ పతకం నెగ్గాడు. క్లబ్‌త్రోలో పతకం అందుకున్న అమిత్‌కుమార్.. మంగళవారం జరిగే డిస్కస్‌త్రో ఎఫ్52 ఈవెంట్‌లోనూ పోటీపడుతున్నాడు. అమిత్‌కుమార్ 22ఏండ్ల వయసులో కారు ప్రమాదానికి గురై వెన్నుముక విరిగిపోవడంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అంతకుముందు జాతీయస్థాయి హాకీ క్రీడాకారుడైన అమిత్.. ప్రమాదం తర్వాత పారా అథ్లెట్‌గా మారి అంతర్జాతీయస్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నాడు.

169

More News

VIRAL NEWS