అయ్యో రాయుడు..


Tue,April 16, 2019 02:31 AM

rayudu
ముంబై: రెండేండ్లకు ముందు అంబటి రాయుడు తిరిగి జాతీయ జట్టు తరఫున ఆడతాడని ఎవరూ ఊహించి ఉండరు కానీ గతేడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను వీడి చెన్నై శిబిరంలో చేరడంతో రాయుడి దశ తిరిగింది. ధోనీ సారథ్యంలో ఓపెనింగ్ చాన్స్‌తో చెలరేగిపోయిన అంబటి సీజన్ మొత్తం పరుగుల వరద పారించి సెలెక్షన్ కమిటీ తలుపు తట్టాడు. ఈ ప్రదర్శనతో ఇంగ్లండ్ టూర్‌కు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నా యో-యో టెస్టు పాస్ కాలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. అక్కడి నుంచి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టిన రాయుడు ఆ తర్వాత ఆసియా కప్‌తో పాటు విండీస్‌తో సిరీస్‌లో దుమ్మురేపాడు. దీంతో నాలుగో నంబర్‌లో రాయుడే సరైనోడు అంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవి శాస్త్రి కూడా అతడిపై నమ్మకముంచారు. కానీ.. ఆస్ట్రేలియా టూర్‌తో అంతా మారిపోయింది. షాట్ సెలెక్షన్‌తోనే ఇబ్బందిపడ్డ రాయుడు మూడో మ్యాచ్‌కే జట్టులో చోటు కోల్పోయాడు. అటునుంచి న్యూజిలాండ్ టూర్‌లో ఫర్వాలేదనిపించినా.. తిరిగి సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఉసూరుమనిపించి.. వరల్డ్‌కప్ జుట్టులో చోటు దక్కించుకోలేక పోయాడు.

రంజీలకు బైబై..

వన్డే వరల్డ్‌కప్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఎన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే అంత ప్రాక్టీస్ లభిస్తుందని అంతా అనుకుంటుంటే రాయుడు మాత్రం అందుకు భిన్నంగా.. దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. పూర్తి స్థాయిలో వన్డేలపై దృష్టి పెట్టేందుకు రంజీలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పాడు. దీంతో మ్యాచ్ ప్రాక్టీస్ కొరవడింది. దానికి తోడు నాణ్యమైన పేసర్లను ఎదుర్కోవడంలో రాయుడి డొల్లతనం బయటపడింది. ఆసీస్ గడ్డపై రిచర్డ్‌సన్ వంటి కొత్త బౌలర్‌ను ఎదుర్కోవడానికే ఇబ్బందిపడ్డ హైదరాబాదీ.. స్వింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్‌పై నిలబడగలడా అనే ప్రశ్నే మేనేజ్‌మెంట్‌కు వచ్చింది. దీంతో విజయ్ శంకర్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేశారు.

కొసమెరుపు..

ప్రస్తుతం ప్రకటించిన 15 మంది సభ్యుల్లో సగటు పరంగా చూసుకుంటే ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రాయుడు కంటే ఎక్కువ యావరేజ్‌తో పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ (59.57), ధోనీ (50.37), రోహిత్ (47.39) తర్వాత రాయుడి (47.05)దే అత్యధిక సగటు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (44.83) యావరేజ్‌తో పోల్చుకున్నా రాయుడుదే ఎక్కువ ఉండటం గమనార్హం.

506

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles