ప్రిక్వార్టర్స్‌లో సవీటి


Sun,October 6, 2019 02:04 AM

Saweety
ఉలాన్‌ ఉదే (రష్యా): మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శనివారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మాజీ కాంస్య పతక విజేత సవీటి బూర (75కేజీలు) ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశిస్తే.. నీరజ్‌ ఫోగట్‌ (57కేజీలు) పోరాడి ఓడింది. తొలి రౌండ్‌లో సవీటి 5-0తో మంగోలియా బాక్సర్‌ ముంఖ్‌బత్‌పై సునాయాసంగా విజయం సాధించింది. పదునైన పంచ్‌లతో తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. చివరి మూడు నిమిషాల్లో మంగోలియా బాక్సర్‌ పుంజుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైంది. చివరి వరకు జోరు కొనసాగించి భారత బాక్సర్‌ విజయం సాధించగా.. ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్‌ వెల్షుమెన్‌ లారెన్‌ప్రైస్‌ను ఢీకొననుంది. అంతకుముందు జరిగిన పోటీలో నీరజ్‌ ఫోగట్‌ 2-3తో చివరి వరకు పోరాడినా.. ప్రత్యర్థి క్వియావో జేరూ(చైనా)కు అనుకూలంగా రిఫరీలు నిర్ణయం తీసుకోవడంతో ఓటమి తప్పలేదు. తొలుత ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో, పటిష్ఠమైన డిఫెన్స్‌తో ఫోగట్‌ ఆధిక్యంతో కొనసాగింది. అయితే చైనా బాక్సర్‌ లక్ష్యం లేకుండా పంచ్‌లు విసురుతున్నా.. రిఫరీలు కనీసం హెచ్చరికలు ఇవ్వలేదు. ఆమెకు అనుమతిస్తూ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఫోగట్‌ పరాజయం చెందింది. అంతర్జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య నిబంధనల మేరకు రిఫరీ నిర్ణయాలపై భారత అధికారులు నిరసన తెలిపారు. కానీ ఆ వాదనలను టెక్నికల్‌ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు.

201

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles