క్వార్టర్స్‌లో అమిత్‌, బిస్త్‌


Wed,September 18, 2019 01:42 AM

amit

- మనీశ్‌, సంజీత్‌ కూడా..
- బాక్సింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌
ఎక్టరీన్‌బర్గ్‌ (రష్యా) : బాక్సింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అమిత్‌ పంగల్‌(52 కేజీలు), కవీందర్‌ బిస్త్‌(57 కేజీలు), మనీశ్‌ కౌశిక్‌(63 కేజీలు), సంజీత్‌(91కేజీలు) అదరగొట్టారు. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో బటుహాన్‌ సిట్‌ఫ్సి(టర్కీ)పై పంగల్‌, నాలుగో సీడ్‌ చింజోరిగ్‌ బాటర్‌సుక్‌(మంగోలియా)పై కౌశిక్‌... 5-0తో విజయం సాధించగా.. రెండో సీడ్‌ సంజర్‌ తుర్సునోవ్‌(ఉజ్బెకిస్థాన్‌)ను సంజీత్‌, అర్సలాన్‌ కటీవ్‌(ఫిన్లాండ్‌)ను కవీందర్‌ బిస్త్‌ 3-2తో మట్టికరిపించి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టారు. బౌట్‌ ప్రారంభంలోనే అమిత్‌ దూకుడుగా ఆడాడు. లెఫ్ట్‌ హుక్‌లతో చెలరేగి ప్రత్యర్థికి చుక్కలు చూపాడు. సిట్‌ఫ్సి ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించినా అడ్డుకున్నాడు. చివరి వరకు బలమైన పంచ్‌లతో అదరగొట్టిన రెండో సీడ్‌ పంగల్‌ విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో కార్లో పాలమ్‌(ఫిలిప్పీన్స్‌)తో అతడు పోటీ పడనున్నాడు. మరో ప్రిక్వార్టర్స్‌ బౌట్‌ ప్రారంభంలో జాగ్రత్తగా ఆడిన కౌశిక్‌ అదును చూసి ప్రత్యర్థి బాటర్‌సుక్‌పై పంచ్‌ల వర్షం కురిపించాడు.

చివరి మూడు నిమిషాలు దూకుడు ప్రదర్శించి 5-0తో విజయం సాధించాడు. ఒలివెరియా(బ్రెజిల్‌)తో క్వార్టర్స్‌లో కౌశిక్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇక 91కేజీల విభాగంలో రెండో సీడ్‌ తుర్సునోవ్‌ను భారత బాక్సర్‌ సంజీత్‌ 3-2తో చిత్తు చేశాడు. 52కేజీల విభాగంలో ఐదో సీడ్‌ కవీందర్‌ బిస్త్‌ ప్రత్యర్థిని బలమైన పంచ్‌లతో మట్టికరిపించి 3-2తో గెలుపొంది.. వరుసగా రెండోసారి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.

268

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles