అజయ్ ఠాకూర్ విజృంభణ


Sun,August 11, 2019 01:52 AM

-గుజరాత్‌పై తమిళ్ తలైవాస్ విజయం
-ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్

అహ్మదాబాద్: సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ నిరాశ పర్చింది. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన అంచె పోటీల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 28-34తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమి పాలైంది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (4 పాయింట్లు) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. కెప్టెన్ అజయ్ ఠాకూర్ సత్తాచాటడంతో తలైవాస్ విజయం సాధించింది. 16 రైడ్లు చేసిన అజయ్ 9 పాయింట్లు సాధించగా.. మోహిత్ చిల్లర్ (5 పాయింట్లు), మన్‌జీత్ చిల్లర్ (4 పాయింట్లు)ట్యాక్లింగ్‌లో సత్తాచాటారు. గుజరాత్ తరఫున రోహిత్ గులియా (9 పాయిం ట్లు), సునీల్ కుమార్ (6 పాయింట్లు) రాణించారు. తలైవాస్‌కు ఇది మూడో విజయం కాగా.. గుజరాత్‌కు మూడో పరాజయం.
PKL

చివర్లో హైడ్రామా

మ్యాచ్ ఆరంభంలోనే రోహిత్‌ను పట్టేసిన గుజరాత్ తొలి 15 నిమిషాలు ఆధిక్యంలో కొనసాగింది. కీలక దశలో రెండుసార్లు డూ ఆర్ డై రైడ్‌లలో పాయింట్లు సాధించిన అజయ్ ఠాకూర్ తలైవాస్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇదే జోరులో ఫార్చూన్ జెయింట్స్ కోర్టు ఖాళీ చేయడంతో అదనపు పాయింట్లు ఖాతాలో చేరి తమిళ్ తలైవాస్ తొలి సగం ముగిసేసరికి 15-10తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో సగంలో తలైవాస్ పూర్తి ఆధిపత్యం కనబర్చినా.. మరో నాలుగు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. గుజరాత్ 26-25తో ముందంజ వేసింది. ఈ దశలో అజయ్ మరోసారి సూపర్ రైడ్‌తో మూడు పాయింట్లు తేవడంతో తలైవాస్ తిరిగి ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక అక్కడి నుంచి అదే ఊపు కొనసాగించిన తలైవాస్ మ్యాచ్‌ను విజయంతో ముగించింది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 32-30తో పుణేరీ పల్టన్స్‌పై గెలుపొందింది.

491

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles