కొత్త చరిత్రకు సై


Tue,February 13, 2018 02:44 AM

-భారత్‌కు కలిసిరాని పోర్ట్ ఎలిజబెత్
-సిరీస్ గెలుపే కోహ్లీసేన లక్ష్యం
-సమం చేసేందుకు దక్షిణాఫ్రికా ఆరాటం
-ఈ మ్యాచ్‌కూ వాన గండం

చరిత్ర సృష్టించేందుకు విరాట్‌సేన ఆరాటం..పరువు కోసం సఫారీల పోరాటం..గత మ్యాచ్ గెలుపు అందించిన ఉత్సాహం వాళ్లది..ఓటమి నేర్పిన గుణపాఠం నుంచి పుట్టుకొచ్చిన ప్రతీకార జ్వాల మనది..వెరసి, పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగనున్న ఐదో వన్డేపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది..సిరీస్‌లో తొలిసారిగా భారత ఆధిపత్యాన్ని అడ్డుకున్న దక్షిణాఫ్రికా మరోసారి అదే ఆటతీరు కనబరిచి ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నది..మరోవైపు సిరీస్ గెలుపును ఈ మ్యాచ్‌తోనే సాధించాలని టీమ్‌ఇండియా పంతంతో ఉన్నది..మరి విరాట్ సేన పంతం నెగ్గుతుందా..? సఫారీల పట్టు కొనసాగుతుందా..? అనేది ఐదో వన్డేలో తేలనుంది.
virat
పోర్ట్ ఎలిజబెత్: మూడు దశాబ్దాల కలను సాకారం చేసుకునేందుకు ఒక్కో అవకాశం చేజారిపోయేలా కనిపిస్తున్న వేళ..టీమ్‌ఇండియా తిరిగి పుంజుకునేందుకు సిద్ధమవుతున్నది. టెస్ట్ సిరీస్‌లో చేతులా దాకా వచ్చిన మ్యాచు ల్లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. అయితే మూడో టెస్ట్‌లో పుంజుకుని ఆ తర్వాత వరుసగా మూడు వన్డేల్లోనూ గెలిచింది. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో, వాండరర్స్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని చారిత్రక సిరీస్‌ను దక్కించుకోవాలని కోహ్లీ సేన పట్టుదలతో ఉన్నది. మణికట్టు స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేసి మూడు మ్యాచుల్లోనూ ఓడిన సఫారీలు..ఆ బలహీనతనే తమ బలంగా మార్చుకున్నామని నాలుగో వన్డే ద్వారా నిరూపించారు. ఇది జట్టులో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపే అంశం. అదే జోరును మళ్లీ చూపిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు.

మార్చుకోవాల్సిందే

టీమ్‌ఇండియా సిరీస్ గెలువాలంటే ముందుగా లోపాలను సవరించుకోవాలి. ఆ తర్వాత మైదానంలో కసి చూపించాలి. భారత్ సరిదిద్దుకోవాల్సిన వాటిల్లో మొదట ఓపెనర్ రోహిత్‌శర్మ పేరే ఉంటుంది. వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ విఫలమై కేవలం 40 పరుగులే చేసిన ఈ ముంబైకర్ దక్షిణాఫ్రికా పిచ్‌లపై సత్తా చాటాలంటే ఏయే అంశాలను మెరుగుపరుచుకోవాలో.. ఇప్పటికే పలువురు మాజీలు సూచించారు. హార్ధిక్ పాండ్య.. బౌలింగ్‌లో ఫరవాలేదనిపిస్తున్నా, బ్యా టింగ్‌లో విఫలమవుతుండడం భారత్‌కు ప్రతికూలంగా మా రింది.

బౌలింగ్ విషయానికొస్తే వరుసగా మూడు మ్యాచుల్లోనూ హీరోలుగా నిలిచిన మణికట్టు స్పిన్నర్లు చహాల్, కుల్దీప్, నాలుగో వన్డేలో నిలువునా ముంచేశారు. అయితే టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం వీరి విషయంలో వెన్నుదన్నుగా నిలిచింది. వర్షం పడి మ్యాచ్‌ను కుదించడంతో పరిస్థితులు కొంత ప్రతికూలమయ్యాయని.. స్పిన్నర్లు ఒత్తిడికి గురయ్యారని చెబుతున్నది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే, ఆ ఇద్దరు స్పిన్నర్లలో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. కానీ జట్టును మార్చడం ఇష్టం లేని కోహ్లీ, అంత సాహసం చేస్తాడా అనేది వేచిచూడాలి.

ప్రత్యామ్నాయం లేదా..

రోహిత్‌ను పక్కనపెట్టి రిజర్వ్ బెంచ్‌లో ఉన్న మరొకరికి అవకాశం ఇస్తారా అంటే కష్టమనే చెప్పాలి. సరైన ప్రత్యామ్నాయం లేకపోవడమే ఇందుకు కారణం. ఒకవేళ కేదార్ జాదవ్, మనీశ్‌పాండే, శ్రేయాస్ అయ్యర్ వంటి యువ బ్యాట్స్‌మెన్‌లో ఒకరిని ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తే రాణిస్తారనేది సందేహమే. ఇప్పటికే శ్రేయాస్, జాదవ్‌కు మిడిల్‌లో అవకాశాలు వచ్చాయి. కానీ వాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. నిజానికి రోహిత్ కుదురుకుంటే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. అలాంటి ఆటగాడిని కీలకమైన మ్యాచ్‌లో పక్కనపెట్టే సాహసం చేయకపోవచ్చు. దీంతో ఈ ద్విశతక వీరుడు ఈ మ్యాచ్‌లోనైనా సత్తాచాటి భారత్ విజయంలో కీలకపాత్ర పోషిస్తే..గత వైఫల్యాలన్నీ మరుగునపడిపోతాయి.

కొత్త అస్ర్తాలుంటేనే..

ఈ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటాలంటే నాలుగో వన్డేలో దొర్లిన పొరపాట్లను సవరించుకోవాలి. ఫీల్డింగ్, క్యాచింగ్‌పై మరింత దృష్టి పెట్టాలి. పోర్ఎలిజబెత్‌లో గాలులు బాగా వీస్తాయని, క్యాచ్‌లు అందుకునే టపుడు జాగ్రత్తగాఉండాలని ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ హెచ్చరించాడు. మణికట్టు స్పిన్నర్లను ఇప్పటికే చదివేశామని చెబుతున్న సఫారీలు అందు కు తగ్గట్టుగానే నాలుగో వన్డేలో చెలరేగి ఆడారు. దీంతో ఈ మ్యాచ్‌లో చహాల్, కుల్దీప్ కొత్త అస్ర్తాలను సంధించేందుకు సిద్ధమవ్వాలి. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ బలహీనతలపై దెబ్బకొట్టాలి.

ఆమ్లా పరీక్ష

సరైన ఓపెనింగ్ భాగస్వామ్యం లేకపోవడం దక్షిణాఫ్రికా జట్టును వేధిస్తున్న సమస్య. గత నాలుగు మ్యాచుల్లో హషీమ్ ఆమ్లా (16,23,1,33) , కెప్టెన్ మార్క్రమ్ (9,8,32,22) స్కో ర్లతో విఫలమయ్యారు. దీంతో ఈసారి ఈ జోడీ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగేందుకు వ్యూహరచన చేసింది. డివిలీయర్స్, డుమినీ, మిల్లర్, క్లాసెన్‌తో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తున్నది. బెహార్డిన్, మోరిస్‌లలో ఒకరికే అవకాశం దక్కనుంది. గత మ్యాచ్‌లో దుమ్మురేపిన పెలుక్వాయో తన స్థానాన్ని పదిలపరుచుకోగా..పేస్ బౌలర్లు రబాడ, మోర్కెల్ కొనసాగనున్నారు. ఈ మ్యాచ్ కోసం స్పిన్నర్‌ను బరిలోకి దింపాలని భావిస్తున్న దక్షిణాఫ్రికా.. తాహీర్, షమ్సిల్లో ఒకరిని తీసుకునే చాన్స్ ఉంది.

పిచ్, వాతావరణం

దక్షిణాఫ్రికాలోని మిగతా పిచ్‌లతో పోలిస్తే ఇది స్లో వికెట్ అని చెప్పాలి. గత 5 మ్యాచుల్లో మూడొందలకు పై చిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఛేజింగ్ చేసిన జట్టు ఇక్కడ ఎక్కువ సార్లు గెలిచింది. ఉదయం ఎండ తీవ్రత ఉన్నా..సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉంది.

జట్లు (అంచనా)


భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, రహానే, శ్రెయాస్/జాదవ్, ధోనీ, పాండ్య, చహాల్, కుల్దీప్, బుమ్రా, భువనేశ్వర్.
దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమినీ, డివిలీయర్స్, మిల్లర్, క్లాసెన్, బెహార్డిన్/మోరిస్, పెలుక్వాయో, రబాడ, మోర్కెల్, తాహీర్
rajput

మన ఓటమికి కారణం ఇతడే..!

మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ స్పిన్ విజృంభణతో దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉండగా పరిస్థితి తారుమారైంది. జొహాన్నెస్‌బర్గ్‌లో మన ఓటమి వెనుక ఎవరున్నారా అన్నది సగటు క్రికెట్ అభిమానిని వేధిస్తున్న ప్రశ్న. కోహ్లీసేన జోరుకు అడ్డుగా నిలిచింది భారత్‌కే చెందిన అజయ్ రాజ్‌పుత్ అనే స్పిన్నర్. కుడిచేతి స్పిన్నర్‌గానే గాకుండా లెగ్‌స్పిన్ ఇతని అదనపు బలం.

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎక్కడా తడబడుతున్నారో నెట్స్‌లో గుర్తించాడు. అందుకు తగ్గట్లు బౌలింగ్ చేయడం సఫారీలకు కలిసొచ్చింది. ఫలితం చాహల్, కుల్దీప్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ క్లాసెన్, మిల్లర్ పరుగులు కొల్లగొట్టి విజయం అందించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అజ య్..ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జొహాన్నెస్‌బర్గ్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాడు. ఇతని ప్రతిభను గుర్తించిన జొహాన్నెస్‌బర్గ్ క్రికెట్ క్లబ్ చైర్మన్ ఫోన్ చేసి వారి బ్యాట్స్‌మెన్‌కు బంతులు వేయాలని కోరడం సిరీస్ ఫలితాన్ని నిర్దేశించడంలో కీలకమైంది.

పదివేల మైలురాయిని చేరుకోవడానికిధోనీకి కావల్సిన పరుగులు.46
పోర్ట్ ఎలిజబెత్‌లో భారత్ ఆడిన మ్యాచ్‌లు. అన్నింటిలోనూ ఓడింది.5
ఇక్కడ జరిగిన 32 మ్యాచ్‌లల్లో లక్ష్య ఛేదనలో గెలిచినవి.17
ఈ మైదానంలో టీమ్ ఇండియా అత్యధిక స్కోరు.178

561

More News

VIRAL NEWS